అంకిత(ఫైల్)
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
తొర్రూరులో ఘటన
తెలంగాణ: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. నర్సంపేటకు చెందిన చిన్నపల్లి అంకిత (25) తొర్రూరు పట్టణంలో నివాసముంటోంది. కొడకండ్ల మండల కేంద్రంలోని పోస్టల్ శాఖలో ఏడీ డీఏ(ఎక్స్‌ట్రా డిపార్ట్‌మెంటల్ డెలివరీ ఏజెంట్)గా ఉద్యోగం చేస్తోంది.
ఆమె భర్త మందుల శశికాంత్ నర్సంపేట మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో తరుచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొడకండ్లలో అంకిత విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఫోన్‌లో ఇరువురు గొడవపడ్డారు. దీంతో అంకిత మంగళవారం మధ్యాహ్న విధులు ముగించుకుని ఇంటికి వచ్చింది.
గొడవలతో మనస్తాపం చెందిన ఆమె తొర్రూరులో అద్దెకు ఉండే నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దంపతులకు కుమార్తె ఉండగా కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. ఘటనా స్థలికి అదనపు ఎస్సై ఖాదర్‌పాషా చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గమనిక..
మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com
ఇదీ చదవండి: నేను ముందు వెళ్తున్నాను.. తాను ఉదయం వెళ్తుందని చెప్పి...


