శ్రీనివాస్, శిరీష(ఫైల్)
హైదరాబాద్: మాయమాటలతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో నిరాకరించాడు. హత్య చేసి పారిపోయాడు. ఎస్‌ఆర్‌నగర్ ధరంకరం రోడ్డు గోకుల్ ప్రైడ్ లాడ్జిలో ఈ ఘటన జరిగింది. ఏసీపీ రాఘవేంద్రరావు, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాలు.. వికారాబాద్ జిల్లా ధారూర్ నాగసమందర్‌కు చెందిన బేగరి శిరీష (34) కస్టమర్ కేర్ సెంటర్‌లో పనిచేస్తోంది.
తాండూరు ఓబులాపూర్ గ్రామ వాసి, పాత నేరస్థుడు అవుసలపల్లి శ్రీనివాస్ (38)తో ఆమెకు పరిచయమైంది. . 2013లో వివాహమై విడాకులు తీసుకున్నట్లు శిరీష తెలిపినా సమ్మతించాడు. నమ్మించి తరచూ లాడ్జికి తీసుకెళ్లేవాడు. వీరి విషయం శిరీష కుటుంబానికి తెలియడంతో ఇద్దరినీ మందలించారు. శిరీష ఒత్తిడితో శ్రీనివాస్ గుడిలో తాళి కట్టాడు. ఈ నెల 24న అర్ధరాత్రి గోకుల్ లాడ్జికి తీసుకెళ్లాడు. 28న రాత్రి హత్య చేశాడు.
తాను గది ఖాళీ చేస్తున్నానని, శిరీష ఉదయం వెళ్తుందని చెప్పిన శ్రీనివాస్.. బిల్లు చెల్లించి తెల్లవారుజామున 3.30కు వెళ్లిపోయాడు. ఉదయం కాలింగ్ బెల్ కొట్టినా స్పందన లేకపోవడంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తెరవగా గాయాలతో శిరీష్ మంచంపై విగతజీవిగా పడి ఉంది. తెల్లవారుజామున వరకు వారి గది నుంచి శబ్దాలు వచ్చినట్లు పక్క గది వ్యక్తి తెలిపాడు. శిరీష సోదరుడు రవీందర్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను రోకలి బండతో దారుణంగా..


