కుటుంబ కలహాలతో రెండేళ్లు విడిగా ఉన్న దంపతులు
నెల క్రితమే మళ్లీ ఒక్కటయ్యారు.. ఇంతలోనే దారుణం
తెలంగాణ: దంపతుల మధ్య కలహాలు చివరకు హత్యకు దారితీశాయి. వేధింపులతో విసిగిపోయిన మహిళ చివరకు కట్టుకున్నవాడిని కడతేర్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. నగరంలోని బృందావనం కాలనీ, రోడ్ నంబర్ 4లో నివసిస్తున్న వైద్య మోహన్(45)ను సోమవారం ఆయన భార్య హతమార్చింది.
సీఐ ప్రమోద్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సెగ్యామ్ గ్రామానికి చెందిన మోహన్(45)కు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌కు చెందిన జమునతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి కుమారుడు రామ్‌చరణ్, కూతురు ఉన్నారు. మోహన్ బంధువులు మంచిర్యాలలో వ్యాపారాలుచేస్తూ స్థిరపడ్డారు. దీంతో మోహన్ కూడా కుటుంబంతో మంచిర్యాలలోనే ఉంటున్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అయితే కొంత కాలంగా జమున, మోహన్ కలహాలు తలెత్తాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా మోహన్ తీరులో మార్పు రాలేదు. దీంతో జమున కూతురును తీసుకుని జైనూర్‌లోని పుట్టింటికి వెళ్లింది. రెండేళ్లు దూరంగా ఉన్నారు. మోహన్ ఓ యూట్యూబ్ చానల్ ఎండీగా పనిచేస్తూ తన బావ వెంకన్న ఇంట్లో ఉంటున్నాడు. కొడుకు రామ్‌చరణ్ హైదరాబాద్‌లోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.
ఈ క్రమంలో మూడు నెలల క్రితం బంధువులు మరోసారి పంచాయితీ నిర్వహించి మోహన్, జమునను కలిపారు. దీంతో జమున కూతురుతో మళ్లీ మంచిర్యాలకు వచ్చింది. కొన్ని రోజులుగా అంతా సద్దుమణిగినట్లు కనిపించింది. ఈ క్రమంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు తల్లిగారింటికి వెళ్లిన జమునను నాలుగు రోజుల క్రితం మోహన్ తీసుకొచ్చాడు. సోమవారం రాత్రి మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వివాహం అయిననాటి నుంచి వేధింపులు భరించిన జమున, ఎదిగిన కూతురు, కుమారుడు ఉన్న నేపథ్యంలో ఈ బాధలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు.
గొడవ తర్వాత గదిలో పడుకున్న మోహన్ తలపై జమున రోకలి బండతో కొట్టింది. దీంతో నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. అనంతరం 112 నంబర్‌కు ఫోన్‌చేసి హత్య విషయం పోలీసులకు తెలిపింది. మృతుని తండ్రి వైద్య చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. కాగా, మోహన్‌కు ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు జమునతో పాటు ఆమె కూతురును అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: చొర‘బడి’.. తెగబడ్డారు


