లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేస్తున్న మంత్రి పొంగులేటి
ఎన్నికల్లోపు రెండు, మూడు, నాలుగో విడతల ఇళ్ల ప్రక్రియ ప్రారంభిస్తాం
రెడ్‌హిల్స్‌లో ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల నాటికి 4 విడతల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలను ప్రారంభించి, ప్రజా ప్రభుత్వ హయాంలోనే సంపూర్ణంగా పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అప్పగిస్తామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.మంగళవారం హైదరాబాద్ నాంపల్లి నియోజక వర్గంలోని రెడ్‌హిల్స్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసి సభలో ప్రసంగించారు. మొదటి విడతలో ఇళ్లు రాని వారు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే రెండు, మూడు, నాలుగు విడతల ప్రక్రియ లను ప్రారంభించి అర్హులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. గతంలో పేదలకు నగరానికి 30–40 కిలోమీటర్ల దూరంలో ఇళ్లను కేటాయించి వారి జీవనోపాధిని దెబ్బతీశారని మంత్రి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కానీ తమ ప్రజా ప్రభుత్వం నగరంలోని ప్రధానమైన, అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోనే పేద కుటుంబాలకు ఇళ్లను నిర్మిస్తోందన్నారు. లబ్ధిదారులపై పైసా భారం పడకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వమే నిర్వహిస్తుందని హామీ ఇచ్చారు. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర ఆర్థిక అవసరాల కోసం ఈ ఇళ్ల పత్రాల ఆధారంగా బ్యాంకుల నుంచి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరును లబ్ధిదారులే స్వయంగా పరిశీలించేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణాలు పూర్తయ్యాక మురుగునీటి వ్యవస్థ, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.హైదరాబాద్ నగర పరిధిలోని కోర్ రీజియన్‌లోని 20 నియోజకవర్గాల్లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే స్థలాలను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజహరుద్దీన్ , ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. గృహనిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, కలెక్టర్ ప్రియాంక అలా తదితరులు పాల్గొన్నారు. అనంతరం లక్కీడ్రాలో విజేతలైన లబ్దిదారులకు ఇళ్ల నెంబర్ల కేటాయిస్తూ వారి పేర్లను ప్రకటించారు.


