ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంకా గాంధీలతో పార్టీ నేతల గ్రూప్ ఫొటో. చిత్రంలో సీఎంలు సుఖ్వీందర్‌సింగ్, డీకే శివకుమార్, సతీశన్, రేవంత్‌రెడ్డి, పార్టీ సీనియర్లు కేసీ వేణుగోపాల్, దీపా దాస్ మున్షీ, దామోదర తదితరులు
బీజేపీ పెద్దలు ఆడించినట్లు ఈసీ ఆడుతోంది
సీడబ్ల్యూసీ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘమే రాజకీయ కుట్రలకు కేంద్రంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. పౌరులకు ప్రజాస్వామ్యబద్ధంగా సంక్రమించిన ఓటు హక్కును ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పేరుతో తొలగించి, దానిని ఓ రాజకీయ పార్టీకి మేలుచేసే అస్త్రంగా మార్చే ప్రయత్నాలను ఈసీ చేస్తోందని ఆరోపించారు. ఈ అంశంలో బీజేపీ పెద్దలు చెప్పినట్లు ఈసీ నడుచుకుంటోందని, ఇందులో కుమ్మక్కైనట్లు స్పష్టంగా కనబడుతోందన్నారు. రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొని మాట్లాడారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా ఏకపక్షంగా 13 కోట్లకు పైగా ఓటర్లను తొలగించడం, ఎన్నికల సంఘం స్వతంత్రత, ఓటర్ల జాబితా విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలు తలెత్తే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదే సమయంలో కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం–6లో మార్పులు చేయడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ మార్పులు చట్టబద్ధంగా జరగలేదని, ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు పొందే యువతకు ఇబ్బందులు కలిగించేలా నిబంధనలు మారాయని ఆరోపించారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను నిర్దోషిగా చూపించేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని, దీనిద్వారే వారి కుమ్మక్కు అర్థమవుతోందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర కాంగ్రెస్ యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను సేకరించి నమోదు చేయడం, సంబంధిత వివరాలను పద్ధతిగా డాక్యుమెంట్ చేయడం వంటి చర్యలపై దృష్టి సారించాలని సూచించారు. బూత్‌స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత క్రియాశీలం చేసి, ఓటర్ల జాబితాలకు సంబంధించిన అంశాలపై క్షేత్రస్థాయిలో పనిచేయాలని రాష్ట్ర యూనిట్లకు దిశానిర్దేశం చేసే అవసరాన్ని నొక్కిచెప్పినట్లు తెలిసింది.


