స్వాధీనం చేసుకున్న డ్రోన్లు, విడి భాగాలు
న్యూఢిల్లీ: చిమ్మచీకట్లోనూ స్పష్టమైన వీడియోలను అందించే థర్మల్ ఇమేజింగ్ సెన్సార్లు అమర్చిన, అధునాతన డ్రోన్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. లక్ష్యం తనకు ఎంతదూరంలో ఉందో చెప్పేసే లేజర్ రేంజ్‌ఫైండర్ ఉపకరణం సైతం బిగించిన మిలిటరీ/డిఫెన్స్ గ్రేడ్ పది డ్రోన్లను ముగ్గురు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు స్వా«దీనంచేసుకున్నారు.
వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.03 కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. హాంకాంగ్ నుంచి వియత్నాం మీదుగా ఢిల్లీకి చేరుకున్న ముగ్గురు ప్రయాణికులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ‘గ్రీన్‌చానెల్’గుండా వెళ్లేందుకు ప్రయతి్నంచగా కస్టమ్స్ అధికారులు అనుమానంతో వాళ్ల బ్యాగులను తనిఖీచేశారు.
బ్యాగుల్లో 10 డ్రోన్లు, 11 రిమోట్ కంట్రోల్‌లు, 10 ఏసీ/డీసీ అడాప్టర్లు, 10 యూఎస్‌బీ చార్జర్లు, 20 డేటా కేబుళ్లు, 60 ప్రొపెల్లర్లు, కెమెరా పేలోడ్ ఉన్న 10 గింబళ్లు, రిమోట్ కంట్రోల్ యాంటెన్నాలు, పవర్‌కేబుళ్లు, స్టాండ్‌లు, జాయ్‌స్టిక్‌లను స్వా«దీనంచేసుకున్నారు. ఈ డ్రోన్లకు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించలేదు. అధికారుల నుంచి ముందస్తు అనుమతులూ లేవు.


