సీఈసీని తక్షణమే తొలగించాలి | Kharge demands CECs removal and PM resignation | Sakshi
Sakshi News home page

సీఈసీని తక్షణమే తొలగించాలి

Sep 30 2026 4:35 AM | Updated on Sep 30 2026 4:35 AM

Kharge demands CECs removal and PM resignation

మంగళవారం సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే, సోనియా గాంధీ,

సీఈసీపై ఒత్తిడి తెస్తున్నందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి  

తొలగించిన ఓటర్ల పేర్లను మళ్లీ జాబితాలో చేర్చాలి  

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో తీర్మానం  

సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) అంశంలో పారదర్శకతకు తూట్లు పొడిచి, ఓటర్ల ప్రాథమిక హక్కును హరించేలా వ్యవహరిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని, సీఈసీపై తీవ్రమైన ఒత్తిడి తెచి్చనందుకు, ఎన్నికల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షాలు సైతం రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానించింది.

 పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలని, ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన 13.30 కోట్ల ఓటర్ల పేర్లను మళ్లీ చేర్చాలని డిమాండ్‌ చేసింది. తమ అర్హతను తామే నిరూపించుకోవాల్సిన భారాన్ని పౌరులపై మోపుతూ, పారదర్శకమైన రక్షణలు లేకుండా హడావిడిగా కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సీడబ్ల్యూసీ తీవ్రంగా ఆక్షేపించింది. 

ఎన్నికల సంఘం పనితీరుతోపాటు ఎస్‌ఐఆర్‌ వివాదంపై చర్చించడానికి సీడబ్ల్యూసీ మంగళవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో సమావేశమైంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేతలు సోనియా గాందీ, రాహుల్‌ గాందీ, ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జిలు, ముఖ్యమంత్రులతోపాటు పలువురు కీలక నాయకులు హాజరయ్యారు.

త్రిముఖ వ్యూహంతో ముందుకు.. 
దేశంలో ఎన్నికల ప్రక్రియను ఓ క్రమపద్ధతిలో ధ్వంసం చేస్తున్నారని సీడబ్ల్యూసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. బీజేపీ పాలనలో జరుగుతున్న ఓట్ల చోరీపై కాంగ్రెస్‌ పార్టీ తమ పోరాటాన్ని ప్రజల వద్దకు, అందుబాటులో ఉన్న ప్రతి వేదికకూ తీసుకెళ్లినట్లు గుర్తు చేసింది. బిహార్‌లో ఓటరు అధికార్‌ యాత్ర, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణాలో ఓటర్ల జాబితాల్లో అవకతవకలను బహిర్గతం చేస్తూ రాహుల్‌ గాంధీ నిర్వహించిన మీడియా సమావేశాల గురించి ప్రస్తావించింది. 

ఎస్‌ఐఆర్‌లో అక్రమాలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో విపక్ష ‘ఇండియా’కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమాలను సీడబ్ల్యూసీ ప్రశంసించింది. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటం సాగించేందుకు త్రిముఖ వ్యూహాన్ని కాంగ్రెస్‌ నేతలు ఖరారు చేశారు. రాజకీయ కార్యాచరణలో భాగంగా ఎస్‌ఐఆర్‌లో అవకతవకలపై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం, ప్రజలతో సమావేశాలు, ఆందోళనలు, ఓటర్లకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఇతర పార్టీలతో సమన్వయం చేసుకోవాలని, దీంతోపాటే పార్లమెంటరీ, న్యాయపరమైన వ్యూహాలను అనుసరించాలని నిర్ణయానికొచ్చారు. త్వరలో జరగబోయే ‘ఇండియా’కూటమి భేటీ తర్వాత దీనిపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించబోతున్నారు. 

‘ఓట్‌–బందీ’తో ప్రజాస్వామ్యం అంతం
కేంద్ర ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. సీడబ్ల్యూసీ భేటీలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. దశాబ్దం క్రితం నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ‘ఓట్‌–బందీ’కుట్రతో బలమైన ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, మోదీ ప్రభుత్వపు కనుసన్నల్లో అధికారులు ఇష్టానుసారంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. 

రెండు రకాలుగా మ్యాచ్‌–ఫిక్సింగ్‌
దేశంలో ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు, ఓటర్ల జాబితాల విషయంలో ‘మ్యాచ్‌–ఫిక్సింగ్‌’జరుగుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా విరోధ్‌ (వ్యతిరేకత), ప్రతిరో«ద్‌(ప్రతిఘటన) మార్గం నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాల గురించి తాము ప్రస్తావించినప్పుడు చాలామంది దీనిపై సందేహం వ్యక్తం చేశారని చెప్పారు.

 ఈ అంశంపై ఇప్పుడు మీడియాలోనూ, సంపాదకీయాల్లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. మ్యాచ్‌–ఫిక్సింగ్‌ రెండు రకాలుగా సాగుతోందని, ఒకటి ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు సంబంధించినది కాగా, మరొకటి ఓటర్ల జాబితాలను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేయడం అని విమర్శించారు.

సీడబ్ల్యూసీ ప్రధాన డిమాండ్లు  
⇒  ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తక్షణమే రాజీనామా చేయాలి. నైతిక, వ్యవస్థాగతమైన అధికారాన్ని, గౌరవాన్ని కోల్పోయినందున ఆయన పదవి నుంచి తప్పుకోవాలి. 
⇒ ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత, విధివిధానాలు, సమగ్రత, రాజ్యాంగబద్ధతపై తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నందున ‘ఎస్‌ఐఆర్‌’ప్రకియను తక్షణమే నిలిపివేయాలి.

⇒ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.30 కోట్ల మంది పేర్లను వెంటనే పునరుద్ధరించాలి. తొలగింపునకు గురైన ఓటర్లకు పూర్తి సమాచారం ఇచ్చి అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించాలి.  

⇒ ఓటర్ల జాబితాలో జరిగే ప్రతి పెద్ద మార్పునకు సంబంధించిన పూర్తి డేటాను బహిర్గతం చేయాలి  
⇒ ఓటర్ల జాబితా డేటాను రాజకీయ పార్టీలకు సులభమైన ఫార్మాట్‌లో సకాలంలో అందించాలి. తీవ్రమైన వ్యత్యాసాలు, లోపాలు ఉన్నచోట స్వతంత్ర విచారణ 
జరపాలి.  
⇒ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన డేటాలో ఎలాంటి సమాచారం దాచిపెట్టకుండా పూర్తి పారదర్శకత పాటించాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement