అభిప్రాయం
ఎన్నికల సంఘం సాధారణ ప్రభుత్వ విభాగం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఎన్నికల నిర్వహణకు సర్వా ధికారం కలిగిన రాజ్యాంగ సంస్థ. అందువల్ల దాని నిర్ణయాలపై ప్రజలకు విశ్వాసం ఉండటం ప్రజాస్వామ్యానికి అత్యవసరం. ఇటీవల ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు కొన్ని నిర్ణయాలు, విధానాలపై అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తం చేసి నట్లు వచ్చిన వార్తలను ఈ నేపథ్యంలోనే పరిశీలించాలి. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి దాదాపు పది నెలల వ్యవధిలో అనేక సందర్భాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్), ఫారం–6, ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణ, సాంకేతిక వ్యవస్థ, అప్పీళ్ల వంటి అంశాలపై అభ్యంతరాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం–6లో సర్‌కు సంబంధించిన ప్రశ్నలను చేర్చడంపై చట్టపరమైన అభ్యంతరాలు వ్యక్తమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న భిన్నాభిప్రాయం ఉన్నదా లేదా అన్నది కాదు. ఆ చర్యకు చట్టబద్ధమైన అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? అనేదే.
సమస్య ‘మెజారిటీ’ కాదు!
ఎన్నికల సంఘం తన చర్యలన్నీ చట్టం, నిబంధనలకు అను గుణంగానే జరిగాయనీ, పది నెలల కాలంలోని కొన్ని అంతర్గత నోట్లను మాత్రమే చూపడం ద్వారా మొత్తం వ్యవహారంలో ఒక భాగాన్ని మాత్రమే చూపుతున్నారనీ చెబుతోంది. అంతర్గత చర్చలో భిన్నాభిప్రాయాలు ఉండటం అసాధారణం కాదు. ఒక కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారనే కారణంతో ఆ నిర్ణయం వెంటనే చట్టవిరుద్ధం కాదు. అయితే దీనికి మరో వైపు కూడా ఉంది. ‘తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగాయి’ అనే ప్రకటన ఒక్కటే, ప్రతి చర్యకు చట్టబద్ధమైన అధికారం ఉందని నిరూపించదు. అందుకే మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఎస్.వై. ఖురేషీ, ఓ.పి. రావత్ సూచించినట్లు, ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన రికార్డు లను– ఎవరు ఏమి ప్రతిపాదించారు, ఎవరు అభ్యంతరం తెలి పారు, తుది నిర్ణయం ఏమిటి, అది ఏకగ్రీవమా లేక మెజారిటీ తోనా– ప్రజలకు అందు బాటులో ఉంచడం మంచిది. ఇక్కడ ఒక చట్టపరమైన స్పష్టత అవసరం. ప్రతి నిర్ణయం ఏకగ్రీవంగా ఉండాల్సిందేనని చెప్పడం సరైంది కాదు. వర్తించే చట్టపరమైన విధానాన్ని అనుసరించి అవసరమైనప్పుడు మెజా రిటీతో నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి ప్రశ్న ‘అందరూ అంగీకరించారా?’ అనేది మాత్రమే కాదు; ‘చట్టబద్ధమైన విధానాన్ని అనుస రించి నిర్ణయం తీసుకున్నారా?’ అనేదే.
ఇంకా తీవ్రమైన ప్రశ్న ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణకు సంబంధించినది. ఎన్నికల నమోదు అధికారులకు చట్టం ఇచ్చిన అధికా రాలను ఏదైనా కేంద్ర సాంకేతిక వ్యవస్థ అధిగమిస్తే, అది కేవలం సాంకేతిక సమస్య కాదు; అది చట్టపరమైన సమస్య. సాఫ్ట్‌వేర్‌కు స్వయంగా చట్టబద్ధమైన అధికారం ఉండదు. అది చట్టబద్ధమైన అధికారికి సహాయపడాలి కానీ అతని స్థానాన్ని ఆక్రమించకూడదు. అందువల్ల ఓటర్ల డేటాబేస్‌పై స్వతంత్ర సాంకేతిక ఆడిట్ అవసరం. ఎవరు డేటాను మార్చగలరు? ఏ అధికారి ఆదేశంతో మార్పు జరుగుతుంది? స్థానిక ఎన్నికల నమోదు అధికారి నిర్ణయాన్ని కేంద్ర వ్యవస్థ మార్చగలదా? ప్రతి మార్పుకు డిజిటల్ రికార్డు ఉందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాలి.
నిష్పాక్షికంగా ఉండటమే కాదు, కనిపించాలి!
పశ్చిమ బెంగాల్‌లో తొలగించిన ఓటర్లకు సంబంధించిన భారీ సంఖ్యలో అప్పీళ్ల విషయంలో కూడా ఇదే పారదర్శకత అవసరం. ఎన్నికల సంఘం తరఫున అప్పీళ్లు దాఖలు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఏ చట్టం కింద ఇచ్చారు? ఆ నిర్ణయాన్ని ఎవరు అమలు చేశారు? అన్నది రికార్డులతో స్పష్టమవ్వాలి. ఈ వివాదానికి మరో రాజ్యాంగపరమైన నేపథ్యం ఉంది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టం– ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధానమంత్రి నియమించే కేంద్ర కేబినెట్ మంత్రిని ఉంచింది. ఇటీవల జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ మార్పు కేంద్ర ప్రభుత్వానికి ప్రభావవంతమైన వీటో లభించే పరిస్థితిని సృష్టిస్తుందనీ, ఇది ‘పర్సెప్షన్ టెస్ట్’ పరంగా ప్రశ్నలు లేవ నెత్తుతుందనీ వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా కనిపించాల్సిన అవసరాన్ని ఈ వ్యాఖ్య స్పష్టం చేస్తుంది. ఇక్కడే నవీన్ చావ్లా వ్యవహారం గుర్తుకు వస్తుంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు, 2006లో ఎన్‌డీఏ 205 మంది ఎంపీల సంతకాలతో రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కు వినతిపత్రం సమర్పించి, ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని కోరింది. ఆయనకు కాంగ్రెస్ నాయకులతో రాజకీయ, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయనీ, అవి ఎన్నికల కమిష నర్ నిష్పాక్షికతపై సందేహాలు కలిగిస్తున్నాయనీ ఎన్ డీఏ ఆరోపించింది. ఆ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఆ సమయంలో బీజేపీ ముందుకు తెచ్చిన ప్రధాన సూత్రం– ఎన్నికల కమిషనర్ నిష్పాక్షికంగా ఉండటమే కాకుండా, ఉన్నట్టు కనిపించాలి కూడా.
అధికారంలోనూ, ప్రతిపక్షంలోనూ
2006 పరిస్థితిని 2026 పరిస్థితితో పూర్తిగా సమానం చేయడం సరైంది కాదు. అప్పటి ఆరోపణలు ఒక కమిషనర్ రాజకీయ సంబంధాలపై ఉండగా, ఇప్పుడు ఎన్నికల నిర్వహణ విధానాలు, ఫారాలు, డేటాబేస్, అంతర్గత నిర్ణయ ప్రక్రియపై కమిషనర్ల అభ్యంతరాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ రాజ్యాంగ సూత్రం మాత్రం ఒకటే– ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం ఉండాలి. 2006లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి, పార్లమెంటు, న్యాయస్థానం వంటి సంస్థాగత మార్గాలను ఉపయోగించింది. నేడు ప్రతిపక్ష పార్టీలూ అదేస్థాయి ఆధారాలతో ముందుకు రావాలనుకుంటే, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా అధికారిక రికార్డులు కోరాలి, నిర్దిష్ట చర్యలను న్యాయపరంగా సవాలు చేయాలి, అవసరమైతే స్వతంత్ర ఆడిట్ కోరాలి.
మరి బీజేపీ ఏం చేయాలి? 2006లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోరిన అదే ప్రమాణాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా పాటించాలి. ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలను రాజకీయ దాడిగా కొట్టిపారేయకుండా రికార్డులను బహిర్గతం చేయాలి. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏదైనా చర్య జరిగినట్లు నిర్ధారణ అయితే దానిని సరిచేయాలి. ఓటర్ల హక్కులకు నష్టం జరిగితే పరిహార మార్గం కల్పించాలి. తప్పు చేసిన వ్యక్తి ఎవరు అనేకంటే, తప్పు ఎలా జరిగింది, దాన్ని ఎలా నిరోధించాలి అన్నది చూడాలి. ఇది బీజేపీకే కాదు, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలకూ వర్తించే ప్రమాణం కావాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రమాణం, అధికా రంలో ఉన్నప్పుడు మరో ప్రమాణం ప్రజాస్వామ్య సంస్థలకు ప్రమాదకరం. ఎన్నికల సంఘం బీజేపీ వైపుందా, కాంగ్రెస్ వైపుందా అనేది ప్రశ్న కాదు. ఎన్నికల సంఘం రాజ్యాంగం వైపు ఉందని ప్రజ లకు స్పష్టంగా కనిపించేలా పనిచేస్తున్నదా? అదే అసలు పరీక్ష. గెలిచినవారికీ, ఓడిపోయినవారికీ ఎన్నికల ఫలితాన్ని అంగీకరించేంత విశ్వాసం కలిగించగలిగితేనే ఎన్నికల సంఘం తన రాజ్యాంగ బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించినట్లవుతుంది.
ఆచార్య మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్


