రైస్‌ మిల్లుల్లో సంక్షోభం ఎందుకు? | Telangana Rice Mills Crisis Paddy Procurement Tenders | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లుల్లో సంక్షోభం ఎందుకు?

Sep 29 2026 8:15 AM | Updated on Sep 29 2026 8:29 AM

Telangana Rice Mills Crisis Paddy Procurement Tenders

తెలంగాణ అనగానే గోదావరి, కృష్ణా నదీ జలాలు, విశాలమైన వరి పొలాలు, అన్నదాతల శ్రమ గుర్తుకు వస్తాయి. 1980ల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశానికి అవసరమైన బియ్యాన్ని సమృద్ధిగా అందించి ‘అన్నపూర్ణ’గా ఖ్యాతి గడించింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. ఇదే సమయంలో వేలాది రైస్‌ మిల్లులు రైతుల పంటకు సులభమైన మార్కెట్‌ కల్పిస్తూ వచ్చాయి.

స్థానికులకు, బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడంలోనూ కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,172 రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటిలో బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు 1,120, రా రైస్‌ మిల్లులు 2,052. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాల కోసం మిల్‌ లెవీ పద్ధతిలో మిల్లర్ల నుంచి బియ్యాన్ని నిర్బంధంగా సేకరించేది. ఇది తెలంగాణ బియ్యానికి ఉన్న బలమైన డిమాండ్‌ను సూచించేది.

కాలక్రమేణా దేశవ్యాప్తంగా సాగునీటి సౌకర్యాలు విస్తరించడంతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో బియ్యం కొరత ఉన్న అనేక రాష్ట్రాలు నేడు స్వయం సమృద్ధి సాధించి ఎగుమతులు కూడా చేస్తున్నాయి. తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల సాగునీటి లభ్యత పెరిగి వరి విస్తీర్ణం భారీగా పెరిగింది.ఇదే సమయంలో 2015–16 ఖరీఫ్‌ సీజన్‌  నుంచి కేంద్రం మిల్‌ లెవీ విధానాన్ని నిలిపివేసింది. రాష్ట్రాలు రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి, కస్టమ్‌ మిల్లింగ్‌ ద్వారా బియ్యంగా మార్చి కేంద్రానికి సరఫరా చేసే విధానం అమల్లోకి వచ్చింది.

టెండర్లు, దర్యాప్తులు, వివాదాలు
రాష్ట్ర అవసరాలకు మించిన ధాన్యాన్ని కూడా రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. రాజకీయ, సామాజిక కారణాల వల్ల పంటను కొనకుండా వదిలేయడం సాధ్యం కాలేదు. అయితే అదనపు ధాన్యాన్ని విక్రయించే సమర్థవంతమైన వ్యవస్థ లేక పోవడంతో ప్రజా పంపిణీకి అవసరమైన పరిమాణం మినహా మిగిలిన ధాన్యం మిల్లుల వద్దే నిల్వలుగా పేరుకుపోయింది. సంవ త్సరాల తరబడి నిల్వలు పేరుకుపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, మార్కెట్‌ పరిస్థితులు మారడం వల్ల కొందరు మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించారు.

పెరుగుతున్న కొనుగోలు వ్యయం, నిల్వల భారం కారణంగా ప్రభుత్వం 2022–23 నుంచి కస్టమ్‌ మిల్లింగ్‌ కింద ఉన్న ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించడం ప్రారంభించింది. టెండర్‌ విజేతలు మిల్లులకు వెళ్లినప్పుడు రికార్డుల్లో ఉన్నంత ధాన్యం భౌతికంగా లేకపోవడం వెలుగులోకి వచ్చింది. దీంతో విజిలెన్‌ ్స దర్యాప్తులు, తనిఖీలు, క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. బ్యాంకులు రుణ వసూళ్లకు ఒత్తిడి పెంచడంతో కొన్ని మిల్లులు మూతపడ్డాయి. కొందరు కోర్టులను ఆశ్రయించగా, మరికొందరు టెండర్‌ ప్రక్రియను వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేశారు. ప్రభుత్వం– మిల్లర్ల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి.

ఈ సంక్షోభానికి ఒక్క కారణాన్ని మాత్రమే ఆపాదించడం సరికాదు. కేంద్ర విధాన మార్పులు, రాష్ట్ర కొనుగోలు విధానం, దేశవ్యాప్తంగా వరి ఉత్పత్తి పెరుగుదల, బియ్యం మార్కెట్‌ డిమాండ్‌ తగ్గడం, నిల్వల నిర్వహణలో లోపాలు, కొందరు మిల్లర్ల వ్యాపార నిర్ణయాలు... ఇవన్నీ కలిసి పరిశ్రమను క్లిష్ట పరిస్థితిలోకి నెట్టాయి. ఒకప్పుడు రైతుకు భరోసా, వేలాది కుటుంబాలకు ఉపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిన ఈ పరిశ్రమ నేడు మనుగడ కోసం పోరాడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు, కార్మికులు, బ్యాంకులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తంపై ప్రభావం పడుతుంది.
– వెంగల్‌ దాస్‌ శ్రీధర్‌, టాక్స్‌ కన్సల్టెంట్‌

ఇదీ చదవండి: రాహుల్‌ హెచ్చరించినట్లే ఓట్ల చోరీ నిజమైంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement