సుప్రీంకోర్టుకు తెలంగాణ హైకోర్టు సీజే | Telangana High Court CJ to Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టుకు తెలంగాణ హైకోర్టు సీజే

Sep 29 2026 6:01 AM | Updated on Sep 29 2026 6:01 AM

Telangana High Court CJ to Supreme Court

సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌కు పదోన్నతి! 

గుజరాత్, ఢిల్లీ హైకోర్టు సీజేలకు కూడా.. 

మళ్లీ తెలంగాణ హైకోర్టుకు జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ 

సిఫార్సు చేసిన అత్యున్నత న్యాయస్థానం కొలీజియం

సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సు చేసింది. ఆయనతోపాటు మరో ఇద్దరు హైకోర్టు సీజేలకూ పదోన్నతి కలి్పస్తూ సిఫార్సు చేసింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం సోమవారం సమావేశమై ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎంపిక చేసిన జాబితాలో జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌తోపాటు గుజరాత్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన ఈ సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన తర్వాత రాష్ట్రపతి భవన్‌ నుంచి అధికారికంగా నియామక ఉత్తర్వులు వెలువడతాయి. 

ఆయనది జడ్జీల కుటుంబం 
న్యాయకోవిదుల కుటుంబంలో మూడో తరానికి చెందిన జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ 1965, జూలై 7న డాక్టర్‌ రాంగోపాల్‌సింగ్, డాక్టర్‌ శ్రద్ధాసింగ్‌ దంపతులకు జన్మించారు. ఆయన తల్లివైపు కుటుంబానికి చెందిన తాత జస్టిస్‌ బీపీ సిన్హా సుప్రీంకోర్టు ఆరో ప్రధాన న్యాయమూర్తిగా, మరో తాత జస్టిస్‌ శంభుప్రసాద్‌ సింగ్‌ పట్నా హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సమీప బంధువులైన జస్టిస్‌ బిశ్వేశ్వర్‌ ప్రసాద్, జస్టిస్‌ శివకీర్తి సింగ్‌ సుప్రీంకోర్టు జడ్జీలుగా పనిచేశారు. జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ ఆనర్స్, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకుని అదే ఏడాది నుంచి 2000 వరకు పట్నా హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2001 నుంచి జార్ఖండ్‌ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 2012, జనవరి 24న జార్ఖండ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014, జనవరి 16న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. జార్ఖండ్‌ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2022, డిసెంబర్‌ 20 నుంచి 2023, ఫిబ్రవరి 19 వరకు జార్ఖండ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం 2023, ఏప్రిల్‌ 17న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2025, జూలై 19న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. 

తెలంగాణకు జస్టిస్‌ వినోద్‌కుమార్‌ 
రాష్ట్రానికి చెందిన, ప్రస్తుతం మద్రాస్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ తడకమళ్ల వినోద్‌కుమార్‌ను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ ఏడాది నవంబర్‌ 16న ఆయన పదవీ విరమణ పొందనున్నారు. 1964, నవంబర్‌ 17న టి.లక్ష్మీనరసింహారావు, టి.శకుంతల దంపతులకు ఆయన జని్మంచారు. నాటి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించి, అనంతరం హైదరాబాద్‌లో విద్యను కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1988లో న్యాయవాదిగా నమోదు చేసుకుని, సీనియర్‌ న్యాయవాది రవి.ఎస్‌ చాంబర్‌లో చేరారు. పన్నులు, కార్పొరేట్‌ వివాదాలపై న్యాయవాదిగా ప్రత్యేక నైపుణ్యం సాధించారు. ఆదాయపు పన్ను శాఖకు, కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖకు స్టాండింగ్‌ కౌన్సెల్‌గా చేశారు. న్యాయమూర్తిగా పదోన్నతి పొందే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగారు. 2019, ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గతేడాది జూలైలో మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement