1.41 కోట్ల మంది ఓటర్లు పాస్‌ | SIR in Telangana: 1. 41 Crore Voters Clear Verification | Sakshi
Sakshi News home page

1.41 కోట్ల మంది ఓటర్లు పాస్‌

Sep 29 2026 1:15 AM | Updated on Sep 29 2026 1:15 AM

SIR in Telangana: 1. 41 Crore Voters Clear Verification

2.64 కోట్ల మందికిగాను ఇప్పటివరకు 1.41 కోట్ల మంది అర్హులుగా నిర్ధారణ 

59,51,696 మంది ఓటర్ల విచారణ పూర్తి.. విచారణకు రాని 31,01,407 మంది ఓటర్లు 

కొత్త ఓటర్ల నమోదుకు 4.43 లక్షలు.. ఓటర్ల తొలగింపునకు 30,676 దరఖాస్తులు     

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)–2026లో భాగంగా నవంబర్‌ 9న ప్రచురించే తుది ఓటర్ల జాబితా తయారీ కోసం ఎన్నికల సంఘం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ జాబితాలో చోటు పొందేందుకు సోమవా రం నాటికి మొత్తం 1,41,02,982 మంది ఓటర్లు అర్హత సాధించారు. సర్‌–2026 ప్రక్రియకు ముందు మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా గత నెల 17న ప్రకటించిన ముసాయిదా జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,64,87,213కు తగ్గిపోయింది. ఆచూకీ లేరు/శాశ్వతంగా నివాసం మారారు/చనిపోయారు/మరో చోట ఓటుకలిగి ఉన్నారు (ఏఎస్‌డీడీ) అనే కారణాలతో 73,39235 మంది (21.7 శాతం) ఓటర్లను ముసాయిదా ఓటర్ల  జాబితా నుంచి ఈసీ తొలగించింది.

ముసాయిదా జాబితాలోని 92,88,180 మంది ఓటర్లను అన్‌మ్యాప్డ్‌ ఓటర్లుగా, వివరాల్లో తేడాలున్న ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు 87,97,580 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఓటర్లలో 59,51,696 మంది విచారణకు హాజరవగా వారిలో ఇప్పటివరకు 46,10,367 మంది ఓటర్లను అర్హులుగా గుర్తించారు. మరో 4,570 మంది ఓటర్లు తుది జాబితాలో చోటు పొందడానికి అనర్హులని స్థానిక ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, అదనపు ఏఈఆర్వోలు నిర్ధారించారు.

నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్దేశిత తేదీకి విచారణకు హాజరు కావాల్సి   ఉండగా 31,01,407 మంది ఓటర్లు హాజరు కాలేకపోయారు. వారి విచారణ గడువు ముగియడంతో మళ్లీ రీ షెడ్యూల్‌ చేసి మరో తేదీకి విచారణ కోసం పిలిచినప్పటికీ 47,937 మంది ఓటర్లు విచారణకు హాజరు కాలేదు. దీంతో వారికి మరోసారి అవకాశం కల్పించనున్నారు. సర్‌–2026 కార్యక్రమం రోజువారీ పురోగతిపై రూపొందించిన నివేదికల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం ఈ గణాంకాలను పొందుపరిచింది.

విచారణకు ‘గ్రేటర్‌’ ఓటర్ల డుమ్మా..
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోలింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపని మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని ఓటర్లు.. సర్‌ ప్రక్రియలో భాగంగా జారీ చేస్తున్న నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరయ్యేందుకు సైతం ఆసక్తి చూపించట్లేదు. అత్యధికంగా మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 6,06,033 మంది ఓటర్లు విచారణకు డుమ్మా కొట్టగా రంగారెడ్డి జిల్లాలో 5,17,073 మంది, హైదరాబాద్‌ జిల్లాలో 3,90,460 మంది గైర్హాజరయ్యారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 1,39,653 మంది, సూర్యాపేట జిల్లాలో 1,14,705 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,13,608 మంది ఓటర్లు నిర్దేశిత తేదీకి విచారణకు హాజరు కాలేదు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 32,636 మందికి నోటీసులు జారీ చేయగా 32,458 మంది విచారణకు హాజరయ్యారు.  

కొత్త ఓటర్ల నమోదుకి 4.43 లక్షల దరఖాస్తులు..
సర్‌ ప్రక్రియలో భాగంగా ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలతోపాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తుల సమర్పణకు గడువు వచ్చే నెల 7తో ముగియనుంది. రాష్ట్రంలో సోమవారం నాటికి కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 4,43,705 ఫారం–6 దరఖాస్తులు రాగా ప్రవాస భారతీయ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి మరో 6,279 మంది ఫారం–6ఏ దరఖాస్తు చేసుకున్నారు. ఇక ముసాయిదా జాబితాలోని ఓటర్ల తొలగింపునకు 30,676 ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. ఓటర్ల వివరాల్లో మార్పులు/తప్పుల దిద్దుబాటు/చిరునామా మార్పు కోసం 3,57,898 మంది ఫారం–8 కింద దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను నవంబర్‌ 5లోగా పరిష్కరించి ఆ మేరకు తుది ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులకు ఈసీ చర్యలు తీసుకోనుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement