హైదరాబాద్: మోసగాళ్లు ఎక్కడో ఉండరు. మన మధ్యే తిరుగుతూ అదును చూసుకుని మోసాలకు పాల్పడుతుంటారు. ఆదమరచి ఉన్నామో ఇట్టే మోసపోతాం. కొందరు మోసగాళ్లు హైదరాబాద్‌లో నకిలీ నోట్లను అంటగడుతున్నారు. ఐదు వందల రూపాయల నోటుకు మీరు చిల్లరా ఇస్తున్నారా? జర భద్రం.
చిల్లర ఇచ్చే ముందు 500 రూపాయల నోటును జాగ్రత్తగా గమనించండి. దొంగ నోటు ఇచ్చి బురిడీ కొట్టించే కేటుగాళ్లు మన మధ్యనే తిరుగుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ కేటుగాడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నగరంలో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టయింది. రూ.500 నకిలీ నోట్లను మార్చుతుండగా రాజస్థాన్‌కు చెందిన యువకుడు విక్రమ్ (21) పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి 16 నకిలీ రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నాడు. చిన్న వ్యాపారులను టార్గెట్ చేసి.. రూ.500 నకిలీ నోటు ఇచ్చి రూ.400 అసలు నోట‍్లతో చిల్లర తీసుకుంటున్నాడు నిందితుడు.
బేగం బజార్ ఛత్రీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తూ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశోక్ అనే ప్రధాన సూత్రధారి ఇచ్చే నోట్లతో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్లు గుర్తించాడు. పరారీలో ఉన్న అశోక్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.


