నిరసనలో మంత్రులు పొంగులేటి, జూపల్లి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి: కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ బీజేపీ చేతిలో కీలుబోమ్మగా మారి కాంగ్రెస్ అనుబంధ ఓటర్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లను ఉద్దేశ పూర్వకంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఏఐసీసీ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి పొంగులేటితో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, అనిరుద్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ వరుసగా కేంద్రంలో బీజేపీ మూడు పర్యాయాలు అధికారంలోకి రావడానికి కేంద్ర ఎన్నికల సంఘం పాత్ర ఉందని, వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నచోట్ల ఓట్ల తొలగింపునకు యతి్నస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘంలో పని చేసే అధికారులే ఓట్ల తొలగింపునకు కారణమని పలుమార్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పినా.. కనీసం విచారణ చేసేందుకు పూనుకోలేదని మండిపడ్డారు. అక్రమంగా ఓట్ల తొలగింపునకు కారణమైన అధికారులను సస్పెండ్ చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రంను కలెక్టర్ ఆదర్శ్ సురభికి అందజేశారు.
రీ సర్వేతోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
శతాబ్దకాలం తర్వాత భూములను రీ సర్వే చేస్తూ దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూముల సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్‌లో సీసీఎల్ కమిషనర్, హౌసింగ్ ఎండీ, రాష్ట్రస్థాయి అధికారులు, ఉమ్మడి పాలమూరు జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, సర్వేయర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు.
ప్రతి భారత పౌరుడికి ఆధార్ కార్డు ఇచి్చన విధంగా భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తని విధంగా ప్రతి రైతుకు భూధార్ కార్డును నక్షతో సహా అందించేందుకే భూముల రీ సర్వే ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఇలాంటి సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంతజిల్లాలో రీ సర్వేపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.


