ఆయిల్ ఫెడ్ ప్రధాన కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ | Minister Tummalas surprise inspection at Oil Fed headquarters | Sakshi
Sakshi News home page

ఆయిల్ ఫెడ్ ప్రధాన కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ

Sep 28 2026 11:00 PM | Updated on Sep 28 2026 11:00 PM

Minister Tummalas surprise inspection at Oil Fed headquarters

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణను మరింత వేగవంతం చేయడంతో పాటు, ఆయిల్‌పామ్ రైతులకు మొక్కల సరఫరా నుంచి గెలల సేకరణ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

సోమవారం ఆయిల్ ఫెడ్ కార్యాలయానికి మంత్రి ఆకస్మికంగా చేరుకున్న సమయంలో కింది స్థాయి సిబ్బంది విధులకు హాజరైనప్పటికీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి చెందిన కొంతమంది సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరుకాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సమయపాలనతో విధులు నిర్వహించాలని, రైతులకు సంబంధించిన కార్యక్రమాల్లో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు.

అనంతరం ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, రైతులకు మొక్కల సరఫరా, నర్సరీల నిర్వహణ, డ్రిప్ వ్యవస్థల ఏర్పాటు, ఆయిల్‌పామ్ కర్మాగారాల పనితీరు, గెలల సేకరణ, రైతులకు అందుతున్న సేవలు తదితర అంశాలపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు.

సంవత్సరానికి 2 లక్షల ఎకరాల ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలి... 
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు విస్తరణను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని మంత్రి తుమ్మల తెలిపారు. రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం అందించడంతో పాటు రాష్ట్రంలో ఆయిల్‌పామ్ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణను సంవత్సరానికి 2 లక్షల ఎకరాల చొప్పున విస్తరించాలనే లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేరుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ లక్ష్య సాధన కోసం ఆయిల్ ఫెడ్, ఉద్యానశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రైతులను ఆయిల్‌పామ్ సాగు వైపు ప్రోత్సహించడం మాత్రమే కాకుండా, వారికి సాగులోకి వచ్చిన తరువాత కూడా అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడం అధికారుల బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. రైతుకు ఆయిల్‌పామ్ మొక్క అందించడం మొదలుకొని, పంట చేతికి వచ్చే వరకు, గెలల సేకరణ వరకు రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఆయిల్ ఫెడ్, ఉద్యానశాఖ అధికారులదేనని అన్నారు.

నర్సరీల్లో ఉన్న మొక్కలు రైతులకు జాప్యం లేకుండా అందించాలి...
రాష్ట్రంలోని ఆయిల్‌పామ్ నర్సరీల్లో ప్రస్తుతం ఉన్న మొక్కల వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 45 నర్సరీల్లో 47 లక్షల ఆయిల్ పామ్ మొక్కలు పెంచుతున్నామని, వీటిలో  9.50 లక్షల మొక్కలు పంపిణీ కోసం అందుబాటులో ఉన్నాయని, వచ్చే మూడు నెలల్లో మరో 12 లక్షల మొక్కలు అందుబాటులోకి వస్తాయని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సంవత్సరంలో ఇప్పటికే 17.50 లక్షల ఆయిల్ పామ్ మొక్కలు పంపిణీ చేసినట్టు తెలిపారు.

నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నప్పటికీ రైతులకు అందుబాటులోకి రాకుండా ఉండే పరిస్థితి ఉండకూడదని మంత్రి అన్నారు. రైతుల డిమాండ్‌కు అనుగుణంగా మొక్కల సరఫరాను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, నర్సరీల వారీగా మొక్కల లభ్యతను రోజువారీగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

అదేవిధంగా ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల పనితీరుపై మంత్రి సమీక్షించారు. అశ్వరావుపేట, అప్పారావుపేట మరియు నర్మెట్ట లోని ప్రాసెసింగ్ మిల్లులు పూర్తిస్థాయి సామార్థ్యంతో నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.  అదేవిధంగా నిర్మాణంలో ఉన్న 6 ఆయిల్ పామ్ మిల్లుల పనులు త్వరితగతిన పూర్తిచేసి, వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

పెండింగ్ డ్రిప్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి... 
ఆయిల్‌పామ్ సాగుకు డ్రిప్ వ్యవస్థ అత్యంత కీలకమైనదని మంత్రి తుమ్మల తెలిపారు. రైతులు డ్రిప్ వ్యవస్థ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత అనవసరంగా జాప్యం చేయడం సరికాదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న డ్రిప్ దరఖాస్తులన్నింటినీ వెంటనే పరిష్కరించి, అర్హత కలిగిన రైతులకు త్వరితగతిన డ్రిప్ వ్యవస్థను అందించాలని అధికారులను ఆదేశించారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా, దరఖాస్తుల స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు.

పనితీరు బాగాలేని కంపెనీలపై కఠిన చర్యలు....
ఆయిల్‌పామ్ సాగు విస్తరణలో భాగంగా జిల్లాల వారీగా ఆయిల్‌పామ్ కంపెనీలకు కేటాయించిన ప్రాంతాల్లో వాటి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి ఆదేశించారు.  పనితీరు బాగాలేని ఆయిల్‌పామ్ కంపెనీలకు కేటాయించిన జిల్లాలను రద్దు చేసి, ఇతర సమర్థవంతమైన కంపెనీలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల విషయంలో కంపెనీలకు ఎలాంటి మినహాయింపులు ఉండబోవని అన్నారు.

ఆఖరికి ఆయిల్ ఫెడ్ సంస్థ అయినా సరే, పనితీరు బాగాలేని జిల్లాలను తొలగించడంలో వెనుకాడేది లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రైతులకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వానికి ప్రధానమని, సంస్థలు, కంపెనీల పనితీరును రైతుల ప్రయోజనాల ప్రాతిపదికననే అంచనా వేస్తామని తెలిపారు.

గెలల సేకరణలో అవకతవకలపై మంత్రి ఆగ్రహం....
గత రెండు మూడు రోజులుగా ఆయిల్‌పామ్ గెలల సేకరణకు సంబంధించి సేకరణ కేంద్రాల అవకతవకలపై మీడియాలో వస్తున్న వార్తలపై మంత్రి తుమ్మల ప్రత్యేకంగా దృష్టి సారించారు. రైతుల నుంచి గెలల సేకరణలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నా వాటిని తీవ్రంగా పరిగణిస్తామని మంత్రి తెలిపారు.గెలల సేకరణలో అవకతవకలకు సంబంధించి ప్రతి సేకరణ కేంద్రాల్లో సమగ్ర ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సేకరణ కేంద్రాల్లో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు మరియు ఏవైనా అవకతవకలు జరిగినట్టు ఆడిట్ లో తేలితే,  అందుకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయిల్ ఫెడ్ అధికారులను మంత్రి ఆదేశించారు.

అవసరమైన సిబ్బంది నియామకానికి చర్యలు...
ఆయిల్ ఫెడ్ లో ఉద్యోగుల ఖాళీలను భర్తీచేయాలని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. సిబ్బంది కొరత కారణంగా రైతులకు సేవలందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని మంత్రి తెలిపారు. సంస్థకు అవసరమైన సిబ్బందిని నియమించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అదేవిధంగా ఉద్యానశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ఆయిల్ పామ్ రైతు ప్రయోజనమే కేంద్రంగా పనిచేయాలి...
ఆయిల్‌పామ్ సాగు విస్తరణలో ప్రతి దశలోనూ రైతు ప్రయోజనాలను కేంద్రంగా చేసుకుని అధికారులు పనిచేయాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కేవలం సాగు విస్తీర్ణం పెంచడం మాత్రమే కాకుండా, రైతుకు అవసరమైన మొక్కలు, డ్రిప్, సాంకేతిక సహకారం, పంట నిర్వహణపై మార్గదర్శకత్వం, గెలల సేకరణ, మార్కెటింగ్ తదితర అన్ని అంశాల్లో సమగ్ర సహకారం అందించాలని అన్నారు. రైతు నష్టపోకుండా, ఆయిల్‌పామ్ సాగు విస్తరణ లక్ష్యం సాధించేలా ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువ సార్లు వెళ్లా : సీఎం రేవంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement