రూ.345.78 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న రేవంత్‌రెడ్డి
నేతన్నలు, మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి
రేపు సిరిసిల్లలో ముఖ్యమంత్రి పర్యటన.. భారీ బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ప్రతిపక్ష నేతగా మూడుసార్లు సిరిసిల్ల గడ్డపై అడుగుపెట్టిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి. సిరిసిల్ల రగుడు బైపాస్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో రూ.345.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేయనున్నారు.
వస్త్ర ఉత్పత్తి నిలయంగా పేరొందిన సిరిసిల్లలో నేతన్నల సంక్షేమం, అభివృద్ధి, మహిళల సాధికారతతోపాటు విద్య, మౌలిక వసతుల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానంగా సిరిసిల్లలో సాంచాలపై ఉత్పత్తి చేసే పెట్టికోట్, పాలిస్టర్ వస్త్రాల మార్కెటింగ్‌కు వీలుగా నేతన్న బజార్‌ను ఏర్పాటు చేయాలని రేవంత్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
ఇవీ శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు
⇒ సిరిసిల్లతోపాటు వేములవాడలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పెద్దూరులో 18 ఎకరాల్లో ప్రతిపాదించిన ఈ విద్యా సముదాయంలో 5 నుంచి 12వ తరగతి వరకు 2,600 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా 64 తరగతి గదులు, డార్మిటరీలు, క్రీడా మైదానాలు తదితర సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
⇒ సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తారు. ప్రీ–ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు తరగతి గదులు, ల్యాబ్‌లు, డైనింగ్ హాళ్లు, క్రీడా సదుపాయాలు, ఐటీ మౌలిక వసతులతో అభివృద్ధి చేయనున్నారు.
⇒ సిరిసిల్లలో కొత్త నేతన్న బజార్ ఏర్పాటు కూడా పర్యటనలో కీలక అంశంగా ఉండనుంది. చేనేత, పవర్‌లూమ్ వస్త్ర ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు దీన్ని ప్రతిపాదించారు.
⇒ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.99.40 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మండపాలు, గోపురాలు, ప్రాకారాలు, సైట్ డెవలప్‌మెంట్, నీటి సరఫరా–మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ పనులు, షాపింగ్ కాంప్లెక్సులు, ఉత్తరం వైపు సీసీ రోడ్డు సహా 26 పనులు ఇందులో ఉన్నాయి.
⇒ జిల్లాలో పరిపాలనా మౌలిక వసతుల విస్తరణలో భాగంగా ఏడు కొత్త ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మించనున్నారు. సిరిసిల్ల, వేములవాడలో రెండు ఆర్డీవో కార్యాలయాలు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగిలో నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
⇒ రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
⇒ సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్‌ను ప్రారంభించనున్నారు.
⇒ వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్, వేములవాడ– సిరిసిల్లలో రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.


