సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న భట్టి
బీసీ సంక్షేమానికి ప్రాధాన్యం: డిప్యూటీ సీఎం భట్టి
రూ.60 కోట్లతో 50 వేల మందికి కాటమయ్య రక్షణ కవచాలు
రూ.450 కోట్లతో 1.30 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు జమ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘రాజీవ్ యువ వికాసం’పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో భట్టి మాట్లాడారు.
ఎంజేపీ (మహాత్మా జ్యోతిబా పూలే) గురుకులాల్లో ఉన్న పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు. గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేయగా, ఆ అంశాన్ని పరిశీలిస్తామని భట్టి చెప్పారు. అర్హులైన విద్యార్థులందరికీ అవకాశం కల్పించేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
డీబీటీ పద్ధతిలో స్కాలర్‌షిప్‌లు
రాష్ట్రంలో ప్రీ–మెట్రిక్, పోస్ట్–మెట్రిక్ కోర్సులు చదువుతున్న బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకే స్కాలర్‌షిప్ నిధులను నేరుగా (డీబీటీ పద్ధతిలో) జమ చేస్తు న్నట్లు భట్టి వెల్లడించారు. నూతన విధానం ద్వారా ఇప్పటివరకు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 1.30 లక్షల మంది విద్యార్థులకు రూ. 450 కోట్ల నిధులను వారి ఖాతాల్లో జమ చేసిన ట్లు తెలిపారు.
అలాగే హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలను సైతం ఏ నెలకు ఆ నెల కచ్చితంగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయా లని అధికారులను ఆదేశించారు. గీత కారి్మకుల సంక్షేమానికి ఉద్దేశించిన కాటమయ్య రక్షణ కవచాల పథకం కింద ఇప్పటివరకు 50 వేల మందికి కిట్స్ మంజూరు చేశామని, ఇప్పటికే 40 వేల కిట్ల పంపిణీ పూర్తయిందన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మరో 10 వేల మందికీ త్వరలోనే రక్షణ కవచం కిట్లు పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ శా>ఖ ముఖ్య కార్యదర్శి, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి.సైదులు తదితరులు పాల్గొన్నారు.
సమీకృత గురుకుల నిర్మాణ పనుల ఆకస్మిక తనిఖీలు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్‌ఎస్) భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు కులమతాలకు అతీతంగా ఒకే ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య, అన్ని సౌకర్యాలు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ఉపముఖ్యమంత్రి తెలిపారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్న పాఠశాలల నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో కలిసి ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక వర్క్ క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించారు. పనుల పురోగతిని వారానికోసారి సమీక్షించి నివేదికలు తనకు పంపాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న పాఠశాలలను తాను స్వయంగా ఆకస్మికంగా తనిఖీ చేస్తా నని వెల్లడించారు. వచ్చే నెల రెండో వారం నుంచి ఈ తనిఖీలు ప్రారంభిస్తానన్నారు.


