సొంత బొగ్గు ఉన్నా.. విదేశీకి మొగ్గు! | leaders are failing to focus on country potential to source high-quality coal | Sakshi
Sakshi News home page

సొంత బొగ్గు ఉన్నా.. విదేశీకి మొగ్గు!

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

leaders are failing to focus on country potential to source high-quality coal

ఖరీదైన విదేశీ బొగ్గు కొనుగోలుకు కదులుతున్న పావులు

స్వదేశీ బొగ్గు కొరతను ఆసరాగా తీసుకుని జెన్‌కోపై ఒత్తిడి 

దేశంలోనే నాణ్యమైన బొగ్గు దొరికే అవకాశం ఉన్నా దానిపై దృష్టి పెట్టని ప్రభుత్వ పెద్దలు 

ఇండోనేసియా, ఆ్రస్టేలియా నుంచి 50 లక్షల టన్నులు దిగుమతి చేసుకునే యోచన.. స్వదేశీ బొగ్గు టన్ను గరిష్టంగా రూ.3,800..విదేశీ రూ.10 వేలకు పైనే 

కీలకంగా వ్యవహరిస్తున్న ఓ కాంట్రాక్టర్‌.. ఇంధన శాఖ ఒత్తిడి!.. భారీయెత్తున ముడుపులు దండుకునేందుకు స్కెచ్‌? 

బొగ్గు దిగుమతితో జెన్‌కో మునగడం ఖాయమంటున్న సంస్థ ఇంజనీర్లు.. రూ.3 వేల కోట్లు అధికంగా ఖర్చవుతుందనిలెక్క 

2022లో ఈ కారణంగానే విదేశీ ప్రతిపాదన ఉపసంహరించుకున్నామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. విద్యుత్‌ డిమాండ్‌..బొగ్గు కొరత..ఇదే అదనుగా విదేశీ బొగ్గు కొనుగోలుకు మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఏకంగా 50 లక్షల టన్నుల విదేశీ బొగ్గు తెప్పించేందుకు వేగంగా పావులు కదులుతున్నాయి. దేశంలోనే ఇతర బొగ్గు క్షేత్రాల నుంచి నాణ్యమైన బొగ్గు దొరికే అవకాశం ఉన్నా.. ప్రభుత్వ పెద్దలు వాటిపై పెద్దగా ఆసక్తి చూపుతున్న దాఖలాలు లేవు. కోల్‌ ఇండియాతో,  అలాగే రాష్ట్రానికే చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రితో సంప్రదింపులకు ప్రయత్నాలేవీ జరగడం లేదని, ఎంతకూ విదేశీ బొగ్గు కొనుగోలుకే వెంపర్లాడుతున్నారనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి.  

అసలు రహస్యం అదే..! 
జెన్‌కో సమన్వయ కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు కొరత అంశం ప్రస్తావనకు వచ్చింది. భారీగా పేరుకుపోయిన బకాయిలు చెల్లిస్తేనే బొగ్గు సరఫరా చేస్తామని సింగరేణి అనడం, ఏ ప్లాంట్‌లోనూ సరిపడా నిల్వలు లేకపోవడం, మరోవైపు ఎందుకూ పనికిరాని బొగ్గును సింగరేణి ఇస్తోందనే అంశంపై చర్చ జరిగింది. మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి బొగ్గు అందకపోతే పరిస్థితి ఏమిటి? అనే ప్రస్తావన వచ్చింది. అప్పుడే.. అవసరమైతే విదేశీ బొగ్గుకు వెళ్లాల్సి ఉంటుందనే మాట ఉన్నతాధికారుల నుంచి రావడం గమనార్హం. కాగా విదేశీ బొగ్గు కోసం కాంట్రాక్టు సంస్థలను రంగంలోకి దించితే పెద్ద ఎత్తున ముడుపులు అందుతాయనేదే ఇందులోని అసలు రహస్యం అని కొందరు జెన్‌కో అధికారులే చెబుతున్నారు.  

జెన్‌కో ఇంజనీర్లలో తీవ్ర వ్యతిరేకత 
ఈ విదేశీ బొగ్గు ప్రతిపాదనను జెన్‌కో ఇంజనీర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సంస్థకు నష్టమని, జెన్‌కోను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసే అవకాశం ఉందని అంటున్నారు. తాము సరఫరా చేసే బొగ్గును థర్మల్‌కు వాడవచ్చని, కాకపోతే కొంచెం ఎక్కువ వినియోగం ఉంటుందని సింగరేణి అధికారులు సైతం వివరిస్తున్నారు. కానీ ఇవేవీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ మేరకు జెన్‌కో అధికారులపై ఇంధనశాఖ ఉన్నతాధికారి ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. సంస్థ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ సమాచారం మీడియాకు చేరవేస్తున్నామని ఇంజనీర్లు చెప్పడం.. విదేశీ బొగ్గు కొనుగోలు చేసే నష్టంపై వారి ఆందోళనను స్పష్టం చేస్తోంది. ఆ్రస్టేలియా, ఇండోనేసియా నుంచి బొగ్గు తెప్పించేందుకు పావులు కదుపుతున్నారనేది వారి సమాచారం..కాగా ఈ మొత్తం వ్యవహారంలో ఓ బొగ్గు కాంట్రాక్టర్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలియవచ్చింది. ఆయన ప్రభుత్వ పెద్దలతో, ఇంధన శాఖ ముఖ్య అధికారితో తరచూ భేటీ అవ్వడంపై జె¯న్‌కో అధికారులు, సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

‘నైనీ’కి లేఖతో సరి! 
రాష్ట్రంలోని జెన్‌కో ప్లాంట్లకు రోజుకు 80 వేల టన్నుల బొగ్గు అవసరం. ప్రతి ప్లాంట్‌ వద్ద కనీసం 21 రోజులకు సరిపడా నిల్వలు ఉండాలి. ఇది కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) నిబంధన. ఈ లెక్కన 16 లక్షల టన్నులకు పైగా బొగ్గు ఉండాలి. కానీ ప్రస్తుతం ఏ ప్లాంట్‌లోనూ 3, 4 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవు. దీంతో యాదాద్రి వంటి సూపర్‌ క్రిటికల్‌ ప్లాంట్‌లో సైతం రెండు యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేశారు. మిగతా యూనిట్లలోనూ ఇదే పరిస్థితి. అయితే 4 నెలల క్రితమే జె¯న్‌కో ఈ పరిస్థితిని అంచనా వేసింది. నైనీ కోల్‌ బ్లాక్‌ సహా కోల్‌ ఇండియాతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే మహానది కోల్‌ ఫీల్డ్స్‌కు లేఖ రాయడం వరకే సంబంధిత అధికారులు పరిమితమయ్యారు. మార్కెట్‌ రేటుకు బొగ్గు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఇంధనశాఖ ఉన్నతాధికారికి జె¯న్‌కో ఉన్నతాధికారులు సూచించినా.. ఆయన మాత్రం పాత ధరకే బొగ్గు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో కోల్‌ ఇండియా బొగ్గు ఇవ్వడానికి ముందుకు రాలేదు.  

‘మహానది’లో ఉత్పత్తి పెరిగినా..  
మహానది కోల్‌ ఫీల్డ్స్‌ రోజుకు 6 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. ఇటీవల కాలంలో ఉత్పత్తి పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. అయినా కోల్‌ ఇండియా పరిధిలోనే ఉన్న మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి బొగ్గు తీసుకొచ్చే దిశగా కూడా సీరియస్‌ ప్రయత్నాలు జరగలేదనే విమర్శలున్నాయి. మరోవైపు రాష్ట్రానికే చెందిన బొగ్గు గనుల శాఖ మంత్రితోనూ ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదని అంటున్నారు. ఇలావుండగా జెన్‌కో ప్లాంట్లకు సింగరేణి సంస్థ జీ–11 నుంచి జీ–15 వరకు బొగ్గును సరఫరా చేస్తోంది. అయితే దాదాపు రూ.22 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల నాణ్యమైన జీ–9 బొగ్గును మనకు ఇవ్వకుండా తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటోంది. తెలంగాణకు చెందిన సింగరేణి జీ–5 బొగ్గు 8.15 లక్షల టన్నులు, జీ–6 బొగ్గు 8.45 లక్షల టన్నులు, జీ–7 బొగ్గు 18.61 లక్షల టన్నులు, జీ–8 బొగ్గు 46.95 లక్షలు టన్నులు, జీ–9 బొగ్గు 49.21 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తోంది. అయితే కేవలం బకాయిలు చెల్లించని కారణంగానే నాణ్యమైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు ఇస్తూ, తెలంగాణ జెన్‌కోకు నాణ్యత అంతగా లేని బొగ్గును అందిస్తోందని అధికార వర్గాలు అంటున్నాయి. నాణ్యమైన జీ–9 బొగ్గును దక్కించుకోవడంలో విఫలమవ్వడమూ అనేక సందేహాలకు తావిస్తోంది.  

ముడుపులపై దృష్టి..ఉన్నత స్థాయిలో ఒత్తిడి 
ప్రస్తుతం సింగరేణి అందించే బొగ్గు టన్ను రూ.3,800 వరకూ ఉంటుంది. మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి తీసుకున్నా రూ.4,200కు మించదు. అదే ఆస్ట్రేలియా, ఇండోనేసియా నుంచి వచ్చే బొగ్గు అయితే రూ.10 వేలకు పైమాటే. అంటే టన్నుకు రెట్టింపును మించి రూ.6 వేలు ఎక్కువ చెల్లించాలి. 50 లక్షల టన్నుల బొగ్గు తెప్పించేందుకు జె¯న్‌కో ప్రతిపాదన పంపాలని ఇంధనశాఖ ఉన్నతాధికారి ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ అదే జరిగితే దాదాపు రూ.3 వేల కోట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు బొగ్గు తేవడం నుంచి థర్మల్‌ ప్లాంట్లకు చేరవేయడం వరకూ ప్రైవేటు కాంట్రాక్టు సంస్థకే అప్పగిస్తారు. రవాణా చార్జీల రూపంలో మరింత భారం పడుతుంది. అయితే కాంట్రాక్టు సంస్థ అన్ని స్థాయిల్లోనూ ముడుపులు చెల్లించే అవకాశం ఉండటంతో ఈ ప్రతిపాదనపై ఉన్నత స్థాయిలో ఒత్తిడి పెరుగుతోందని జె¯న్‌కో వర్గాలు అంటున్నాయి.  

ఆ బొగ్గుతో చిక్కులే.. 
స్వదేశీ బొగ్గును చిన్న చిన్న గులక రాళ్ళ తరహాలో పంపుతారు. ప్లాంట్‌కు చేరే సరికే ఇందులో తేమ తగ్గుతుంది. దీన్ని కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా క్రషింగ్‌ యంత్రానికి అందిస్తారు. అక్కడ పొడిగా మారుస్తారు. ఆ తర్వాత దీన్ని ఉష్టశక్తి కోసం వాడతారు. విదేశీ బొగ్గు పూర్తి పొడి మాదిరిగానే వస్తుంది. అయితే కాంట్రాక్టు సంస్థ దీన్ని తడిపి లెక్కిస్తుంది. ఫలితంగా బొగ్గు బరువు పెరుగుతుంది. ఆ తర్వాత వాడే సమయానికి 35 శాతం వరకు పరిమాణం (క్వాంటిటీ) తగ్గుతుంది. నిల్వలు లేని పరిస్థితుల్లో తక్షణమే వాడాల్సి ఉంటుంది కాబట్టి ఆరబెట్టే వీలుండదు. పైగా ఎక్కువ పరిమాణం వాడటం.. అది బాయిలర్‌ వద్ద ఉష్ణశక్తికి ఆరిపోయి ఎక్కువ మంట రావడంతో ఇబ్బంది అవుతోందని 2022లోనే జెన్‌కో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అప్పట్నుంచీ విదేశీ బొగ్గు కొనుగోలు ప్రతిపాదనను రాష్ట్ర ఇంధనశాఖ తిరస్కరిస్తూ వస్తోంది. కానీ తాజాగా మరోసారి ఈ ప్రతిపాదన తెరపైకి వస్తోందని జె¯న్‌కో వర్గాలు చెబుతున్నాయి.   

బొగ్గు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి 
దేశవ్యాప్తంగా థర్మల్‌ ప్లాంట్లు బొగ్గు సమస్యను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలోని థర్మల్‌ ప్లాంట్లలో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం. నైనీ కోల్‌ బ్లాక్‌ నుంచి బొగ్గు సరఫరా పెరిగే వీలుంది. కోల్‌ ఇండియాతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. విదేశీ బొగ్గు ప్రతిపాదనపై ఎలాంటి ఆలోచన చేయలేదు.  
– ఎస్‌.హరీష్‌ (జె¯న్‌కో సీఎండీ) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement