టీడీపీ ప్రాభవం కోల్పోవడం వల్లే నేను పార్టీ మారా | CM Revanth Reddy Comments On TDP, Chandrababu | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రాభవం కోల్పోవడం వల్లే నేను పార్టీ మారా

Sep 29 2026 2:11 AM | Updated on Sep 29 2026 2:11 AM

CM Revanth Reddy Comments On TDP, Chandrababu

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ప్రాభవం కోల్పోయిందని, నాయుడు (చంద్రబాబునాయుడు)తో కలిసి పనిచేస్తే తెలంగాణలో ఇబ్బందని ప్రజలు చెప్పడం వల్లే పార్టీ మారానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నాడు కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యంతో ఉన్న ఎన్‌డీఏతో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌తో పోరాడటానికే కాంగ్రెస్‌ పార్టీలో చేరానని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ప్రతిదిన్‌ మీడియా నెట్‌వర్క్‌ నిర్వహించిన ‘ది కాంక్లేవ్‌ 2026’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. దేశ భవిష్యత్తును పునర్నిమించడంలో యువతకు ప్రాధాన్యత అవసరమన్నారు. జెన్‌ జీ సవాళ్లు, వారి ఆకాంక్షలను ప్రతిబింబించేలా పరిపాలన సాగాలని, యువతకు రాజకీయ ప్రాతినిధ్యం, విస్తృత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో  వినూత్నంగా ప్రారంభించిన ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ద్వారా యువతకు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడానికి తీసుకుంటున్న చర్యలను రేవంత్‌ వివరించారు.  

మోదీకి మన్మోహన్‌సింగ్‌ సహకరించారు 
‘నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి విషయంలో అప్పటి  ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహకరించారు. కానీ ఇప్పుడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధి విషయంలో సహకరించట్లేదు. హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు టెండర్లు పిలిచే సమయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులను అడ్డుకుంది. ఇది నార్త్‌ వర్సెస్‌ సౌత్‌ కాదు.. గుజరాత్‌ వర్సెస్‌ మిగతా భారతదేశం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎంపీగా ఉత్తరప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ.. నిధులు మాత్రం గుజరాత్‌కు తరలించుకుపోతున్నారు.  

ఎలక్షన్‌ కమిషన్‌ను మోదీ వాడుకుంటున్నారు.. 
నాడు బ్రిటిష్‌ వారు సైమన్‌ కమిషన్‌ను తీసుకొచ్చినట్లుగా ఇప్పడు మోదీ ఎలక్షన్‌ కమిషన్‌ను ఉపయోగించుకుంటున్నారు. 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారు. దేశంలో జనాభా తగ్గనప్పుడు ఓట్లు ఎలా తగ్గుతాయి? నాడు సైమన్‌ గో బ్యాక్‌ అని నినదించినట్లు ఇప్పడు ‘సర్‌’గో బ్యాక్‌ అని దేశమంతా ముక్తకంఠంతో నినదించాల్సిన సమయం వచ్చింది.  

ఆ రెండింటినీ ముడిపెట్టడం సరికాదు.. 
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ (నియోజకవర్గాల పునర్విభజన) అనేవి పూర్తిగా భిన్నమైన అంశాలు. మహిళా రిజర్వేషన్ల అమలును జనగణన, డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకూ నిలిపేయకుండా, 33 శాతం మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి. అయితే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ను ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటోంది. కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను విభజిస్తే, జనాభా నియంత్రణను సమర్థంగా పాటించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఉత్తరాదికి ఎక్కువ సీట్లు వచ్చి, పార్లమెంట్‌లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. కేవలం జనాభాను కాకుండా రాష్ట్రాల జీఎస్‌డీపీ, దేశాభివృద్ధికి ఇస్తున్న సహకారాన్ని పరిగణనలోకి తీసుకునే ‘హైబ్రిడ్‌ డీలిమిటేషన్‌ మోడల్‌’ను రూపొందించాలి. డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా, ఆల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహించాలి. 

తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియం కావాలన్నారు.. 
సోనియాగాంధీ ఏ లక్ష్యాలతోనైతే తెలంగాణ ఇచ్చారో వాటన్నింటినీ కేసీఆర్‌ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను ఎందుకు పంపడం లేదని వారి తల్లిదండ్రులను అడిగితే ఇంగ్లిష్‌ మీడియం కావాలన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థలో లోపాలు గుర్తించి, వాటిని సరిచేస్తున్నాం. పదో తరగతి తర్వాత చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఏటా రూ.2,500 కోట్లు ఇస్తున్నాం. ఇంటరీ్మడియట్‌ తర్వాత స్కిల్స్‌ నేర్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం..’అని సీఎం చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement