దేశవ్యాప్తంగా సీఈసీ వ్యతిరేక ర్యాలీ  | Congress protests against CEC Gyanesh Kumar resignation demand | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా సీఈసీ వ్యతిరేక ర్యాలీ 

Sep 29 2026 5:45 AM | Updated on Sep 29 2026 5:45 AM

Congress protests against CEC Gyanesh Kumar resignation demand

జ్ఞానేశ్‌ను పదవి నుంచి తప్పించాలంటూ కాంగ్రెస్‌ డిమాండ్లు

న్యూఢిల్లీ/ఆగ్రా/లక్నో: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) వివాదంలో కేంద్రబిందువుగా మారిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌ శ్రేణులు దేశవ్యాప్తంగా వీధుల్లో కదంతొక్కారు. సోమవారం అన్ని రాష్ట్రాల్లో జ్ఞానేశ్‌ వైఖరిని తప్పుబడుతూ కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ ర్యాలీలు చేపట్టారు. 

లోపభూయిష్టంగా తయారైన ఎస్‌ఐఆర్‌కు నైతికబాధ్యతగా జ్ఞానేశ్‌ స్వచ్ఛందంగా పదవిని వీడాలని డిమాండ్లుచేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినదించారు. పంజాబ్, హరియాణా, జమ్మూకశ్మీర్, రాజస్తాన్, యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా తదితర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. పలు రాష్ట్రాల్లో జ్ఞానేశ్‌ దిష్టిబొమ్మను దగ్ధంచేశారు. 

పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కీలకనేతలు స్వయంగా పాల్గొని జ్ఞానేశ్‌కు వ్యతిరేకంగా నినదించారు. అయితే చాలా చోట్ల ఈ ర్యాలీలకు అనుమతి లభించలేదు. అయినాసరే పలు నగరాల్లో కాంగ్రెస్‌ చేపట్టిన ర్యాలీలను పోలీసులు అడ్డుకున్నారు. జైపూర్, భోపాల్, తదితర నగరాల్లో బారికేడ్లతో పోలీసులు ర్యాలీలను నిలువరించే ప్రయత్నంచేశారు. దీంతో ఆయా చోట్ల కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 

జలఫిరంగులను ఎక్కుపెట్టి కార్యకర్తలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ మార్గ్‌లోని పార్టీ ఆఫీస్‌ నుంచి వందలాది మంది కార్యకర్తలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వాచన్‌ సదన్‌’కు ర్యాలీగా బయల్దేరారు. పోలీసులు వీళ్లను మార్గమధ్యంలోనే అడ్డగించారు. ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ ఆఫీస్‌ నుంచి సైతం బయల్దేరిన యువజన కాంగ్రెస్‌ సభ్యులను పోలీసులు ఇలాగే మార్గమధ్యంలోనే బారిరీకేడ్లు అడ్డుపెట్టి నిలువరించారు. 

కొందరు జ్ఞానేశ్‌లా మాస్క్ ధరించారు. వాళ్ల చేతులకు గొలుసులు బిగించుకున్నారు. ‘‘బీజేపీ ప్రయోజనాలను కాపాడుతున్న ఈసీ చేతులు కట్టేసిఉన్నాయి’’అంటూ నినదించారు. నిరసన ర్యాలీలపై రాహుల్‌గాంధీ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘జ్ఞానేశ్‌ ఒక దేశద్రోహి. ఇప్పటికైనా ఆయన ఓటు చోరీ ఉదంతంలో అప్రూవర్‌గా మారితే మంచిది. అయినా జ్ఞానేశ్‌ పదవి నుంచి వెళ్లిపోయినా ఆయనను ఇలా తయారుచేసిన ‘శక్తులు’ప్రజలకు జవాబు చెప్పి తీరాల్సిందే’’అని రాహుల్‌ పరోక్షంగా బీజేపీ అగ్రనాయకత్వాన్ని డిమాండ్‌చేశారు.

జ్ఞానేశ్‌ ఇంటిపై రాతలు.. 
ఆగ్రా నగరంలోని జ్ఞానేశ్‌ సొంత ఇంటిపై ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు జ్ఞానేశ్‌ ద్రోహి, జ్ఞానేశ్‌ దొంగ అని రాతలు రాశారు. విజయ్‌నగర్‌లోని కుమార్‌ ఇంటి గేటు మీద, గోడ మీద స్ప్రే పెయింట్‌తో రాతలు రాశారు. రాతలతోపాటు గోడలపై జ్ఞానేశ్‌కు వ్యతిరేకంగా స్టిక్కర్లు, కరపత్రాలను అతికించారు. దీంతో హరిపర్వత్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసిన పోలీసులు కాంగ్రెస్‌ నేత ముకేశ్‌ ధంగర్, పార్టీ ప్రధాన కార్యదర్శి(వ్యవస్థీకృతం) అనిల్‌ యాదవ్‌లను అరెస్ట్‌చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement