నాలుగేళ్ల నిబంధన, రాష్ట్రపతి ఉత్తర్వులే కీలకమన్న సుప్రీంకోర్టు
ఏపీలో ఇంటర్ చదివిన తెలంగాణ విద్యార్థినికి చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణ విద్యార్థినికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైద్య విద్య తదితర కోర్సుల ప్రవేశాల్లో స్థానికత నిర్ధారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, రాష్ట్రపతి ఉత్తర్వులే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారన్న నిబంధన అమల్లో ఉన్నప్పుడు, దానికి విరుద్ధంగా ప్రత్యేక మినహాయింపులు కోరడం కుదరదని తేల్చిచెప్పింది. ఏపీలో ఇంటర్మీడియెట్ చదివిన తనకు తెలంగాణలో స్థానికత కలి్పంచేలా ఆదేశాలివ్వాలని కోరుతూ జెల్లా అంకిత అనే విద్యార్థిని దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సోమవారంన్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
అసలేం జరిగింది?
ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు 12 ఏళ్ల పాటు తెలంగాణలోనే చదివిన అంకిత.. రెండేళ్ల ఇంటర్మీడియట్‌ను ఏపీలో పూర్తి చేసింది. ప్రవేశాల సమయంలో స్థానికత నిర్ధారణకు వచ్చే సరికి అంకితకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంటర్, అంతకుముందు రెండేళ్లు అంటే వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే వారినే స్థానికులుగా పరిగణిస్తామన్న నిబంధనల ప్రకారం ఆమెకు తెలంగాణలో స్థానిక కోటాకు అర్హత లేకుండా పోయింది.
దీనిపై ముందుగా ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, స్థానికతకు సంబంధించిన నిబంధనలను హైకోర్టు సమర్థించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ కేవలం ఉన్నత విద్యాభ్యాసం కోసమే రెండేళ్లు ఏపీకి వెళ్లిందని తెలిపారు. విద్యార్థిని తండ్రి, తాత కూడా తెలంగాణలోనే నివసిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో స్థానికతను నిరాకరిస్తే అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఎక్కడా స్థానికత వర్తించకుండా ఆమె నష్టపోతుందని వాదించారు.
రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించలేం: సుప్రీంకోర్టు
వాదనలు విన్న ధర్మాసనం స్థానికతకు సంబంధించిన ప్రభుత్వ జీవోను హైకోర్టు ఇప్పటికే సమర్థించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ జీవోను వర్తింపజేస్తే, అందులోని ’నాలుగేళ్ల నిబంధన’ప్రకారమే ప్రక్రియ నడుస్తుందని తేల్చిచెప్పింది. ‘తండ్రి ఎక్కడ ఉంటున్నారనే దానితో సంబంధం లేదు. చదువు కోసం మీరు రాష్ట్రం దాటి వెళ్లారు. ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఆ ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పుడు వాటిని కాదని మీకు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం కల్పించలేం. అది రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుంది‘అని న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం పిటిషనర్‌కు ఇతర ప్రత్యామ్నాయం ఏదీ లేదంటూ ధర్మాసనం కేసును కొట్టివేసింది.


