local quota
-
గెలుపు సులువే.. అటు ఓటూ విలువే!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి స్థానిక సంస్థల కోటాలో ఆరు స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్ల మద్దతు కూడగట్టడంపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. ఐదు పూర్వపు జిల్లాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న ఆరు స్థానాల్లో 26 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా 5,326 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సంఖ్యతో పోలిస్తే ఎంపీటీసీ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. కాగా ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అలాగే తొలిసారిగా ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో.. ఎన్నికలు జరిగే జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఎన్నికల సంఘం స్థానిక సంస్థల కోటాలో ఓటు హక్కును కల్పించింది. దీంతో ఓటు వేయనున్న 65 మంది ఎక్స్ అషిషియో సభ్యుల్లోనూ మెజారిటీ ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అన్ని స్థానాలూ గెలిచే బలమున్నా.. అన్ని స్థానాలూ సొంతంగా గెలించేందుకు అవసరమైన బలమున్నప్పటికీ, ప్రతి ఓటునూ కీలకంగా భావిస్తున్న టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఖమ్మం, మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు, కరీంనగర్, ఆదిలాబాద్‌లో బీజేపీ పరోక్షంగా బలపరుస్తున్న అభ్యర్థులు పోటీలో ఉండటంతో అప్రమత్తమైంది. రెండు స్థానాలున్న కరీంనగర్లో అత్యధికంగా 1,324 మంది ఓటర్లు ఉండటంతో పాటు ఒకరిద్దరు బలమైన స్వతంత్రులు పోటీ చేస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకుని పావులు కదుపుతోంది. తమ పార్టీ తరఫున ఎన్నికైన ఓటర్లు ఎవరూ చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అదే సమయంలో విపక్ష పార్టీల ఓట్లనూ రాబట్టే ప్రణాళికను అమలు చేస్తోంది. మొత్తం ఓటర్లలో విపక్ష పార్టీలకు చెందిన సుమారు 30 శాతం మంది వివిధ రకాల స్థానిక సంస్థల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. క్యాంపులకు తరలించేందుకు సన్నాహాలు విపక్ష పార్టీల నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు చాలాచోట్ల ఇప్పటికే టీఆర్ఎస్ గూటికి చేరారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీలకు చెందిన మరింతమంది కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను చేర్చుకోవడంపై, వారి మద్దతు కూడగట్టడంపై టీఆర్ఎస్ శాసనసభ్యులు దృష్టి సారించారు. నేరుగా మద్దతు ఇవ్వలేని పక్షంలో కనీసం ఓటు అయినా వేసేలా సంప్రదింపులు, సమాలోచనలు జరుగుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న ఎంపీటీసీ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఓటర్లు చేజారకుండా నిర్వహించే క్యాంపులకు పార్టీ మద్దతుదారులతో పాటు విపక్ష ఓటర్లనూ తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెదక్, ఖమ్మంలో మినహా, మిగతా చోట్ల స్వతంత్రులే పోటీలో ఉండటంతో విపక్ష ఓట్లు రాబట్టడం అంతకష్టమేమీ కాదని టీఆర్ఎస్ భావిస్తోంది. -
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే
సాక్షి, అమరావతి: పుట్టిన ఊరి సమీపంలో పరిశ్రమలున్నా అందులో ఉపాధి దొరకక ఉద్యోగాల కోసం ఉన్న ఊరును, కన్నవారిని విడిచి వలసపోతున్న దుస్థితి. అక్కడ ఉపాధి లభించక పస్తులుంటున్న పరిస్థితి. తమ బిడ్డ పరాయి గడ్డపై పడుతున్న కష్టాలను తలచుకొని కుములిపోతున్న తల్లిదండ్రులెందరో. ఈ పరిస్థితిని తన ప్రజా సంకల్పయాత్రలో చూసి చలించి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే ‘పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల’ కల్పన. పాదయాత్ర సాక్షిగా ఇచ్చిన హామిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును సభలో ప్రవేశపెట్టి, ఆమోదింపజేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిది. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించటం పట్ల నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులలో ఆనందం వెల్లువిరిచి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కచ్చితంగా అమలు పరిశ్రమల్లో ఉన్న ఉద్యోగాలు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా ప్రభుత్వ ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది. సంబంధిత పరిశ్రమ ఏర్పాటు సమయంలోనే ఎంవోయూ చేసుకునే ముందు ఈ షరతుతోనే అనుమతులు ఇవ్వనున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐటీ ఆధారిత కంపెనీల విషయంలో ఇదే తరహాలో వ్యవహరించటంతో ఎంతో మంది ఇంజినీరింగ్ విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లకుండా ఆగిపోయారు. ఇప్పుడు వైఎస్సార్ స్ఫూర్తిని అన్ని రకాల పరిశ్రమల్లో చట్టప్రకారం అమలు చేయనుండటంతో నిరుద్యోగుల్లో భరోసాను నింపుతోంది. ప్రస్తుతం జిల్లా నుంచి హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి మహానగరాలకు వెళుతున్న, వెళ్లిన వారు తాజా నిర్ణయంతో తిరిగి సొంత రాష్ట్రానికి రానున్నారు. జిల్లా నుంచి ఏటా లక్ష మంది జిల్లాలో ప్రతి సంవత్సరం తమ చదువులు పూర్తి చేసుకొని సుమారు లక్ష మంది ఉ ద్యోగార్థులు ఉద్యోగాల వేట మొదలుపెడుతున్నారు. ఇందులో ఇంజినీరింగ్ పట్టా పొందిన వారు 18 వేల మంది, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి టెక్నికల్ కో ర్సుల విద్యార్థులు 20 వేల మంది, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, నర్సింగ్ వంటి ఇతర కోర్సుల నుంచి దాదాపు 60 వేల మంది ఉంటారు. వివిధ కోర్సుల్లో చదువు పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలనే తపన, ఆకాంక్షతో బయటకు వస్తున్న యువతకు సరైన అవకాశాలు లేక నిర్వీర్యమవుతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, డిగ్రీ వి ద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఆధి కశాతం విఫలమవుతున్నారు. అందు కు కారణం చదువుకున్న దానికి, ఉద్యోగం ఇచ్చే కంపెనీ అవసరాలకు పొంతన లేకపోవటం. పరిశ్రమలు అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం పెంచటానికి నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికో సి ల్స్డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చే యనున్నారు. శిక్షణా కేంద్రాలకు వివిధ కంపెనీల ప్రతినిధులకు పిలిపించి వారికి అవసరమైన విధంగా శిక్షణ ఇప్పించనున్నారు. నిరుద్యోగులకు వరం పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో కీలక బిల్లును ఆమోదించటం హర్షణీయం. స్థానిక నిరుద్యోగులకు ఇదో మంచి శుభపరిణామం. ఉద్యోగాల కోసం వలసలు వెళుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం నిరుద్యోగుల పాలిట వరం. –దొడ్డా అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు, కృష్ణా జిల్లా శిక్షణతో ఉపాధి నిరుద్యోగులు స్థానికంగా ఏర్పాటయ్యే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నైపుణ్య శిక్షణ పొందటం ద్వారా ఉపాధి అవకాశాల మెరుగుపడతాయి. కంపెనీల అవసరాలు తీర్చే మానవ వనరులు స్థానికంగా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వారికి అవకాశాలు ఇస్తారు. చదువుతోపాటు నైపుణ్య శిక్షణ లభిస్తే ఉపాధి వేటలో యువత దూసుకుపోతారు. –గడిపాటి సుబ్బరాజు, ఏబీవీపీ జిల్లా సంఘటనా కార్యదర్శి జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజ్‌లు – 34 ఏటా కళాశాలల నుంచి వస్తున్న ఇంజినీరింగ్ పట్టభద్రులు – సుమారు 18,000 పాలిటెక్నిక్, ఐటీఐ వంటి టెక్నికల్ విద్యార్థులు – సుమారు 20,000 డిగ్రీ, పీజీ, నర్సింగ్, ఫార్మసీ, టీచిం గ్ వంటివాటి నుంచి వస్తున్న పట్టభద్రులు – సుమారు 60,000 జిల్లాలో ఏటా ఉద్యోగాల కోసం విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్న వారి సంఖ్య 1,00,000 -
స్థానిక కోటాకు గోవిందా..
♦ తిరుపతి వాసులపై ప్రభుత్వానికి చిన్నచూపు ♦ శ్రీవారి దర్శన భాగ్యానికి దూరం చేసిన వైనం ♦ ప్రతినెలా మొదటి మంగళవారానికి మంగళం ♦ మూడునెలలకోసారీ దొరకని దర్శనం ♦ మహతి నుంచి తిరుమలకు బుకింగ్ కౌంటర్ ♦ స్థానికుల కోటాపై దళారుల కన్ను రోజూ ఎదురుగా సాక్షాత్కరిస్తుంది. ఏడుకొండలెక్కి దర్శించుకుందామంటే గంటల తరబడి క్యూలో వేచి ఉండాలి. తిరుమల పాదాల చెంత ఉండి కూడా స్వామి దర్శనం తిరుపతి వాసులకు కష్టమే. గతంలో పెట్టిన ‘స్థానిక’ కోటాకు ప్రభుత్వం మంగళం పాడేయడంతో వెంకన్నను దర్శించుకోవాలంటే దూర ప్రాంతాల భక్తుల్లానే నిరీక్షించాల్సిందే. పైగా తిరుపతి వాసుల కోటాపై దళారులు కన్నేసి అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, తిరుపతి: తిరుమలేశుని దర్శన భాగ్యానికి తిరుపతి వాసులను ప్రభుత్వం దూరం చేస్తోంది. స్థానికులకున్న దర్శనం కోటాకు కోతపెట్టింది. ప్రతినెలా మొదటి మంగళవారం వీరికి కేటాయించిన శ్రీవారి దర్శనం కోటాను మూడునెలలకోసారిగా మార్చింది. ఇప్పుడు ఆ అవకాశానికి కూడా ప్రభుత్వం, టీటీడీ మంగళం పాడేందుకు రంగం సిద్దం చేస్తున్నాయని తెలిసింది. తిరుమలకు ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో స్థానికులకు దర్శనం కష్టంగా మారింది. తమ కోసం ప్రత్యేకంగా కోటా కల్పించాలని వీరంతా డిమాండ్ చేశారు. ఫలితంగా 2013 బ్రహ్మోత్సవాల అనంతరం స్థానికులకు దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి తీర్మానించింది. తిరుపతిలో నివాసం ఉండేవారికి (ఆధార్ ఆధారంగా) ప్రతినెలా మొదటి మంగళవారం ప్రత్యేకంగా దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంతో పాటు తిరుమలలో స్థానికుల కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. టీటీడీ మొదటి మంగళవారం ఐదు సేవలకు అవసరమైన టికెట్లు ఇచ్చేవారు. మొదట్లో కొద్దిరోజులు 5వేల మంది వరకు స్థానికులు శ్రీవారిని దర్శించుకునేవారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2015 నుంచి స్థానికుల దర్శనం కోటాలో సమూల మార్పులు చేయటం ప్రారంభించారు. ప్రతినెలా మొదటి మంగళవారం భక్తుల సంఖ్యను పరి మితం చేశారు. వేల నుంచి వందలకు కుదించారు. మొదటి మంగళవారంలో 600 టికెట్లు సుప్రభాతం, నిజపాద దర్శనం, తిరుప్పావడ, సహస్రకళసాభిషేకం, అష్టదళపాదపద్మారాదన సేవ కోసం ఇచ్చేవారు. కొన్నాళ్లకు ప్రతి మూడునెలల కొకసారి అంటూ నిబంధన పెట్టారు. స్థానికుల కోటా ఎత్తివేత? ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో స్థానిక దర్శనం కోటాను ఎత్తేయడానికి టీటీడీ సిద్ధమైనట్లు ఆరోపణులు వినిపిస్తున్నాయి. మహతిలో ఉన్న కౌంటర్‌ను తిరుమలలోని జేఈఓ కార్యాలయానికి మార్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడైనా స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారా? అంటే అదీ లేదని మండిపడుతున్నారు. గతంలో కరెంట్ బుకింగ్‌తో పాటు ఆన్లైన్లో కూడా టికెట్లు ఇచ్చేవారని, ప్రస్తుతం అవేమీ లేకుండా చేసినట్లు చెబుతున్నారు. ప్రతి మూడునెలల కొకసారి వచ్చే మొదటి మంగళవారంలో మొక్కుబడిగా 100 లేదా 120 టికెట్లు మాత్రం స్థానికులకు ఇచ్చి మిగిలినవి కొందరు దళారులు అమ్మి సొమ్ముచేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ అధికారులు స్థానికుల దర్శన కోటా సేవా టికెట్లను సైతం వీఐపీలకు కేటాయించి తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం, టీటీడీ అధికారులు స్పందించి స్థానిక కోటాను కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.