
సాక్షి, అమరావతి: పుట్టిన ఊరి సమీపంలో పరిశ్రమలున్నా అందులో ఉపాధి దొరకక ఉద్యోగాల కోసం ఉన్న ఊరును, కన్నవారిని విడిచి వలసపోతున్న దుస్థితి. అక్కడ ఉపాధి లభించక పస్తులుంటున్న పరిస్థితి. తమ బిడ్డ పరాయి గడ్డపై పడుతున్న కష్టాలను తలచుకొని కుములిపోతున్న తల్లిదండ్రులెందరో. ఈ పరిస్థితిని తన ప్రజా సంకల్పయాత్రలో చూసి చలించి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే ‘పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల’ కల్పన. పాదయాత్ర సాక్షిగా ఇచ్చిన హామిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును సభలో ప్రవేశపెట్టి, ఆమోదింపజేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించటం పట్ల నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులలో ఆనందం వెల్లువిరిచి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
కచ్చితంగా అమలు
పరిశ్రమల్లో ఉన్న ఉద్యోగాలు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా ప్రభుత్వ ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది. సంబంధిత పరిశ్రమ ఏర్పాటు సమయంలోనే ఎంవోయూ చేసుకునే ముందు ఈ షరతుతోనే అనుమతులు ఇవ్వనున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐటీ ఆధారిత కంపెనీల విషయంలో ఇదే తరహాలో వ్యవహరించటంతో ఎంతో మంది ఇంజినీరింగ్ విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లకుండా ఆగిపోయారు. ఇప్పుడు వైఎస్సార్ స్ఫూర్తిని అన్ని రకాల పరిశ్రమల్లో చట్టప్రకారం అమలు చేయనుండటంతో నిరుద్యోగుల్లో భరోసాను నింపుతోంది. ప్రస్తుతం జిల్లా నుంచి హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి మహానగరాలకు వెళుతున్న, వెళ్లిన వారు తాజా నిర్ణయంతో తిరిగి సొంత రాష్ట్రానికి రానున్నారు.
జిల్లా నుంచి ఏటా లక్ష మంది
జిల్లాలో ప్రతి సంవత్సరం తమ చదువులు పూర్తి చేసుకొని సుమారు లక్ష మంది ఉ ద్యోగార్థులు ఉద్యోగాల వేట మొదలుపెడుతున్నారు. ఇందులో ఇంజినీరింగ్ పట్టా పొందిన వారు 18 వేల మంది, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి టెక్నికల్ కో ర్సుల విద్యార్థులు 20 వేల మంది, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, నర్సింగ్ వంటి ఇతర కోర్సుల నుంచి దాదాపు 60 వేల మంది ఉంటారు. వివిధ కోర్సుల్లో చదువు పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలనే తపన, ఆకాంక్షతో బయటకు వస్తున్న యువతకు సరైన అవకాశాలు లేక నిర్వీర్యమవుతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, డిగ్రీ వి ద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఆధి కశాతం విఫలమవుతున్నారు. అందు కు కారణం చదువుకున్న దానికి, ఉద్యోగం ఇచ్చే కంపెనీ అవసరాలకు పొంతన లేకపోవటం. పరిశ్రమలు అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం పెంచటానికి నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికో సి ల్స్‌డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చే యనున్నారు. శిక్షణా కేంద్రాలకు వివిధ కంపెనీల ప్రతినిధులకు పిలిపించి వారికి అవసరమైన విధంగా శిక్షణ ఇప్పించనున్నారు.
నిరుద్యోగులకు వరం
పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో కీలక బిల్లును ఆమోదించటం హర్షణీయం. స్థానిక నిరుద్యోగులకు ఇదో మంచి శుభపరిణామం. ఉద్యోగాల కోసం వలసలు వెళుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం నిరుద్యోగుల పాలిట వరం.
–దొడ్డా అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు, కృష్ణా జిల్లా
శిక్షణతో ఉపాధి
నిరుద్యోగులు స్థానికంగా ఏర్పాటయ్యే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో నైపుణ్య శిక్షణ పొందటం ద్వారా ఉపాధి అవకాశాల మెరుగుపడతాయి. కంపెనీల అవసరాలు తీర్చే మానవ వనరులు స్థానికంగా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వారికి అవకాశాలు ఇస్తారు. చదువుతోపాటు నైపుణ్య శిక్షణ లభిస్తే ఉపాధి వేటలో యువత దూసుకుపోతారు.
–గడిపాటి సుబ్బరాజు, ఏబీవీపీ జిల్లా సంఘటనా కార్యదర్శి
జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజ్‌లు – 34
ఏటా కళాశాలల నుంచి వస్తున్న ఇంజినీరింగ్ పట్టభద్రులు – సుమారు 18,000
పాలిటెక్నిక్, ఐటీఐ వంటి టెక్నికల్ విద్యార్థులు – సుమారు 20,000
డిగ్రీ, పీజీ, నర్సింగ్, ఫార్మసీ, టీచిం గ్ వంటివాటి నుంచి వస్తున్న పట్టభద్రులు – సుమారు 60,000
జిల్లాలో ఏటా ఉద్యోగాల కోసం విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్న వారి సంఖ్య 1,00,000