breaking news
jobs holder
-
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే
సాక్షి, అమరావతి: పుట్టిన ఊరి సమీపంలో పరిశ్రమలున్నా అందులో ఉపాధి దొరకక ఉద్యోగాల కోసం ఉన్న ఊరును, కన్నవారిని విడిచి వలసపోతున్న దుస్థితి. అక్కడ ఉపాధి లభించక పస్తులుంటున్న పరిస్థితి. తమ బిడ్డ పరాయి గడ్డపై పడుతున్న కష్టాలను తలచుకొని కుములిపోతున్న తల్లిదండ్రులెందరో. ఈ పరిస్థితిని తన ప్రజా సంకల్పయాత్రలో చూసి చలించి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే ‘పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల’ కల్పన. పాదయాత్ర సాక్షిగా ఇచ్చిన హామిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును సభలో ప్రవేశపెట్టి, ఆమోదింపజేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిది. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించటం పట్ల నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులలో ఆనందం వెల్లువిరిచి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కచ్చితంగా అమలు పరిశ్రమల్లో ఉన్న ఉద్యోగాలు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా ప్రభుత్వ ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది. సంబంధిత పరిశ్రమ ఏర్పాటు సమయంలోనే ఎంవోయూ చేసుకునే ముందు ఈ షరతుతోనే అనుమతులు ఇవ్వనున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐటీ ఆధారిత కంపెనీల విషయంలో ఇదే తరహాలో వ్యవహరించటంతో ఎంతో మంది ఇంజినీరింగ్ విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లకుండా ఆగిపోయారు. ఇప్పుడు వైఎస్సార్ స్ఫూర్తిని అన్ని రకాల పరిశ్రమల్లో చట్టప్రకారం అమలు చేయనుండటంతో నిరుద్యోగుల్లో భరోసాను నింపుతోంది. ప్రస్తుతం జిల్లా నుంచి హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి మహానగరాలకు వెళుతున్న, వెళ్లిన వారు తాజా నిర్ణయంతో తిరిగి సొంత రాష్ట్రానికి రానున్నారు. జిల్లా నుంచి ఏటా లక్ష మంది జిల్లాలో ప్రతి సంవత్సరం తమ చదువులు పూర్తి చేసుకొని సుమారు లక్ష మంది ఉ ద్యోగార్థులు ఉద్యోగాల వేట మొదలుపెడుతున్నారు. ఇందులో ఇంజినీరింగ్ పట్టా పొందిన వారు 18 వేల మంది, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి టెక్నికల్ కో ర్సుల విద్యార్థులు 20 వేల మంది, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, నర్సింగ్ వంటి ఇతర కోర్సుల నుంచి దాదాపు 60 వేల మంది ఉంటారు. వివిధ కోర్సుల్లో చదువు పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలనే తపన, ఆకాంక్షతో బయటకు వస్తున్న యువతకు సరైన అవకాశాలు లేక నిర్వీర్యమవుతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, డిగ్రీ వి ద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఆధి కశాతం విఫలమవుతున్నారు. అందు కు కారణం చదువుకున్న దానికి, ఉద్యోగం ఇచ్చే కంపెనీ అవసరాలకు పొంతన లేకపోవటం. పరిశ్రమలు అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం పెంచటానికి నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికో సి ల్స్డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చే యనున్నారు. శిక్షణా కేంద్రాలకు వివిధ కంపెనీల ప్రతినిధులకు పిలిపించి వారికి అవసరమైన విధంగా శిక్షణ ఇప్పించనున్నారు. నిరుద్యోగులకు వరం పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో కీలక బిల్లును ఆమోదించటం హర్షణీయం. స్థానిక నిరుద్యోగులకు ఇదో మంచి శుభపరిణామం. ఉద్యోగాల కోసం వలసలు వెళుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం నిరుద్యోగుల పాలిట వరం. –దొడ్డా అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు, కృష్ణా జిల్లా శిక్షణతో ఉపాధి నిరుద్యోగులు స్థానికంగా ఏర్పాటయ్యే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నైపుణ్య శిక్షణ పొందటం ద్వారా ఉపాధి అవకాశాల మెరుగుపడతాయి. కంపెనీల అవసరాలు తీర్చే మానవ వనరులు స్థానికంగా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వారికి అవకాశాలు ఇస్తారు. చదువుతోపాటు నైపుణ్య శిక్షణ లభిస్తే ఉపాధి వేటలో యువత దూసుకుపోతారు. –గడిపాటి సుబ్బరాజు, ఏబీవీపీ జిల్లా సంఘటనా కార్యదర్శి జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజ్‌లు – 34 ఏటా కళాశాలల నుంచి వస్తున్న ఇంజినీరింగ్ పట్టభద్రులు – సుమారు 18,000 పాలిటెక్నిక్, ఐటీఐ వంటి టెక్నికల్ విద్యార్థులు – సుమారు 20,000 డిగ్రీ, పీజీ, నర్సింగ్, ఫార్మసీ, టీచిం గ్ వంటివాటి నుంచి వస్తున్న పట్టభద్రులు – సుమారు 60,000 జిల్లాలో ఏటా ఉద్యోగాల కోసం విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్న వారి సంఖ్య 1,00,000 -
ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుట్ర
నంద్యాల, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆరోపించారు. టీడీపీ అందుకు వంతపాడుతోందని విమర్శించారు. నంద్యాల పట్టణంలో ఆర్టీసీ, మున్సిపల్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు బుధవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు చేస్తున్న రాజీలేని పోరాటంపై నీళ్లు చల్లడానికి ప్రయత్నాలు జరగడం బాధాకరమన్నారు. రోజురోజుకు ఉద్ధృతమవుతున్న ఉద్యమాన్ని దెబ్బతీయడానికి రాష్ట్రపతి పాలన అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెస్తోందని అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు సైనికుల్లాగా పోరాడుతున్నారన్నారు. వారికి ఎలాంటి నష్టం జరిగినా చూస్తూ ఊరోకోబోమన్నారు. వారికైమైనా హాని జరిగితే అందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాధ్యుడవుతారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వెంటనే సీమాంధ్ర ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలోని 13జిల్లాల్లో ఉద్యోగులు చేస్తున్న పోరాటంతో కేంద్ర ప్రభుత్వంలో కనువిప్పు కలుగకపోవడం బాధాకరమన్నారు. ఉద్యమం విరమించుకోవాలని వారిని కోరడం కాంగ్రెస్ పార్టీ దివాలు కోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర కోసం రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు చేస్తున్న పోరాటానికైనా కాంగ్రెస్, టీడీపీలు తూట్లు పొడవకుండా ఉండాలని భూమా నాగిరెడ్డి కోరారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్రకు బాసటగా ఆందోళన నిర్వహించాలన్నారు. రెండుకళ్ల విధానంతో కొనసాగితే ఆయనకు రెండు కళ్లను మూయించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉద్యమం ఆరంభం దగ్గరి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రకటనలు చేస్తున్నారని భూమా ఆరోపించారు. వయసులో చిన్న వ్యక్తి అయినా ప్రజల భావాలకు అనుగుణంగా రాజీనామా చేసిన నేతగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోనున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులు సీమాంధ్రకు చెందిన వారైనప్పటికీ రాష్ట్ర ఐక్యత కోసం ఎందుకు రాజీనామాలు చేయలేదని భూమా ప్రశ్నించారు. రాయలసీమకు రావాల్సిన 70టీఎంసీల నీటిని ఎగువ ప్రాంతమైన తెలంగాణకు తీసుకెళ్లడానికి జీవోలు జారీ చేశారని, దీనిని వెంటనే ఉపసంహరించుకునే విధంగా జిల్లాకు చెందిన మంత్రులు కోట్ల, టీజీ, ఏరాసులు ప్రయత్నం చేయాలన్నారు.