సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆరోపించారు. టీడీపీ అందుకు వంతపాడుతోందని విమర్శించారు.
నంద్యాల, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆరోపించారు. టీడీపీ అందుకు వంతపాడుతోందని విమర్శించారు. నంద్యాల పట్టణంలో ఆర్టీసీ, మున్సిపల్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు బుధవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు చేస్తున్న రాజీలేని పోరాటంపై నీళ్లు చల్లడానికి ప్రయత్నాలు జరగడం బాధాకరమన్నారు. రోజురోజుకు ఉద్ధృతమవుతున్న ఉద్యమాన్ని దెబ్బతీయడానికి రాష్ట్రపతి పాలన అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెస్తోందని అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు సైనికుల్లాగా పోరాడుతున్నారన్నారు. వారికి ఎలాంటి నష్టం జరిగినా చూస్తూ ఊరోకోబోమన్నారు. వారికైమైనా హాని జరిగితే అందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బాధ్యుడవుతారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వెంటనే సీమాంధ్ర ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీమాంధ్రలోని 13జిల్లాల్లో ఉద్యోగులు చేస్తున్న పోరాటంతో కేంద్ర ప్రభుత్వంలో కనువిప్పు కలుగకపోవడం బాధాకరమన్నారు. ఉద్యమం విరమించుకోవాలని వారిని కోరడం కాంగ్రెస్ పార్టీ దివాలు కోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర కోసం రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు చేస్తున్న పోరాటానికైనా కాంగ్రెస్, టీడీపీలు తూట్లు పొడవకుండా ఉండాలని భూమా నాగిరెడ్డి కోరారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్రకు బాసటగా ఆందోళన నిర్వహించాలన్నారు. రెండుకళ్ల విధానంతో కొనసాగితే ఆయనకు రెండు కళ్లను మూయించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉద్యమం ఆరంభం దగ్గరి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రకటనలు చేస్తున్నారని భూమా ఆరోపించారు.
వయసులో చిన్న వ్యక్తి అయినా ప్రజల భావాలకు అనుగుణంగా రాజీనామా చేసిన నేతగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోనున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులు సీమాంధ్రకు చెందిన వారైనప్పటికీ రాష్ట్ర ఐక్యత కోసం ఎందుకు రాజీనామాలు చేయలేదని భూమా ప్రశ్నించారు. రాయలసీమకు రావాల్సిన 70టీఎంసీల నీటిని ఎగువ ప్రాంతమైన తెలంగాణకు తీసుకెళ్లడానికి జీవోలు జారీ చేశారని, దీనిని వెంటనే ఉపసంహరించుకునే విధంగా జిల్లాకు చెందిన మంత్రులు కోట్ల, టీజీ, ఏరాసులు ప్రయత్నం చేయాలన్నారు.