భిక్కనూరు లక్ష్మి ఇంటి నిర్మాణం పూర్తి
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట ఇచ్చిన సీఎం రేవంత్
‘సాక్షి’కథనంతో స్పందించిన సీఎంవో
ఇందిరమ్మ ఇల్లు మంజూరు.. నేడు గృహ ప్రవేశానికి ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా 2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామం మీదుగా పాదయాత్రగా వెళుతున్న అప్పటి పీసీసీ అధ్యక్షుడు, నేటి సీఎం రేవంత్‌రెడ్డిని భిక్కనూరు లక్ష్మి అనే మహిళ కలిసి కూలిపోయిన తన ఇంటిని చూడమని వేడుకుంది. దీంతో రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ కూలిపోయిన ఆమె ఇంటిని చూసి తాము అధికారంలోకి రాగానే ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చి వెళ్లారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ‘రేవంతన్నా.. నన్ను యాది మరవకు’అన్న శీర్షికతో ‘సాక్షి’మెయిన్ ఎడిషన్‌లో 2023 డిసెంబర్ 31న కూలిపోయిన ఇంటిలో భిక్కనూరు లక్ష్మితో మాట్లాడుతున్న ఫొటోతో ప్రచురించిన కథనానికి సీఎంవో అధికారులు స్పందించారు. అదేరోజు జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భిక్కనూరు లక్ష్మికి వెంటనే అప్పటికే పక్క గ్రామంలో నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు లక్ష్మి దగ్గరకు వెళ్లి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని చెప్పారు.
అయితే కూలిన ఇంటి స్థలంలోనే తాను ఇల్లు కట్టుకుంటానని ఆమె చెప్పడంతో ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపించారు. తొలి విడతలోనే లక్ష్మితో పాటు ఆమె తోటి కోడలు రాజమణికి కూడా ఇల్లు మంజూరైంది. ఎట్టకేలకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లక్ష్మి కుటుంబ సభ్యులు శనివారం గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పాదయాత్రలో ఇచి్చన మాట ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్మికి ఇల్లు మంజూరు చేశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారి గృహ ప్రవేశానికి తాను హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పేద మహిళలకు న్యాయం చేసిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


