కామారెడ్డి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం మొదటిరోజే రసాభాసగా ముగిసింది. అధికారుల తీరుపై బీజేపీ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు.
కామారెడ్డి బల్దియా కార్యాలయంలో శుక్రవారం ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ ప్రారంభోత్సవం, ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభం కాగానే కౌన్సిలర్లు కమిషనర్ రాజేందర్‌రెడ్డిని నిలదీశారు. కౌన్సిలర్లకు కనీస సమాచారం ఇవ్వకుండా, సర్క్యులర్ పంపకుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. వేదిక వద్ద కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. ప్రజాప్రతినిధులను ఎండలో నిలబెట్టడంపై మండిపడ్డారు. వార్డుల్లో వార్డు ఆఫీసర్లు తమ మాట వినడం లేదన్నారు. ప్రమాణ స్వీకారం చేసి ఇన్ని రోజులైనా కనీసం పరిచయ సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 46వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్‌కు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసిడింగ్ పత్రాలు ఎలా ఇస్తారని కమిషనర్‌ను ప్రశ్నించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైందని, ప్రజలు తమను నిలదీస్తున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకపోవడం, సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోపాటు అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీజేపీ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. రెండు రోజుల కిత్రమే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, మళ్లీ ఇలాంటి తప్పిదాలు రావని కమిషనర్ క్షమాపణలు చెప్పారు. తమకు సహకరించాలంటూ చైర్‌పర్సన్ ఉమారాణి విజ్ఞప్తి చేశారు. నిరసన తెలుపుతూ వెళ్తున్న బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లను ఆగాలంటూ కమిషనర్ విజ్ఞప్తి చేసినా వారు వినలేదు. చివరకు కాంగ్రెస్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి అధికారులు ప్రతిజ్ఞ చేయించి రెండు నిమిషాల్లోనే కార్యక్రమాన్ని ముగించారు.
‘ప్రగతి ప్రణాళిక’పై సమాచారం
ఇవ్వలేదన్న కౌన్సిలర్లు
మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం
సమావేశాన్ని బహిష్కరించిన
బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు


