సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలలో మక్కలు విక్రయించిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయి. మక్కలు అమ్మిన రైతులు డబ్బులు రాకపోవడంతో పడుతున్న ఇబ్బందులపై ఇటీవల ‘సాక్షి’లో ‘మక్కల పైసలు రాలే’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్‌రెడ్డిని తన చాంబర్‌కు పిలిపించి, సమస్యపై ఉన్నతాధికారులతో మాట్లాడాలని ఆదేశించారు. దీంతో ఆయన ఉన్నతాధికారులకు సమస్యను నివేదించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొందరు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మూడు నాలుగు రోజుల్లో మక్కలు విక్రయించిన రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అధికారులు తెలిపారు.
ఎల్లారెడ్డి: విద్యార్థులతో పాటు తల్లితండ్రులు సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలని జిల్లా సైన్స్ ఆఫీసర్ సిద్దిరాంరెడ్డి సూచించారు. శుక్రవారం ఎల్లారెడ్డిలోని జీవదాన్ పాఠశాలలో సైన్స్‌ఫేర్‌ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో నేషనల్ సైన్స్ డే కార్యక్రమంలో భాగంగా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనల్లో ఆసక్తితో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బాబు, వైస్ ప్రిన్సిపల్ జోబిష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన రెండెకరాల స్థలాన్ని కేటాయించాలని డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కోరారు. శుక్రవారం ఆయన కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. పార్టీ పరంగా వివిధ కార్యక్రమాలు, సమావేశాలు జరుపుకోవడానికి శాశ్వత భవనం కోసం స్థలాన్ని ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు మల్లికార్జున్ తెలిపారు.
దోమకొండ: జిల్లాకేంద్రం నుంచి దోమకొండ మీదుగా సిద్దిపేట వరకు ఎక్స్‌ప్రెస్ బస్ సర్వీసులు ప్రారంభించినట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు కామారెడ్డినుంచి ప్రారంభమై ముత్యంపేట, దోమకొండ, బీబీపేట, రాంపూర్, నిజాంపేట మీదుగా సిద్దిపేట వరకు వెళ్తుందని పేర్కొన్నారు. రోజూ ఉదయం 5.30 గంటలు, 10.30 గంటలు, 3 గంటలకు బస్సు సౌకర్యం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో సిద్దిపేట నుంచి కామారెడ్డికి ఉదయం 8 గంటలకు, 1 గంటకు, 3 గంటలకు ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు ఉంటాయని పేర్కొన్నారు. ఆయా గ్రామాల ప్రయాణికులు ఈ బస్ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


