‘శ్రేష్ట’ విద్యార్థులకు అన్యాయం | Students losing opportunities in the name of locality in higher educations | Sakshi
Sakshi News home page

‘శ్రేష్ట’ విద్యార్థులకు అన్యాయం

Mar 10 2026 5:36 AM | Updated on Mar 10 2026 5:36 AM

Students losing opportunities in the name of locality in higher educations

‘స్థానికత’ పేరుతో అవకాశాలు కోల్పోతున్న విద్యార్థులు

నీట్, జేఈఈ, ఎంసెట్‌లో సీట్లు సాధించినా వర్తించని ‘స్థానిక’ కోటా

ప్రతిభ గల ఎస్సీ విద్యార్థుల కోసం ‘శ్రేష్ట’ విద్యాపథకం తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం

9 నుంచి ఇంటర్‌ వరకు దేశంలోని టాప్‌ స్కూళ్లలో ఉచితంగా చదువుకునే అవకాశం

ఇంటర్‌ రాష్ట్రంలో చదవనందున ‘స్థానికత’ వర్తించదంటున్న రాష్ట్ర ప్రభుత్వం

ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న 1,015 మంది ఏపీ, 1,100 మంది తెలంగాణ విద్యార్థులు

తాజాగా ఎంసెట్‌ రిజిస్ట్రేషన్లలోనూ నాన్‌–లోకల్‌గానే గుర్తింపు

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విద్యా పథకంలో అద్భుతమైన ప్రతిభతో రాణించిన ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్ణయాలు కష్టాల పాల్జేస్తున్నాయి. నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలతో పాటు ఎంసెట్‌ వంటి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినా ప్రభుత్వం మాత్రం సీట్లు ఇవ్వనంటోంది. చట్టం పేరుతో వారి భవిష్యత్‌ అవకాశాలను కాలరాస్తోంది. దీంతో నిరుపేద ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. పోటీ పరీ­క్షల్లో రాణించి ర్యాంకులు సాధించినా తమ పరిస్థితి ఇలా మారిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

కూటమి ప్రభుత్వంలో అధికారులు, మంత్రుల చుట్టూ తిరిగినా సమస్యకు పరిష్కారం లభించ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం శేష్ట్ర విద్యా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులు దేశంలో ఎక్కడైనా ప్రముఖ విద్యాలయాల్లో చదువుకునే అవకాశం కల్పించింది. ఈ పథకంలో సీట్లు సాధించిన రాష్ట్ర విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లోని ఉత్తమ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదువు­కుంటున్నారు. కానీ, వారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ నాన్‌ లోకల్‌గా గుర్తిస్తుండడంతో వారు ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లు కోల్పోతున్నారు.

ఏటా దేశ వ్యాప్తంగా 3 వేల మంది ఎంపిక
ఎస్సీ సామాజిక వర్గంలో ప్రతిభ గల విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ­శాఖ 2022 జూన్‌లో ‘స్కీమ్‌ ఫర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ స్టూడెంట్స్‌ ఇన్‌ హైసూ్కల్స్‌ ఇన్‌ టార్గెటెడ్‌ ఏరియాస్‌’ (శ్రేష్ట) పథకాన్ని ప్రారంభించింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా ప్ర­తిభా పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. 2022 నుంచి ఏటా ఈ పథకం కింద 9, 11వ తరగతిలో ప్రవేశానికి 3 వేల మందిని ఎంపిక చేశారు. వీరికి దేశంలోని అత్యుత్తమ ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం సీట్లు కల్పించింది. ఇలా ఏపీ నుంచి 1,015 మంది విద్యార్థులు ఒడిశా, ఢిల్లీ, ఛత్తీస్‌గడ్‌ తదితర రాష్ట్రాల్లో ప్రముఖ ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదువుతున్నారు. అలాగే తెలంగాణ నుంచి మరో 1,100 మంది ఎస్సీ విద్యార్థులు కూడా వివిధ రాష్ట్రాల్లో చదువుతున్నారు.

శ్రేష్ట విద్యార్థులు నాన్‌ లోకల్‌ అంటూ తిరస్కరణ
కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న శ్రేష్ట పథకంలో ఎంపికైన విద్యార్థులు ‘స్థానికత’ అంశంతో నష్టపోతున్నారు. ఇంటర్మిడియెట్‌ పూర్తయ్యాక వారు రాష్ట్రానికి తిరిగి వస్తే వారికి రాష్ట్ర కోటా పొందేందుకు అనర్హులుగా పేర్కొంటుండడంతో వాస్తవానికి ‘స్థానికత’ నిబంధనలపై అధికారులకు సరైన అవగాహన లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. చట్ట ప్రకారం విద్యార్థి నిర్దిష్ట ప్రాంతంలో కనీసం నాలుగు సంవత్సరాలు వరుసగా చదువుకున్నా లేదా వారి తల్లిదండ్రులు రాష్ట్రంలో కనీసం 10 సంవత్సరాలు నివసించినా లేదా రాష్ట్రంలో ఎక్కడైనా వరుసగా ఏడు సంవత్సరాలు చదువుకున్నా స్థానికులుగా పరిగణిస్తారు.

కానీ అధికారులు మాత్రం విద్యార్థులు చదువు పూర్తి చేసిన సంవత్సరం నుంచి వెనక్కి లెక్కించడంతో కేవలం రెండేళ్లు ఇతర రాష్ట్రాల్లో చదువుకున్నవారు గతేడాది నీట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించినా నాన్‌ లోకల్‌గా గుర్తించడంతో సీట్లు పొందలేకపోయారు. తల్లిదండ్రుల నివాస కాలాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం విద్యా సంవత్సరాలనే ప్రామాణికంగా తీసుకోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు.

 

ఈ చిత్రంలో కనిపిస్తున్న పెద్దాయన పేరు చుక్కా అప్పన్న. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన శ్రీకాకుళం పట్టణంలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈయన ఇద్దరు కుమారులు చదువుల్లో చురుగ్గా ఉంటారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘శ్రేష్ట’ విద్యా పథకానికి ఎంపికై ఒడిశాలోని ప్రముఖ కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ స్కూల్లో సీట్లు సాధించారు. పెద్ద కొడుకు ఇంటర్‌ పూర్తి చేసి గతేడాది నీట్, ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించాడు. అయితే ఇంటర్మీడియెట్‌ వేరే రాష్ట్రంలో చదివినందున ఆంధ్రప్రదేశ్‌లో ‘స్థానిక’ కోటా వర్తించదని ఎంబీబీఎస్‌ సీటు వచ్చినా దరఖాస్తును తిరస్కరించారు. 

సమస్యను అధికారులు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. అప్పన్న చిన్న కొడుకు ప్రస్తుతం సీబీఎస్‌ఈ ప్లస్‌ టూ పరీక్షలు రాస్తున్నాడు. ఎంసెట్, జేఈఈకి రిజిస్ట్రేషన్‌ చేసుకుందామంటే నాన్‌ లోకల్‌ కిందే గుర్తిస్తుండడంతో ఆందోళన చెందుతున్నాడు. కళ్లముందే ప్రతిభ గల ఇద్దరు బిడ్డలకు ప్రభుత్వమే అన్యాయం చేస్తుంటే అప్పన్న కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప న్యాయం పొందలేకపోతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement