కబ్జాలకు చరమ‘గీతం’ పాడండి | YSRCP Leaders Protest On land Scam Of Geetam University | Sakshi
Sakshi News home page

కబ్జాలకు చరమ‘గీతం’ పాడండి

Mar 10 2026 5:13 AM | Updated on Mar 10 2026 5:13 AM

YSRCP Leaders Protest On land Scam Of Geetam University

విశాఖ కలెక్టరేట్‌ ముందు నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు

‘గీతం’ ఆక్రమిత భూములను వెనక్కి తీసుకోవాల్సిందే

ఫిర్యాదులు తీసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌  

కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ అధికారుల సాకులు  

అర్జీలు తీసుకోకపోవడంతో కట్టలు తెంచుకున్న జనాగ్రహం  

అధికారులను నిలదీసిన వైఎస్సార్‌సీపీ నేతలు 

ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు.. 200 మంది నుంచి ఫిర్యాదుల స్వీకరణ   

వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు  

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎంపీ భరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలపై జనాగ్రహం కట్టలు తెంచుకుంది. దురాక్రమణకు తెగబడిన ప్రభుత్వం గీతం వర్సిటీ నుంచి భూములను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజలు విశాఖపట్నం కలెక్టరేట్‌కు భారీగా పోటెత్తారు. టీడీపీ ఎంపీ భరత్‌ దురాగతాలపై గళమెత్తారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో రాకముందే రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిలో లెవెలింగ్‌ పనులు చేపట్టిన వర్సిటీ యాజమాన్యంపై ధ్వజమెత్తారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ అండతోనే ఎంపీ భరత్‌ చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. తక్షణం భూములు వెనక్కి తీసుకోవాలని భారీగా గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు తీసుకొచ్చారు. దీంతో కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. ఏం చేయాలో పాలుపోని అధికారులు కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ మీనమేషాలు లెక్కించారు. పోలీసులు ప్రజలపై జులుం ప్రదర్శించేందుకు యత్నించారు. 

దీంతో అధికారుల తీరుకు నిరసనగా ప్రజలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. కలెక్టరేట్‌ ముందు వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి బైఠాయించారు. ఫలితంగా జన నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫిర్యాదులు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్‌సీపీ నేతలు అధికారులను నిలదీశారు. దీంతో దిగొచ్చిన అధికారులు ఎట్టకేలకు 200 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.  

భరత్‌పై ల్యాండ్‌ గ్రాబింగ్‌ కేసు నమోదు చేయాలి : కేకే రాజు 
ఈ సందర్భంగా  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌ అండతోనే విశాఖ టీడీపీ ఎంపీ భరత్‌ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో రాకముందే రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి లెవెలింగ్‌ పనులు చేపడుతున్న భరత్‌పై ల్యాండ్‌ గ్రాబింగ్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.  

గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖ జిల్లాలో జరిగిన భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుని సుమారు 2 వేల ఎకరాల భూమిని సంరక్షించిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా గీతం ఆక్రమించిన రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాలకు పైగా భూమిని అప్పట్లో స్వాధీనం చేసుకుని అందులో ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇంకా 14 ఎకరాలకుపైగా భూమిపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని కోర్టు స్టేటస్‌ కో ఇచ్చిందని వివరించారు. 

అయినప్పటికీ అధికారుల అండతో బోర్డులు పీకేసీ గీతం యాజమాన్యం లెవెలింగ్‌ పనులు చేపట్టడం ఏమిటని కేకే రాజు మండిపడ్డారు.  బోర్డులు తొలగించిన గీతం యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తప్పు తెలుసుకుని భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిన ఎంపీ.. తమ తాతల కాలం నుంచి ఆక్రమించామని, తమకు ఇచ్చేయాలని మీడియా ముందే నిస్సిగ్గుగా చెప్పడం గర్హనీయమన్నారు. 

గీతం భూకబ్జాపై కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు ప్రజలు భారీగా తరలివస్తే అధికారులు ఫిర్యాదులను స్వీకరించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసుజులుం ద్వారా తమ పోరాటాన్ని అణిచివేయాలని యత్నిస్తున్నారని కేకే రాజు మండిపడ్డారు. గీతం భూకబ్జాపై ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. గీతం యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు టీడీపీ కూటమి నాయకులకు బానిసలు కాదని ఆయన ధ్వజమెత్తారు. 

భూములను పరిరక్షించాలి : వాసుపల్లి గణేశ్‌
మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ మాట్లాడుతూ... టీడీపీ నాయకుల అవినీతి కేంద్రానికి మాయని మచ్చగా మిగులుతుందని హెచ్చరించారు. తక్షణం ఎంపీ భరత్‌ను జైల్లో పెట్టి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవాన్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement