మిర్చి రైతుకు నష్టాల ఘాటు | Chilli prices drop in Andhra pradesh | Sakshi
Sakshi News home page

మిర్చి రైతుకు నష్టాల ఘాటు

Mar 10 2026 4:57 AM | Updated on Mar 10 2026 4:57 AM

Chilli prices drop in Andhra pradesh

తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు 

వ్యాపారుల కుమ్మక్కుతో పతనమవుతున్న ధరలు

నెల కిందట రూ.26 వేల వరకూ క్వింటా ధర

ప్రస్తుతం రూ.18 వేలకు పడిపోయిన వైనం 

ఎకరాకు  రూ.1.5 లక్షల వరకు నష్టం 

రైతులను ఆదుకునే దిశగా స్పందించని చంద్రబాబు సర్కార్‌  

సాక్షి ప్రతినిధి, గుంటూరు/కొరిటెపాడు (గుంటూరువెస్ట్‌): తెగుళ్లతో దిగుబడులు పడిపోవడం, వ్యాపారుల కుమ్మక్కుతో మార్కెట్‌లో ధరలు కుప్పకూలడంతో మిర్చి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. నెల కిందట గుంటూరు మిర్చి యార్డులో క్వింటాకు రూ.26 వేల వరకు పలికిన ధర ప్రస్తుతం రూ.13 వేల నుంచి రూ.18 వేలకు పడిపోయింది. అంటే కేవలం నెల వ్యవధిలో రూ.8 వేల వరకూ పతనమైంది. దీంతో ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉన్న మిర్చి అమ్మకాల సమయంలో తొలుత భారీగా పలికిన ధర, కొత్తపంట మార్కెట్‌కు వస్తున్న సమయంలో పడిపోవడానికి వ్యాపారుల సిండికేట్‌ కారణమని రైతులు చెబుతున్నారు. సిండికేట్‌ను నిలువరించి మంచి ధర ఇప్పించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్షీణిస్తున్న సాగు గణాంకాలు
గత మూడు ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి సాగు గణనీయంగా తగ్గిపోయింది. రాష్ట్రంలో 2022–23  సంవత్సరంలో 2,27,757 హెక్టార్లలో మిర్చి పంట సాగయ్యింది. 2023–24లో 2,46,752 హెక్టార్లకు సాగు పెరిగినా,  2024–25లో తిరిగి 1,96,153 హెక్టార్లకు తగ్గింది. ఇక 2025–26లో ఏకంగా 1,08,223 హెక్టార్లకు పడిపోయింది. గత ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి పంటకు ధరలు లేక పోవడం 2025–26 సీజన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. గత మిర్చి సీజన్‌లో  ఎన్నడూ లేని విధంగా క్వింటా ధర రూ.9 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే పలికిన సంగతి తెలిసిందే.  

ఎకరాకు రూ.రెండు లక్షలకు పైగా ఖర్చు..
ఎకరా మిర్చి సాగుకు సుమారు రూ.2 లక్షలకు పైగా ఖర్చవుతోంది. సేద్యపు ఖర్చు­లు, పురుగుమందులు, కోత కూలీలు, బా­డుగ, కలిపి ఎకరాకు వ్యయాలు భారీగా పెరిగిపోయాయని రైతులు చెబుతున్నారు. దీనికి పొలం కౌలు అదనంగా కలుపుకోవాల్సి ఉంటుంది. కాగా నల్లతామర, కుచ్చుముడత (వైరస్‌) తెగుళ్ల సమస్య నెలకొంది. దీంతో పూతంతా నేలరాలిపోతుంది. ఒకవేళ అరకొర పూత మిగిలినా కాయ సైజు మజ్జుగా మారిపోతుంది. ఈ కారణంగా దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన పైరు ఉంటేనే ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. అయితే నల్లతామర సోకి ఎకరాకు 5 నుంచి 20 క్వింటాళ్లకు దిగుబడులు పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది.  

ఎకరాకు రూ. లక్షకు పైగా నష్టం వచ్చింది 
ఈ ఏడాది 1.5 ఎకరాల్లో సూపర్‌–10 రకం మిర్చి వే­శా. గత నెలలో ఎర్రనల్లి, ఇప్పుడు నల్లతామర సో­కింది. వారా­నికి సుమా­రు రూ.10 వేలు తెగుళ్ల నివారణకు ఖర్చుపెడుతున్నా. అయి­నా అదుపులోకి రాలేదు. ఒక కోత వచ్చింది. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.  క్వింటాకు రూ.18 వేలు ధర పడింది. ఎకరాకు రూ. లక్షకుపైగా నష్టపోవాల్సి వస్తోంది.  – పి.దేవేంద్ర, కనకవీడు గ్రామం రైతు (కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం) 

వ్యాపారులు కుమ్మక్కవుతున్నారు  
నేను 341 రకం మిర్చి 2 ఎకరాల్లో సాగు చేశా. ఎకరాకు కౌలుతో కలుపుకొని రూ.2 లక్షల వరకు ఖర్చు వచ్చింది. 25 రోజుల కిందట 341 రకం మిర్చి క్వింటా రూ.25 వేలు వరకు ధర పలికింది. ప్రస్తుతం 30 బస్తాలు యార్డుకు తెచ్చాను. క్వింటా రూ.17 వేలు అడుగుతున్నారు. ఇదేమని అడుగుతుంటే ధరలు తగ్గాయని, మీకు ఇష్టం ఉన్న చోటికి తీసుకువెళ్లి అమ్ముకోవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు. చేసేది లేక రూ.17 వేలకే అమ్ముకున్నా. – దుగ్గెంపూడి పాపిరెడ్డి, అగ్రహారం గ్రామ రైతు (మార్కాపురం జిల్లా, దోర్నాల మండలం) 

లాభం పరిస్థితే లేదు 
మూడు ఎకరాల్లో సార్క్‌ రకం మిర్చి పంట సాగు చేశా. ఎకరాకు రూ.2.50 లక్షల వరకూ ఖర్చు చేశా. దిగుబడి ఎకరాకు 15 క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. గుంటూరు మార్కెట్‌ యార్డుకు ప్రస్తుతం 35 బస్తాలు తీసుకువచ్చాను. క్వింటా రూ.17,300 పడింది. క్వింటాళ్లకు రూ.20 వేలకు పైగా పలికితే గిట్టుబాటు అవుతుంది. ఈ ధరలతో మిర్చి రైతులకు అప్పులు తప్ప, లాభం మిగిలే పరిస్థితి లేదు. – పి.శ్రీనివాసరావు, ఉయ్యందన గ్రామ రైతు (పల్నాడు జిల్లా, క్రోసూరు మండలం) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement