మాకు ఇతరుల ఆస్తుల మీద ఎలాంటి ఆపేక్ష లేదు
వందేళ్ల కిందట నుంచి మేం ఏ ఇంట్లో ఉన్నామో ఈ రోజు కూడా అదే ఇంట్లో ఉన్నాం
చంద్రబాబు ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం తగదు
అర్జీదారుడికి న్యాయం చేయాలనే సదుద్దేశం ఉంటే నిజనిర్ధారణ చేయమనండి
సభలో ఆర్డీవో సరైన సమాధానం ఇచ్చినా ముఖ్యమంత్రి బుల్డోజ్ చేశారు
సీఎం చంద్రబాబు ఆరోపణలపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి రెవెన్యూ వ్యవహారాలపై అవగాహన ఇంతేనా అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నిం చారు. సోమవారం డోన్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలకు బుగ్గన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సభలో ఒక అర్జీదారుడు రెండేళ్లుగా పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని చెప్పిన విషయాన్ని సీఎం రాజకీయంగా మలచడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. అది ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న వ్యక్తిగత సమస్య కావడంతో అధికారులు దానిని పరిష్కరించలేకపోయారని తెలిపారు. నిజంగా అర్జీదారుకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే సంబంధిత విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించి నిజ నిర్ధారణ చేయాలని సూచించాలని పేర్కొన్నారు.
ప్రతి విషయాన్ని రాజకీయంగా మార్చడం ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి తగదని వ్యాఖ్యానించారు. తమ కుటుంబానికి, తమ అనుచరులకు ఇతరుల ఆస్తులపై ఎలాంటి ఆశలూ, ఆపేక్ష లేవని స్పష్టం చేశారు. వందేళ్ల క్రితం నుంచి తమ కుటుంబం ఏ ఇంట్లో నివసిస్తుందో ఈ రోజుకీ అదే ఇంట్లో ఉంటున్నామని చెప్పారు. తమ కుటుంబం వద్ద ఉన్న ఆస్తుల్లో 75 శాతం దానం చేసిన చరిత్ర ఉందని బుగ్గన పేర్కొన్నారు. తాము దానం చేసిన ఆస్తులను చూడాలంటే ఒక రోజు సమయం పడుతుందని, సమయం చూసుకుని వస్తే వ్యక్తిగతంగా చూపిస్తానని చెప్పారు.
సభలో ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్డీవో ఆ భూమి అసైన్డ్ అని, అర్జీదారుడికి సంబంధం లేదని చెప్పినప్పటికీ ఆ విషయాన్ని బుల్డోజ్ చేసి సీఎం ఆరోపణలు గుప్పించారని విమర్శించారు. ఇది తిరుమల లడ్డూ వ్యవహారంలా ఉందని పేర్కొంటూ, అప్పట్లో ఈవో శ్యామలరావు వాస్తవాలు చెప్పినా వాటిని పట్టించుకోలేదని అన్నారు. అనంతరం సీబీఐ సిట్ కూడా శ్యామలరావు చెప్పినదే నిజమని తేలి్చందని గుర్తుచేశారు. వయస్సు, పదవికి తగిన విధంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడికి బుగ్గన రాజేంద్రనాథ్ సూచించారు. అవాస్తవమైన, అన్యాయమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.


