రైతన్నపై రుణపాశం! | Andhra Pradesh Ranks Second In Farm Loan Dues, Farmers Struggle Amid Rising Debt, More Details Inside | Sakshi
Sakshi News home page

రైతన్నపై రుణపాశం!

Mar 10 2026 5:00 AM | Updated on Mar 10 2026 8:57 AM

AP ranks second in the country in agricultural loan arrears

వ్యవసాయ రుణ బకాయిల్లో దేశంలో రెండో స్థానంలో ఏపీ

ఏపీ రైతులపై రూ.3.75 లక్షల కోట్ల రుణ భారం

రూ.2 లక్షల కోట్లు దాటిన పంట రుణాలు

పార్లమెంట్‌కు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కకపోవడం.. ఏ దశలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవ­డంతో మోస­పోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకు­పోతు­న్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణ  బకాయిల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో ఉండ­టం రాష్ట్రంలో సాగు రంగం దుస్థితి, రైత­న్నల కడ­గండ్లకు నిదర్శనంగా నిలుస్తోంది. పెట్టు­బడి సాయం అందకపోవడం.. ఎరువుల కోసం నరకయాతన.. ఉచిత పంటల బీమా అటకెక్కడం.. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగిరిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 20 నెల­లుగా పెద్ద ఎత్తున రైతుల బలవన్మరణాలు కలవ­రపరు­స్తున్నాయి. పార్లమెంట్‌ సాక్షిగా ఇదే విష­యం మరోసారి స్పష్టమైంది. దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిల్లో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సోమవారం లోక్‌సభకు వెల్లడించారు. 

55 శాతం రైతు కుటుంబాలకు రుణ సదుపాయం
గతేడాది డిసెంబర్‌ నాటికి ఆంధ్రప్రదేశ్‌ రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.3,75,254.59 కోట్లు కాగా ఇందులో పంట రుణ బకాయిలు రూ.2,01,744.41 కోట్లు, వ్యవసాయ టర్మ్‌ రుణాలు రూ.1,73,510.18 కోట్లుగా ఉన్నాయి. గత డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.31,34,807.42 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఇందులో పంట రుణ బకాయిలు రూ.16,34,219.07 కోట్లు, వ్యవసాయ టర్మ్‌ రుణాలు రూ.15,00,588.35 కోట్లు ఉన్నాయి. నేషనల్‌ రూరల్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ సర్వే నివేదిక ప్రకారం దేశంలో 55 శాతం వ్యవసాయ కుటుంబాలు క్రెడిట్‌ సౌకర్యాన్ని పొందుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 

బ్యాంకులకు ప్రాధాన్యతా రంగ రుణ లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్, పీఎం కిసాన్, పీఎం ఫసల్‌ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన లాంటి పథకాలతో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పంకజ్‌ చౌదరి చెప్పారు. ఇక తెలంగాణలో వ్యవసాయ రుణ బకాయిలు మొత్తం రూ.1,75,960.56 కోట్లుగా ఉన్నాయి. ఇందులో పంట రుణాలు రూ. 95,167.98 కోట్లు, టర్మ్‌ రుణాలు రూ. 80,792.58 కోట్లుగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కాగా రూ.5,06,290.45 కోట్ల వ్యవసాయ రుణ బకాయిలతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది.

అన్నదాతల నోట్లో మట్టి..
చంద్రబాబు పాలనలో గత 20 నెలల్లో రాష్ట్రంలో రైతన్నలు అన్ని విధాలుగా మోసపోయారు. తామ అధికారంలోకి వస్తే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన హామీని తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.30 వేలు ఎగ్గొట్టి రూ.10 వేలతో సరిపెట్టారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉండగా 6,72,428 మందికి పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.21,433.46 కోట్లు పెట్టుబడి సాయంగా అందించాల్సి ఉండగా కేవలం రూ.4,685.84 కోట్లు విదిల్చారు. రైతులకు మొత్తం రూ.16,748 కోట్లు సాయాన్ని ఎగ్గొట్టారు.

ఉచిత పంటల బీమాను అటకెక్కించి.. ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎగ్గొట్టి
చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టికొట్టారు. 2023–24 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు 2024 జూన్‌లో జమ చేయాల్సి ఉండగా, అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా రూ.1,324 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలొడ్డారు. 

2024 ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.834.44 కోట్లతో పాటు రబీ 2024–25, ఖరీఫ్‌–2025 సీజన్‌లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.260.67 కోట్లు ఎగ్గొట్టడంతో రబీ 2025–26 సీజన్‌లో ఏపీని కంపెనీలు బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేశాయి. ఇలా రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం రైతులకు అందకుండా చంద్రబాబు సర్కారు దగా చేసింది. మరోవైపు దాదాపు 12 లక్షల మందికి రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీ సొమ్మును ఎగ్గొట్టారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దాదాపు ఆరున్నర లక్షల మందికి రూ.వెయ్యి కోట్లకు పైగా పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.

దక్కని ‘మద్దతు’... ఆత్మహత్యలు..
మద్దతు ధర దక్కని సమయంలో మార్కెట్‌లో జోక్యం చేసుకొని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ఎత్తేశారు. ధాన్యం మొదలు పత్తి, మిరప, ఉల్లి, చీనీ, పొగాకు, టమాటా, పసుపు, పెసర, మినుము, కంది.. ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక అల్లాడుతున్నా ఆదుకున్న దాఖలాలు లేవు. రైతులకు పైసా సాయం చేసిన పాపాన పోలేదు. 

పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు వరుస వైపరీత్యాలతో సాగు, దిగుబడులు తగ్గిపోయి భారీగా నష్టం వాటిల్లింది. గత 20 నెలల్లో దిగుబడులు తగ్గిపోవడం, మద్దతు ధర కోల్పోయి దాదాపు రూ.35 వేల కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. మరోవైపు రైతు ఆత్మహత్యలు కలవరపరుస్తున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది దాదాపు 150 మందికి పైగా చనిపోగా 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు ఒడిగట్టినట్లు రాష్ట్ర పోలీస్‌ శాఖే అధికారికంగా వెల్లడించడం రాష్ట్రంలో రైతన్నల దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement