సీఐ అలీ చనిపోవడానికి సచివాలయ ఉద్యోగులు కారణమంటూ అక్రమ కేసు పెట్టడమేంటి?
సీఐ అలీ తోపులాటలో కింద పడినట్టు తప్పుడు ఫిర్యాదు చేయడమేంటి?
మీ దగ్గరున్న వీడియోలలో అలీ కిందపడినట్లు ఉందా?
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ధ్వజం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వ వేధింపులు పరాకాష్టకు చేరాయని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేని సర్కారు శాంతియుత పోరాటం చేపడితే అక్రమ కేసులతో వేధిస్తోందని విమర్శించారు. ఇలా వేధిస్తూ నిత్య నరకం చూపేకంటే ఒక్కసారే ఉద్యోగులను ఎన్‌కౌంటర్ చేయండంటూ చంద్రబాబు సర్కారుపై ధ్వజమెత్తారు.
టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై పనిభారం తీవ్రంగా పెరిగిందని, వందలాది మంది ఉద్యోగులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధలు తాళలేకే సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారని వివరించారు. ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన సర్కారు అక్రమ కేసులతో కక్షసాధించడం తగదని పేర్కొన్నారు. సీఐ అలీ మరణానికి సచివాలయ ఉద్యోగులు కారణమంటూ అక్రమ కేసు నమోదు చేయడం దారుణమని, దీనికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీని కాకర్ల చూపించారు.
సీఐ అలీ ఉద్యోగుల తోపులాటతో కింద పడ్డారని తప్పుడు ఫిర్యాదుచేశారని, సర్కారు వద్ద ఉన్న వీడియోల్లో అయినా అలీ కిందపడినట్టు ఉందా? అని ప్రశ్నించారు. సీఐ గుండెపోటుతో మరణించారని తొలుత ప్రకటించిన సర్కారు.. ఇప్పుడు ఆ నెపం సచివాలయ ఉద్యోగులపై నెట్టడం ఏమిటని నిలదీశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న ఉద్యోగులపై లాఠీచార్జి చేయడమే కాకుండా వారిపై అక్రమ కేసులు కట్టడం దారుణమని కాకర్ల విమర్శించారు.
తోటి ఉద్యోగులపై కక్ష సాధిస్తుంటే ఏం చేస్తున్నారు?
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై జరిగిన లాఠీచార్జిపై ఎందుకు నోరు మెదపటం లేదని ఉద్యోగ సంఘాల నేతలను కాకర్ల ప్రశ్నించారు. తోటి ఉద్యోగులపై అక్రమ కేసులు పెడితే స్పందించని నాయకత్వం ఎందుకని నిలదీశారు. న్యాయమైన డిమాండ్లతో ఆందోళన చేస్తున్న ఉద్యోగులను బ్లేడ్, గంజాయి బ్యాచ్ అంటూ వ్యాఖ్యానించిన ఎల్లో మీడియా కరోనా వైరస్ కంటే నీచమైందని మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో టీచర్లు ధర్నా చేస్తూ అప్పటి సీఎం వైఎస్ జగన్‌ని బహిరంగంగా విమర్శించినా ఎలాంటి కేసులూ నమోదు చేయలేదని గుర్తుచేశారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై వేధింపులు తక్షణమే ఆపాలని, అక్రమ కేసులు, సస్పెన్షన్లను ఉపసంహరించుకోవాలని కాకర్ల వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.


