విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీగా పాల్గొన్న గురుకుల ఉపాధ్యాయులు
పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ నినాదాలు
విజయవాడలో అంబేడ్కర్ గురుకుల ఉద్యోగుల మహాధర్నా
సాక్షి,అమరావతి/ గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించా లని అంబేడ్కర్ గురుకులాల పార్ట్ టైం ఉద్యోగులు గళమెత్తారు. విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం మహా ధర్నా చేపట్టారు. ధర్నాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ..విద్యాలయాలు, కళాశాలల్లో పనిచేస్తోన్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1,800 మంది పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఏళ్ల తరబడి సేవలందిస్తున్నప్పటికీ, వారి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వేతనాలు సకాలంలో అందకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ..పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార విభాగం, సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో గురుకుల పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా చంద్రం, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ మంజుల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల పార్ట్‌టైమ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బొల్లిపోగు ఇస్మాయిల్, కార్యదర్శి కె.వర్మ పాల్గొన్నారు.


