సాక్షి, తాడేపల్లి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వ వేధింపులు పరాకాష్ఠకు చేరాయని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యోగులపై చంద్రబాబు సర్కారు అక్రమ కేసులు పెట్టించిందని ఆరోపించారు. ఉద్యోగులను లాఠీలతో కొట్టిందేకాక మళ్ళీ అక్రమ కేసులు పెడతారా?, సెలవు రోజు వచ్చి ధర్నా చేసినా తప్పేనా? అని ప్రశ్నించారు. పోలీసుల లాఠీచార్జిపై ఉద్యోగ సంఘాలు మౌనం వహించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
''సీఐ అలీ చనిపోవడానికి కారణం సచివాలయ ఉద్యోగులేనని మరో కేసు పెట్టారు. సీఐ అలీ తోపులాటలో కింద పడినట్టు తప్పుడు ఫిర్యాదు చేశారు. మీ దగ్గరున్న వీడియోలలో ఎక్కడైనా అలీ కింద పడినట్టు ఉందా? ఉద్యోగులను ఇంతగా వేధించేకంటే ఒక్కసారే ఎన్‌కౌంటర్ చేయండి. అప్పుడైనా ప్రభుత్వ కక్ష తీర్చుకోండి. ఉద్యోగ సంఘాల నేతలు ఈ లాఠీఛార్జిపై ఎందుకు నోరు మెదపటం లేదు? తోటి ఉద్యోగులపై అక్రమ కేసులు పెడితే స్పందించని నాయకత్వం ఎందుక''ని ప్రశ్నించారు.
కరోనా కంటే నీచమైన వైరెస్ ఎల్లోమీడియా
''ధర్నా చేసిన ఉద్యోగులను బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటూ ఒక ఛానల్ లో మాట్లాడారు. ఆ మాట్లాడిన యాంకర్ గంజాయి తాగి మాట్లాడుతున్నాడు. కరోనా కంటే నీచమైన వైరెస్ ఎల్లోమీడియా. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి ఎల్లోమీడియా పని చేస్తోంది. ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. ఆ నగదు ఏ ఉద్యోగికి ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలి. సమాచార హక్కు కింద అడిగితే ఎవరికీ ఇవ్వలేదని ఆర్ధిక శాఖ చెప్పింది. మరి చంద్రబాబు సీఎం హోదాలో పచ్చి అబద్దాలు చెప్పడం ఎందుక''ని కాకర్ల నిలదీశారు.
ఇదీ చదవండి: చంద్రబాబు సర్కారుపై ఉద్యోగుల తిరుగుబాటు
చంద్రబాబు మాట వింటే నష్టపోయేది టీచర్లే
''గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ధైర్యం గా పోరాటం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా న్యాయపోరాటం చేద్దాం. ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం చేద్దాం. ఎంత అణిచివేయాలని చూస్తే అంతగా ఎదుగుతాం. టీచర్లతో రాజకీయం చేయటం చంద్రబాబుకు అలవాటు. కర్నూలు, విజయవాడ, విశాఖలో వారితో ధర్నా చేయించారు. చంద్రబాబు మాటలు విని రాజకీయాలు చేస్తే నష్టపోయేది టీచర్లేన''ని కాకర్ల వెంకటరామిరెడ్డి అన్నారు.


