సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని పులివెందుల బస్టాండ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. పర్యాటకులకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ బస్టాండ్‌గా అవార్డు దక్కింది. రాజమండ్రిలో నిర్వహించిన పర్యాటక అవార్డుల కార్యక్రమంలో పులివెందుల బస్ టెర్మినల్‌కు ఈ పురస్కారాన్ని అందజేశారు.
స్టేట్ ఆఫ్ ఆర్ట్ సదుపాయాలతో ఆదర్శవంతమైన బస్టాండ్‌గా దీన్ని నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు, భద్రత, మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకుని టెర్మినల్‌ను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. పర్యాటకుల రాకపోకలకు అనువుగా ఉండటంతో పాటు.. ఆధునిక సదుపాయాలు ఉండటం ఈ గుర్తింపుకు కారణమని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో.. ఆయన సీఎంగా ఉన్నప్పుడే దీనిని నిర్మించడం గమనార్హం.
జగన్ హయాంలోనే నిర్మాణం
పులివెందుల బస్ టెర్మినల్‌ను రూ.38 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2022 డిసెంబర్ 24న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీనిని ప్రజలకు అంకితం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్‌గా దీనిని నిర్మించారు. బస్టాండ్‌లో ఒకేసారి 225 మంది కూర్చునేలా సీటింగ్ సదుపాయం కల్పించారు. మొత్తం 95 బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 13 మరుగుదొడ్లు నిర్మించారు. వికలాంగులు కూడా సులభంగా రాకపోకలు సాగించేలా సదుపాయాలు కల్పించారు.
55 సీసీ కెమెరాలతో నిఘా
ప్రయాణికుల భద్రతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. బస్టాండ్ పరిసరాల్లో 55 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 24 గంటల పాటు నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణంతో పాటు భద్రత కల్పించేలా టెర్మినల్‌ను రూపొందించారు. పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమంలో పులివెందుల బస్టాండ్‌కు అవార్డు రావడంతో స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక వసతులతో నిర్మించిన ఈ టెర్మినల్‌కు లభించిన గుర్తింపు పులివెందుల ప్రత్యేకతను మరోసారి చాటిందని పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: కాకుమాను కుటుంబానికి పరామర్శ.. ఒంగోలుకు వైఎస్ జగన్


