ఐఆర్టీఎస్‌ అధికారిగా చంబల్‌ బందిపోటు మనవడు..! | Grandson of Chambal Dacoit Quit High-Paying Netherlands Job to Crack UPSC | Sakshi
Sakshi News home page

ఐఆర్టీఎస్‌ అధికారిగా చంబల్‌ బందిపోటు మనవడు..!

Sep 28 2026 1:34 PM | Updated on Sep 28 2026 1:34 PM

Grandson of Chambal Dacoit Quit High-Paying Netherlands Job to Crack UPSC

మన నేపథ్యం ఎలాంటిదైనా..చక్కటి జీవితాన్ని నిర్మించుకోవచ్చు అని చెప్పే కథ ఇది. తన మూలాలు ఎలాంటివైన తన సక్సెస్‌తో యావత్తు ప్రపంచాన్ని తనవైపుకి తిరిగి చూసేలా చేశాడు. యువతకు ఆదర్శంగా నిలిచాడు. 

అతడే దేవ్‌ ప్రభాకర్‌ సింగ్‌ తోమర్‌. మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్‌కు చెందిన వ్యక్తి. ఆయన తాత ఒకప్పుడు చంబల్‌లో బందిపోటు. చంబల్ లోయలు ఒకప్పుడు సాయుధ బందిపోట్లకు నిలయంగా ఉండేవి. అయితే ప్రస్తుతం వాళ్లంతా లొంగిపోయి శిక్షలు అనుభవించి..గ్రామపెద్దలుగా ప్రశాంత జీవితం గడుపుతున్నారు. మరి దేవ్‌ ప్రభాకర్‌ సింగ్‌ ఆ నేఫథ్యాన్ని ఎలా అధిగమించగలిగాడంటే అందుకు ఆయన తండ్రే కారణం. ఆయన తండ్రి దేవ్‌ తాతగారి ఇష్టానికి వ్యతిరేకంగా గాల్వియర్‌కి వచ్చేసి చదువుపై ఫోకస్‌ పెట్టి ప్రిన్సిపాల్‌ అయ్యారు.

అలా దేవ్‌ ప్రభాకర్‌పై ఆ ప్రభావం పడకుండా ఉజ్వల భవిష్యత్తుని ఏర్పరచుకునేందుకు దోహదపడింది. ఇక్కడ కేవలం వారసత్వ నేపథ్యం అడ్డంకి మాత్రమే కాదు..ఆ తర్వాత చదువులో ఎదురైనా ప్రతి అడ్డంకిని ఓర్పుతో అధిగమిస్తూ ముందుకు సాగడం విశేషం. ఆరో తరగతిలో సీబీఎస్‌ఈ పాఠశాలకు మారడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత ఎలాంటి కోచింగ్‌లు తీసుకోకుండా ఐఐటీ ప్రవేశం పొంది, కెరీర్‌ని ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నాడు. 

అక్కడితో తన విజయ ప్రస్థానం ఆగిపోలేదు. తన సొంత ప్రతిభతోనే ఫిలిప్స్‌లో ఉద్యోగం సంపాదించి, చివరికి ఆమ్‌స్టర్‌డామ్ సమీపంలోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే స్థాయికి చేరాడు. అయితే ఆ విలాసవంతమైన జీవితం వద్దని స్వదేశానికి వచ్చి యూపీఎస్సీకి సన్నద్ధమయ్యాడు. కానీ ఆ కఠిన పరీక్షలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఓటమిని చవిచూసి.. నాల్గోప్రయత్నంలో విజయం అందుకున్నాడు. 

అలా 2023లో 'ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్' (IRTS) అధికారిగా నియామకం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన  రైల్వే మంత్రిత్వ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. పుట్టుక మన చేతుల్లో ఉండకపోయినా..జీవితాన్ని అందంగా మలుచుకోవడం మన చేతల్లోనే ఉందనే విషయం దేవ్‌ ప్రభాకర్‌ సింగ్‌ తన సక్సెస్‌తో చాటిచెప్పాడు.

ఇదీ చదవండి: "సెక్యూరిటీ గార్డు నుంచి పరాటా కింగ్‌ వరకు")

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement