సాగర్: మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. 28 ఏళ్ల అంకిత్ పటేల్ అనే వ్యక్తిపై ఓ వ్యక్తి ఇనుప రాడ్‌తో భీకరంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దాడి సుమారు 16 సెకన్లపాటు జరిగినట్లు, ఈ సమయంలో అంకిత్ తలపై 14 సార్లు ఇనుప రాడ్‌తో కొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది.
సెప్టెంబర్ 27న మధ్యాహ్నం 3 గంటల సమయంలో సాగర్‌లోని ప్యారడైజ్ హోటల్ ముందు ఈ ఘటన జరిగింది. అంకిత్ పటేల్‌కు, నిందితుడికి మధ్య ఏదో విషయంపై వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మాటామాటా పెరగడంతో నిందితుడు ఇనుప పైపును తీసుకుని అంకిత్‌పై దాడికి దిగాడు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. నిందితుడు అంకిత్‌పై ఆగకుండా దాడి చేశాడు. ఈ దాడిలో అతడు స్పృహ కోల్పోయినట్లు సమాచారం. దాడి సుమారు 16 సెకన్లపాటు కొనసాగగా.. అంకిత్ తలపై 14 సార్లు దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. అనంతరం అంకిత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
భయంతో పరుగులు తీసిన జనం
దాడి తీవ్రత పెరగడంతో అక్కడి దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. కొందరు తమ దుకాణాలను మూసివేసి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. తొలుత ఘటనను చూసేందుకు అక్కడ గుమిగూడిన పలువురు కూడా పరిస్థితి తీవ్రంగా మారడంతో పరుగులు తీశారు.
దాడి కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి నిందితుడిని పట్టుకుని అంకిత్ నుంచి దూరంగా నెట్టాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మరో వ్యక్తితో కలిసి అతడు అక్కడి నుంచి పరారైనట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది.
⚠️ Disturbing visuals ahead. Viewer discretion is advised. A young man named Ankit Patel was reportedly beaten to death in Sagar, Madhya Pradesh. https://t.co/GWcxHPMyhf
— Reform India (@ReformMov_India) September 27, 2026
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ దాడికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. నిందితుడి పూర్తి వివరాలు కూడా అధికారికంగా వెల్లడికాలేదు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
ఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. 56 మంది మృతి!


