జైపూర్ : రష్యాకు చెందిన వెరా ప్రొకోఫెవా తొలిసారి రాజస్థాన్‌లోని జైపూర్ మెట్రోలో ప్రయాణించి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెట్రో స్టేషన్ పరిశుభ్రత, నిర్వహణపై ప్రశంసలు కురిపించిన ఆమె.. జైపూర్ మెట్రోకు ఏకంగా ‘10/10’ రేటింగ్ ఇచ్చారు. అంతేకాదు, స్టేషన్‌ను దుబాయ్ మెట్రోతో పోల్చడం వైరల్‌గా మారింది. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోని @vera__india ఖాతాలో షేర్ చేశారు. మెట్రో స్టేషన్‌లో సిబ్బందితో మాట్లాడిన అనంతరం ప్లాట్‌ఫామ్‌కు వెళ్లిన ఆమె.. అక్కడి వాతావరణాన్ని పరిశీలిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
‘టెన్ అవుట్ ఆఫ్ టెన్’ అంటూ ప్రశంసలు
ప్లాట్‌ఫామ్‌ను చూసిన వెరా.. ‘వెరీ గుడ్.. నైస్ ప్లాట్‌ఫామ్.. టెన్ అవుట్ ఆఫ్ టెన్’ అంటూ ప్రశంసించారు. అనంతరం స్టేషన్‌లోని వివిధ ప్రాంతాలను వీడియోలో చిత్రీకరించారు. పరిశుభ్రత, స్టేషన్ రూపురేఖలు తనను ఆకట్టుకున్నట్లు ఆమె వీడియోలో పేర్కొన్నారు. హవా మహల్ సమీపంలోని మెట్రో స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కూడా వెరా తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ‘స్టిల్ 10/10’ అంటూ మరోసారి రేటింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ‘ఇది దుబాయ్ మెట్రోలా అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.
వెరా షేర్ చేసిన వీడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. పలువురు జైపూర్ వాసులు తమ నగరంలోని మెట్రో వ్యవస్థపై ఆనందం వ్యక్తం చేశారు. మరికొందరు జైపూర్ మెట్రోను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని సూచించారు. ఒక జైపూర్ వాసి.. నగరంలోని అమెర్ ఫోర్ట్, జల్ మహల్ వంటి చారిత్రక పర్యాటక ప్రాంతాలను కూడా మెట్రో మార్గంతో అనుసంధానిస్తే బయట ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు మరింత సౌకర్యంగా ఉంటుందని సూచించారు. వెరా వీడియోపై స్పందించిన కొందరు నెటిజన్లు ఆమె ఢిల్లీ మెట్రో, ర్యాపిడ్ రైల్‌లోనూ ప్రయాణించాలని సూచించారు.
ఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. 56 మంది మృతి!


