ఇంద్రవెల్లికి అందం | Adilabad women Preeti Munde won Miss Earth Water India 2026 | Sakshi
Sakshi News home page

ఇంద్రవెల్లికి అందం

Sep 26 2026 5:07 AM | Updated on Sep 26 2026 5:07 AM

Adilabad women Preeti Munde won Miss Earth Water India 2026

మిస్‌ ఎర్త్‌

ఇంద్రవెల్లి... ఈ పేరు వినగానే పోరుగడ్డ అని మదిలో మెదులుతుంది.. పోరాట యోధులు గుర్తుకొస్తారు... అలాంటి ఈ గడ్డ నుంచి ఓ అందాల పిల్ల ఇప్పుడు ప్రపంచానికే ఈ పేరును పరిచయం చేసేలా ముందుకు వెళుతోంది.. ఆమె ప్రీతి ముండే. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గురువారం జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీల్లో తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌ గ్రామానికి చెందిన ప్రీతి ముండే మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియా 2026 విభాగంలో విజేతగా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. పోటీలో ఆమె చూపిన స్నేహపూరక స్వభావానికి గాను మిస్‌ కంజీనియాలిటీ 2026 ఉప–శీర్షికను కూడా సొంతం చేసుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో జరగబోయే మిస్‌ ఎర్త్‌ అంతర్జాతీయ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు...

ఎవరీ ప్రీతి? 
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో బట్టల దుకాణం నిర్వహణతోపాటు వ్యవసాయం చేసే సామాన్య  కుటుంబానికి చెందిన ముండే ప్రహ్లాద్‌– ఉమా దంపతుల పెద్ద కూతురు ప్రీతి. 2001 మార్చి18న పుట్టింది.. ఐదు తరాలకు ముందు రాజస్థా¯Œ  నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చిన కుటుంబం. ఈమెకు తమ్ముడు ఓమ్, సోదరి సంతోషి ఉన్నారు. పదవ తరగతి వరకు ఇంద్రవెల్లికి సమీపంలో ఉండే ఉట్నూర్‌లోని లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్లో చదువుకుంది.. ఇంటర్మీడియట్‌  హైదరాబాద్‌లో చదివింది.. ఆ తర్వాత సరోజినీ నాయుడు యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. 

ఏమిటి ఈ మిస్‌ ఎర్త్‌ పోటీ..?
మిస్‌ ఎర్త్‌... పర్యావరణ పరిరక్షణ, సామాజిక స్పృహ ప్రధాన ధ్యేయంగా నిర్వహించే అంతర్జాతీయ సౌందర్య పోటీ. ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద అంతర్జాతీయ అందాల పోటీల్లో ఒకటి.. ఈ పోటీలను 2001లో ఫిలిప్పీన్స్‌కు చెందిన ‘కరోసెల్‌ ప్రొడక్షన్స్’ సంస్థ ప్రారంభించింది.. బాహ్యసౌందర్యానికే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, వృక్షజాలం–జంతుజాల పరిరక్షణ, పర్యావరణ సమస్యలపై అవగాహన కల్పించే అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు.. విజేతలు ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం’ (యూఎన్ ఈపీ) వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పర్యావరణ పరిరక్షణ ప్రచారకర్తలుగా, అంబాసిడర్లుగా సేవలందిస్తారు. దీనికి సంబంధించి జాతీయస్థాయిలోనూ పోటీలు నిర్వహిస్తారు.

కిరీటాల ప్రాముఖ్యత ...
మిస్‌ ఎర్త్‌ పోటీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో నలుగురు ప్రధాన విజేతలను ఎన్నుకుంటారు. ప్రకృతిలోని నాలుగు మూలకాలను ప్రతిబిబించేలా ఈ కిరీటాలను అందజేస్తారు. మిస్‌ ఎర్త్‌.. ప్రధాన విజేత (పర్యావరణానికి ప్రతిరూపం), మిస్‌ ఎర్త్‌ ఎయిర్‌.. మొదటి రన్నరప్‌ (గాలి నైర్మల్యానికి సంకేతం), మిస్‌ ఎర్త్‌ వాటర్‌.. రెండవ రన్నరప్‌ (నీటి పరిరక్షణకు సంకేతం), మిస్‌ ఎర్త్‌ ఫైర్‌.. మూడవ రన్నరప్‌ (శక్తి, చైతన్యానికి సంకేతం) ప్రీతి ముండే మిస్‌ ఎర్త్‌ వాటర్‌ విభాగంలో విజేతగా నిలిచింది.. 

మిస్‌ కాంజెనియాలిటీ కూడా...
ప్రీతి ఇదే పోటీల్లో మిస్‌ కాంజెనియాలిటీ అనే అవార్డును కూడా కైవసం చేసుకుంది.. అందాల పోటీల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక ప్రత్యేకమైన ఈ సబ్‌–టైటిల్‌ను స్నేహపూర్వక ప్రవర్తన, మంచి వ్యక్తిత్వం ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనిని కొన్ని పోటీల్లో మిస్‌ ఫ్రెండ్‌షిప్‌’ అని కూడా పిలుస్తారు.

పల్లెటూరి నుంచి
పల్లెటూరి వాతావరణంలో పెరిగిన ప్రీతి చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, శ్రమకోర్చే తత్వాన్ని అలవాటు చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ యూనివర్సిటీలో యోగా విభాగంలో మాస్టర్స్‌ అభ్యసిస్తూనే యోగా ట్రెయినర్‌గా ప్రయాణం సాగిస్తున్నారు.. చిన్నప్పటి నుంచే యోగాపై మక్కువ పెంచుకున్న ఆమె, జాతీయ స్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌కు ఎంపికై తన శారీరక, మానసిక దారుఢ్యాన్ని నిరూపించుకున్నారు. బాల్యం నుంచి మోడలింగ్‌ రంగంపై ఆసక్తితో ఉన్న ప్రీతి అనుకున్నది సాధించింది.. 2023లో మిస్‌ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మిస్‌ ఊర్వశి పోటీల్లో గెలుపొందారు.

నా కల సాకారం వైపు..
కలలు కనడమే కాదు.. సాకారం చేసుకోవడం కూడా ముఖ్యం.. మా అమ్మా నాన్న, కుటుంబ సభ్యులు ఇచ్చిన స్ఫూర్తితో నేను ఇవి సాధించగలుగుతున్నాను.. ఫిలిప్పీన్స్‌ లో జరగబోయే ‘మిస్‌ ఎర్త్‌’ అంతర్జాతీయ పోటీల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నాను.
– ప్రీతి ముండే 

– గొడిసెల కృష్ణకాంత్‌ గౌడ్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement