అద్భుతమైన అనుభవం!
ఒక బిడ్డకు తండ్రి కావడం తన జీవితంలో అత్యంత గొప్ప అనుభవమని చెబుతుంటారు విరాట్ కోహ్లి. కూతురు వమికతో భావోద్వేగ బంధం, ఆమె అల్లరితో రోజువారి జీవితంలో వచ్చే మార్పు తను, అనుష్క మునుపెన్నడూ చూడలేదని అంటారు కోహ్లి. వమికకు ఆటలపై ఆసక్తి కలిగిందని ఒకింత గర్వంగా చెబుతుంటారు క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడుకోవడాన్ని వమిక ఆస్వాదిస్తుందని ఆనందంగా చెబుతారు. ‘ఒకవేళ వమిక క్రికెటర్ కావాలనుకుంటే, స్ఫూర్తి పొందేందుకు ఆమెకు స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్‌వంటి వారు’ ఉన్నారు అంటారు కోహ్లి. ‘ఆటలు మాత్రమే ఆడాలని లేదు. భవిష్యత్‌లో తన కెరీర్ మార్గాన్ని ఎంచుకోవడానికి ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది’ అని నొక్కి చెబుతున్నారు కోహ్లి.
మా అమ్మాయి లీడర్
‘వి ద విమెన్’ పేరుతో జరిగిన చర్చా కార్యక్రమంలో తన కూతురు అనన్య గురించి ప్రస్తావించి ప్రశంసించారు పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా. నాలుగేళ్ల వయసులోనే ఆమెలో నాయకత్వ లక్షణాలను గుర్తించినట్లు చెప్పారు. ‘ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తుంది. నూటికి నూరు శాతం కష్టపడుతుంది. సమస్యలను వేగంగా పరిష్కరించడంలో ముందుంటుంది’ అని అనన్య గురించి చెబుతుంటారు కుమార మంగళం బిర్లా. నేర్చుకోవాలనే నిరంతర తపనే అనన్యను ప్రత్యేకంగా నిలబెట్టింది. ‘ఘనమైన కుటుంబ పేరును వారసత్వంగా పొందినప్పటికీ కష్టపడి పనిచేయాలి. విలువలతో కూడిన జీవనశైలిని నిర్మించుకోవాలి. ఈ విషయంలో అనన్యను ప్రశంసిస్తున్నాను. ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా తన దారి ఏర్పాటు చేసుకోవడం గురించి ఆలోచిస్తుంది. సొంతంగా మైక్రోఫిన్‌ను స్థాపించి తానేమిటో నిరూపించుకుంది’ అంటారు మురిపెంగా కుమార మంగళం.
ఆరాధ్య... చిన్నప్పటి ఐశ్వర్య!
‘ఆరాధ్య నా సర్వస్వం’ అని కూతురు గురించి చెబుతుంటారు ఐశ్వర్యరాయ్. ఆరాధ్యలో తన చిన్ననాటి లక్షణాలు, ప్రవర్తన, హావభావాలు కనిపించడం ఐశ్వర్యకు సంతోషం కలిగించే విషయం. జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలలో కూతురుని తనతో పాటు తీసుకువెళుతుంటారు. తల్లీకూతుళ్ల మధ్య ఉన్న పోలికలు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణ. ఆరాధ్య ను తల్లితో పోలుస్తూ ‘మిర్రర్ ఇమేజ్’ అని,‘చిన్ననాటి ఐశ్వర్యకు కార్బన్ కాపీ’ అని అభివర్ణిస్తుంటారు నెటిజనులు. ఐశ్వర్యకు సంబంధించి అరుదైన టీనేజ్, చిన్ననాటి ఫొటోలు ఆన్‌లైన్‌లో కనిపించినప్పుడు, వాటి పక్కన ఆరాధ్య ఫొటోను జత చేస్తూ పోలికలను విశ్లేషిస్తుంటారు. ‘ఇంట్లో ఆరాధ్య ఎప్పుడూ డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు నా పాటలకు, కొన్నిసార్లు తండ్రి, తాతల పాటలకు డ్యాన్స్ చేస్తుంది. ఆరాధ్యకు సంబంధించి పనులన్నీ నేనే స్వయంగా చేసుకోవడానికి ఇష్టపడతాను’ అంటారు ఐశ్వర్యరాయ్.
డాటర్ ఆఫ్ దళపతి
తమిళనాడు ముఖ్యమంత్రి ‘దళపతి’ విజయ్ ముద్దుల కూతురు దివ్య సాషా. చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకున్న దివ్య బాడ్మింటన్‌లాంటి ఆటలు బాగా ఆడుతుంది. తన చిన్నతనంలో తండ్రి నటించిన ‘తేరి’ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది దివ్య. ఆ తరువాత సినీపరిశ్రమకు దూరంగా ఉంది. కూతురుతో కనిపించిన ఫొటోలు విజయ్ అభిమానులను కనువిందు చేస్తుంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం... తన సినిమా లైవ్ షోలో దివ్య సాషాతో విజయ్ ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుతున్న చిట్టి పొట్టి వీడియో ఇప్పటికీ ఎక్కడో ఒక చోట సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. తన తండ్రి పార్టీ ‘టీవికె’కు సపోర్ట్ చేస్తూ దివ్య సాషా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందనే వార్త వైరల్ అయింది. తండ్రి గురించి కూతురు, కూతురు గురించి తండ్రి మాట్లాడిన దృశ్యాలు పెద్దగా కనిపించనప్పటికీ చంటిపిల్లగా ఉన్న కూతురును ఎత్తుకోవడం నుంచి మొదలు నిన్నా మొన్నటి వరకు....తండ్రీకూతుళ్ల ఫొటోలు వైరల్ అవుతూ... వారి అనుబంధాన్ని నిశ్శబ్దంగా చెబుతుంటాయి.


