పిల్లలు చదువుకోవడానికి కూర్చున్న కాసేపటికే ఫోన్ చేతిలోకి తీసుకోవడం.. తల్లిదండ్రులకు తరచూ ఎదురయ్యే సమస్య. ఇంట్లో పెద్దలు లేని సమయంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమస్యనే ఓ 13 ఏళ్ల బాలిక వినూత్న ఆలోచనగా మార్చుకుంది. కోడింగ్ గురించి పెద్దగా తెలియకపోయినా.. ఏఐ సాయంతో పిల్లల చదువుపై ఓ కన్నేసి ఉంచే ‘డిజిటల్ పేరెంట్’ యాప్‌ను రూపొందించింది. మూడు రోజుల్లోనే 90 మంది ఈ యాప్‌ను కొనుగోలు చేయడంతో దాదాపు రూ.2.2 లక్షల అమ్మకాలు సాధించింది.
చైనాలోని షాంఘైకి చెందిన జు షుహాన్ ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆగస్టు 21 నుంచి 23 వరకు హాంగ్జౌలో జరిగిన జాతీయ ఏఐ ప్రొడక్ట్ మార్కెటింగ్ పోటీలో ఆమె రూపొందించిన యాప్‌ను ప్రదర్శించింది. 50 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలో మూడు రోజుల్లో 18,000 యువాన్ల అమ్మకాలు సాధించి మూడో స్థానంలో నిలిచింది. దీంతో అదనంగా 5,000 యువాన్ల నగదు బహుమతి కూడా అందుకుంది.
పిల్లలపై ఓ కన్నేసి ఉంచేలా..
‘డిజిటల్ పేరెంట్’గా పనిచేసే ఈ యాప్‌లో ముందుగా తల్లిదండ్రుల ఫొటో, గొంతును జోడించాలి. పిల్లలు చదువుతున్నప్పుడు కెమెరా ద్వారా వారి కదలికలను యాప్ గమనిస్తుంది. చదువును పక్కనపెట్టి ఫోన్ చూడటం, సీటు నుంచి లేచి వెళ్లడం వంటివి చేస్తే.. తల్లిదండ్రుల గొంతుతోనే హెచ్చరిస్తుంది. చదువు పూర్తయ్యాక పిల్లలు ఎంతసేపు ఏకాగ్రతతో చదివారో తెలిపే ‘కాన్సంట్రేషన్ రిపోర్ట్’ను కూడా అందిస్తుంది.
తన సమస్య నుంచే ఆలోచన..
తల్లిదండ్రులు ఉద్యోగాల కారణంగా ఇంట్లో లేని సమయంలో తాను కూడా చదువు మధ్యలో ఫోన్ చూసేదానినని షుహాన్ తెలిపింది. తన స్నేహితులు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నట్లు గుర్తించి ఈ యాప్ తయారు చేసినట్లు చెప్పింది. కోడింగ్ రాకపోయినా.. తన ఆలోచనను ఏఐకి సాధారణ భాషలో వివరించి, ఏఐ ప్రోగ్రామింగ్ టూల్స్ సాయంతో కేవలం మూడు, నాలుగు రోజుల్లోనే యాప్‌ను సిద్ధం చేసింది.
తొలుత తన తమ్ముడిపైనే యాప్‌ను పరీక్షించింది. పిల్లలు చేసిన ప్రతి తప్పునూ తల్లిదండ్రులకు చెప్పడం కంటే.. తమను తాము మార్చుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని ఫీచర్లను తొలగించింది. ప్రస్తుతం యాప్ ధరను తగ్గించి మరింత మంది పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని షుహాన్ భావిస్తోంది.
ఇదీ చదవండి: బొటిక్ వ్యాపారం చేస్తున్న మాజీ ఐఏఎఫ్ అధికారిణి!


