ఖైరతాబాద్‌ మహాగణపతి తరలింపు.. రూట్‌ ఇదే! | Khairatabad Ganesh Immersion Route Timings-2026 | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌ మహాగణపతి తరలింపు.. రూట్‌ ఇదే!

Sep 25 2026 8:00 AM | Updated on Sep 25 2026 8:00 AM

Khairatabad Ganesh Immersion Route Timings-2026

విగ్రహాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు  

రోడ్డు నుంచి మెట్రో, ఎఫ్‌ఓబీ, ఆర్‌ఓబీల హైట్‌ నమోదు

అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు మాత్రమే అటు అనుమతి

బోర్డులు ఏర్పాటు, మండప నిర్వాహకులతో పోలీసుల సమన్వయం

సాక్షి హైదరాబాద్‌: నిమజ్జనోత్సవంలో అత్యంత ప్రత్యేకత కలిగిన ఖైరతాబాద్‌ మహాగణపతి తరలింపునకు గురువారం రోజంతా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటలకే ఖైరతాబాద్‌ గణపతి శోభాయాత్ర ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు గురువారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలు నిలిపివేసి..ఉదయం 8 గంటలకు షెడ్‌ తొలగింపు చేపట్టారు.

సాయంత్రం షెడ్డు పనులు పూర్తికాగానే భారీ హైడ్రాలిక్‌ క్రేన్‌ సాయంతో మహాగణపతికి ఇరువైపులా ఉన్న విగ్రహాలను ట్రాయిలర్‌ వాహనంపైకి చేర్చారు. రాత్రి 8 గంటలకు కలశ పూజ నిర్వహించి, 9 గంటలకు చివరగా మహా హారతి ఇచ్చారు. 10 గంటల నుంచి మహాగణపతిని క్రేన్‌ సాయంతో ట్రాయిలర్‌పైకి చేర్చే పనులు ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.  ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఖైరతాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు.

రూట్‌ మ్యాప్‌ ఇలా.. 
ఖైరతాబాద్‌ లైబ్రరీ చౌరస్తా నుంచి శోభాయాత్ర ప్రారంభమై, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్, ఎక్బాల్‌ మినార్‌ చౌరస్తా, తెలంగాణ తల్లి చౌరస్తా, సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌లో క్రేన్‌ నెం.4 వద్దకు చేరుకుంటుంది. గతేడాది  మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిమజ్జనం కాగా.. ఈసారి ఇంకా ముందుగానే పూర్తి చేయనున్నారు 

ఎత్తు మేరకే మార్గం..
సామూహిక నిమజ్జనం, ప్రధాన ఊరేగింపు నేపథ్యంలో శుక్రవారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు నిర్వాహకులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రతి విగ్రహం వద్దా ఉండే సిబ్బంది వీటి అమలును పర్యవేక్షిస్తారు. విగ్రహాల ఎత్తును బట్టి అవి ప్రయాణించాల్సిన మార్గాలను నిర్దేశిస్తున్నారు. ఈ సమాచారాన్ని ఆయా వంతెనల వద్ద ఏర్పాటు చేడయంతో పాటు మండప నిర్వాహకులకు అందిస్తున్నారు.

  • నిమజ్జనం కోసం విగ్రహాలను తరలించే వాహనాలు ఫిట్‌గా ఉండాలి.

  • స్థానిక పోలీసులు జారీ చేసిన క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్టిక్కర్‌ను వాహనం ముందు వైపు అతికించాలి.

  • విగ్రహాల ఊరేగింపులో వాహనాలను ఎలాంటి లౌడ్‌ స్పీకర్లు, డీజేలు వినియోగించరాదు.

  • ఈ వాహనాల్లో కర్రలు, కత్తులు, మందు గుండు సామాగ్రి సహా ఎలాంటి నిషేధిత వస్తువులు తీసుకెళ్ళరాదు.

  • ఊరేగింపు సమయంలో మండపాలు, రోడ్లపై బాణసంచా కాల్చకూడదు.

  • ఆద్యంతం చిత్రీకరించడానికి  ప్రతి వాహనానికో వీడియో కెమెరా సమకూర్చుకోవాలి.

  • ఆలస్యంగా వచ్చిన విగ్రహాలను పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లోకి పంపిస్తారు. సాధారణ ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా, ఆ మరునాడు జంక్షన్లు మూసివేయకుండా నిర్ణయం తీసుకున్నారు.

వీటిని గమనించండి...
నిమజ్జనం కోసం విగ్రహాలకు తీసుకువచ్చే లారీ ఫ్లైఓవర్లు, మెట్రో రైల్‌ మార్గం కింద ఇరుక్కుంటే తీవ్ర ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడుతుంది. ఫలితంగా నిమజ్జనం ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు సాధారణ వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు సిటీ వ్యాప్తంగా ఉన్న ఫ్లైఓవర్లు, మెట్రో రైల్‌ మార్గం వంతెలతో పాటు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌ల ఎత్తుల్ని కొలిచారు.

వీటిని సూచిస్తూ, ఎంత వరకు ఎత్తు ఉన్న విగ్రహాలు ఆ మార్గంలో వెళ్ళాలనేది సూచిస్తూ ఎక్కడిక్కడ సూచికలు ఏర్పాటు చేశారు. నిర్వాహకులతో పాటు లారీ డ్రైవర్లు వీటిని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నారు.

అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మద్యం విక్రయాలు నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నగర వ్యాప్తంగా శుక్రవారం మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని, మద్యం విక్రయాలు జరగకూడదని కమిషనర్లు స్పష్టం చేశారు. స్టార్‌హోటళ్లు, రిజిస్టర్డ్‌ క్లబ్బులకు మినహాయింపునిచ్చారు.

ఇదీ చదవండి: ఆలస్యమైనా సమయానికే పూర్తి చేస్తాం: సీపీ సజ్జనార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement