వీఎన్‌ఆర్ వీఎస్‌జేఐఈటీ పరిశోధకుల కొత్త ప్రయత్నం
రొమ్ము, చర్మ కణజాలాల్లో అసాధారణ మార్పులు గుర్తించేలా పరిశోధన
సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌ను తొలిదశలోనే గుర్తించే దిశగా సాంకేతిక పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (వీఎన్‌ఆర్ వీఎస్‌జేఐఈటీ) పరిశోధకులు మైక్రోవేవ్ ఆధారిత కొత్త సాంకేతికతపై పరిశోధన చేస్తున్నారు. రొమ్ము, చర్మ కణజాలాల్లో సాధారణ కణజాలానికి భిన్నంగా ఉండే మార్పులను శరీరంలోకి ఎలాంటి పరికరాన్ని చొప్పించకుండా గుర్తించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికతకు సంబంధించిన పేటెంట్ ఇప్పటికే లభించింది.
కణజాల లక్షణాల ఆధారంగా గుర్తింపు
పరిశోధకులు ప్రత్యేకంగా రూపొందించిన మైక్రోస్ట్రిప్ ప్యాచ్ యాంటెన్నా ద్వారా జీవ కణజాలంపై విద్యుదయస్కాంత తరంగాలను ప్రసారం చేసే విధానాన్ని ప్రస్తుతం కంప్యూటర్ ఆధారిత సిమ్యులేషన్ నమూనాలో పరిశీలిస్తున్నారు. ఆరోగ్యకరమైన, అసాధారణ కణజాలాలకు విద్యుదయస్కాంత లక్షణాలు భిన్నంగా ఉండొచ్చన్న అంశం దీనికి ప్రాతిపదిక. తరంగాలు కణజాలాన్ని తాకినప్పుడు కొంత శక్తి శోషణకు గురవుతుంది. మరికొంత భాగం చెల్లాచెదురవుతుండగా.. కొంత శక్తి తిరిగి యాంటెన్నా వైపు ప్రతిఫలిస్తుంది.
ఈ ప్రతిఫలిత సంకేతాల్లో వచ్చే మార్పులను విశ్లేíÙంచడం ద్వారా సాధారణ కణజాలానికి, అసాధారణ లేదా సంభావ్యంగా కేన్సర్ ప్రభావిత కణజాలానికి మధ్య తేడాలను గుర్తించే అవకాశాలను పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిశోధనను డాక్టర్ కె. విద్యాసాగర్, ఆర్. రామ్‌ప్రసాద్, డాక్టర్ కె. విజయ్‌చంద్ర, పొపూరి సురేశ్‌బాబు, డాక్టర్ డి. మంజు, జి. లక్ష్మీనారాయణల బృందం చేపట్టింది. అయితే ఇది ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది. తదుపరి దశలో నమూనా తయారీ, పరీక్షలు, వైద్యపరమైన
ధ్రువీకరణ చేపట్టాల్సి ఉంది. ఈ సందర్భంగా ప్రధాన పరిశోధకుడు, వీఎన్‌ఆర్ వీఎస్‌జేఐఈటీ ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కె.
విద్యాసాగర్ మాట్లాడుతూ ‘మైక్రోవేవ్
ఆధారిత సెన్సింగ్ ద్వారా భవిష్యత్తులో కణజాల అసాధారణతలను సులభంగా, శరీరంలోకి ఎలాంటి పరికరాన్ని చొప్పించకుండా గుర్తించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం’అని అన్నారు.


