పరిశ్రమే పాఠం | Telangana Higher Education Chairmen Bala Kishta Reddy interview with Sakshi | Sakshi
Sakshi News home page

పరిశ్రమే పాఠం

Sep 25 2026 5:58 AM | Updated on Sep 25 2026 5:58 AM

Telangana Higher Education Chairmen Bala Kishta Reddy interview with Sakshi

అకాడమీ–ఇండస్ట్రీ మధ్య అంతరాన్ని తగ్గిచేందుకు ‘రీచ్‌’

అవసరాలకు తగ్గట్టుగా సిలబస్‌లో మార్పులు 

3న భారీ ఎత్తున జరిగే ‘రీచ్‌’కార్యక్రమంలో విస్తృత స్థాయి మేధోమథనం 

40 వర్సిటీలు.. 40 పరిశోధన కేంద్రాలు.. 20 టీ హబ్‌లు 

ఉన్నత విద్య నాణ్యతకు సరికొత్త అడుగులు

‘రీచ్‌’ ఏర్పాట్లపై ‘సాక్షి’ఇంటర్వ్యూలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొ. బాల కిష్టారెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: సమాజాన్ని చదివినప్పుడే యువతకు ఉపాధి మార్గం సుగమం అవుతుంది. పరిశ్రమతో అనుబంధం పెరిగితేనే సంబంధం బలపడుతుంది. ఇది జరగాలంటే పరిశ్రమ–విద్యార్థి జీవితానికి వారధి అవసరం. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇదే సరైన మార్గం. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పలు అధ్యయనాల్లో ఇదే విషయం వెల్లడైంది. 

దీని ఆధారంగానే రీసెర్చ్‌ ఎడ్యుకేషన్‌ అడ్వాన్స్‌మెంట్‌ కంక్లేవ్‌ ఇన్‌ హైదరాబాద్‌ (రీచ్‌) పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 3న జేఎన్‌టీయూహెచ్‌లో భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపడుతున్నారు. దేశంలోనే ఇది తొలి ప్రయోగం అంటున్న మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాల కిష్టారెడ్డి ‘సాక్షి’కి ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘రీచ్‌’కార్యక్రమం ఉద్దేశాలను వెల్లడించారు. 

ఏమిటీ ‘రీచ్‌’? 
పాలమూరులో పరిశ్రమలున్నాయి. అదే జిల్లాలో నిరుద్యోగులూ ఉన్నారు. పరిశ్రమల్లో పనిచేసే నైపుణ్యం వారికి ఉండటం లేదు. ఇది అకాడమీ–పరిశ్రమకు మధ్య అంతరాన్ని చెబుతోంది. దీన్ని తగ్గించడానికే రీసెర్చ్‌ ఎడ్యుకేషన్‌ అడ్వాన్స్‌మెంట్‌ కంక్లేవ్‌ ఇన్‌ హైదరాబాద్‌ (రీచ్‌) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పరిశ్రమలకు ఏం కావాలి? ఎలాంటి పరిశోధనలు జరగాలి? ఎలాంటి విద్యా బోధన ఉండాలి? పరిశ్రమల అనుభవమే పాఠాలుగా మార్చడం ఎలా? వీటిని క్షుణ్ణంగా తెలుసుకోవడమే రీచ్‌ ఉద్దేశం. 

ఎవరు పాల్గొంటారు? 
ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 40 విశ్వవిద్యాలయాలు... మరో 40 పరిశోధన సంస్థలు... 20 వరకూ తెలంగాణ హబ్‌లకు ఆహ్వానాలు పంపాం. డీఆర్‌డీవో, బీడీఎల్, సీసీఎంబీ, భారత్‌ బయోటెక్, శాంత బయోటెక్‌ వంటి సంస్థలనూ ఆహ్వానించాం. డిగ్రీ నుంచి పీజీ వరకూ, సాంకేతిక కోర్సులు సహా... వాటి స్వరూపం ఎలా ఉండాలనే దానిపై స్పష్టమైన అభిప్రాయాలు వెల్లడిస్తారు. విదేశీ సంస్థలతో ఎంవోయూలు చేసుకునే కన్నా, మనకు దగ్గరలో ఉన్న సంస్థల భాగస్వామ్యం విద్య నాణ్యతను పెంచుతుంది. ఉపాధి అవకాశాలను రెట్టింపు చేస్తుంది. ఈ తరహా విజన్‌ ఉంటే, విద్యారంగంలో పెట్టుబడులు తేవడం సులభమవుతుంది.  

ఎవరేం చేస్తారు? 
భిన్నాభిప్రాయాలు సరికొత్త మార్పు తెస్తాయి. వర్సిటీలు మాత్రమే ప్రస్తుతం కోర్సుల సిలబస్‌ను రూపొందిస్తున్నాయి. ఇది పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు ఉండటం లేదు. ఇందులో పరిశ్రమల అనుభవాన్ని తీసుకుంటే సిలబస్‌ మారుతుంది. అకాడమీ–ఇండస్ట్రీ మధ్య సంబంధం పెరిగితే ఇంటర్న్‌íÙప్‌ సాధ్యం. ఇది నైపుణ్యాన్ని పెంచుతుంది. కొన్ని కొత్త కోర్సులకు నిపుణులైన అధ్యాపకుల కొరత ఉంది.

పారిశ్రామిక రంగంలోని నిపుణులే అధ్యాపకులుగా తీసుకునే ప్రయత్నం కూడా రీచ్‌లో భాగం. ఈ తరహా మేధోమథనం ఈ కార్యక్రమంలో జరుగుతుంది. పరిశోధన సంస్థల భాగస్వామ్యం ఉన్నత విద్యలో నాణ్యమైన అనుభవ పూర్వక పరిశోధనలకు ఆస్కారం ఉంది. హైదరాబాద్‌ సంస్థల భాగస్వామ్యంతోనే భారత్‌లో ఎక్కడా లేని సరికొత్త కోర్సులు తేవడానికి ఇది దోహదపడుతుంది. 

ఏ తరహా అంతరాలున్నాయి? 
భారత్‌లో నాలుగు వేల కాలేజీలున్నాయి. తెలంగాణలో 400 వరకూ ఉన్నాయి. వీటిలో ఎన్ని కాలేజీలు డిమాండ్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఉదాహరణకు యానిమేషన్‌ రంగంలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఇందుకు తగ్గ కోర్సులు కాలేజీల్లో లేవు. మెరైన్‌ రంగం భారీగా విస్తరిస్తోంది. అవసరమైన నైపుణ్యంతో కూడిన కోర్సులు లేవు. ఈ రంగాల్లో పనిచేసేందుకు మానవ వనరులు ఎక్కడ్నుంచీ వస్తాయి. ఉపాధి ఎక్కువ... వనరులు తక్కువ ఉన్న కోర్సుల అంతరం పూడ్చడానికి రీచ్‌ సహకరిస్తుంది.  

చర్చలో కీలకాంశాలేంటి? 
రీచ్‌కు వచ్చే సంస్థల నుంచి అనేక అంశాలపై నివేదికలు కోరాం. విద్యా సంస్థలను బలోపేతం చేయడం, వాటి అవసరాలు ఏమిటి? ఇప్పటి వరకూ ఉన్న విధానాలు.. వాటి వల్ల జరిగేదేమిటి? ఏ సంస్థ నుంచి ఎలాంటి స్కిల్‌ పొందే వీలుంది? అకాడమీ– ఇండస్ట్రీ సమన్వయంతో పరిశోధన బలోపేతం ఎంత వరకూ సాధ్యం? ఎమర్జింగ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఏరియాలు ఏమిటి? స్కిల్‌ ట్రైనింగ్, పరిశోధనలకు నిధుల సమీకరణ ఇలా అనేక అంశాలపై ఆయా సంస్థలు నివేదికలు ఇస్తాయి. వీటిని క్రోడీకరించి విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందిస్తాం. వీలైనంత త్వరగా వీటిని కార్యాచరణలోకి తెచ్చే ప్రయత్నం చేయాలన్నది ఆలోచన.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement