సుప్రీం తీర్పు రాహుల్, రేవంత్‌కు చెంపపెట్టు: కేటీఆర్
పార్టీ ఫిరాయింపులకు గట్టి ఎదురుదెబ్బ
ఖైరతాబాద్ ప్రజలు త్వరలో తమ తీర్పు చెబుతారు
సాక్షి, హైదరాబాద్: దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాందీ, సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు వంటిదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ఒక వికెట్ పడిందని, ఇక ముందు మరిన్ని వికెట్లు పడనున్నాయని గురువారం నాడిక్కడ అన్నారు. పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పును మార్చేయవచ్చని భావించిన వారికి సుప్రీంకోర్టు తీర్పు గట్టి సమాధానమని పేర్కొన్నారు.
దానం అనర్హత నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని, హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సమర్థిస్తూ స్పష్టమైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఫిరాయింపుదారులను స్పీకర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కాపాడుకోవచ్చని కాంగ్రెస్ నాయకత్వం భావించిందని విమర్శించారు. ఖైరతాబాద్ ప్రజలు త్వరలో తమ తీర్పును ఇవ్వబోతున్నారని, మూడు సంవత్సరాల మోసం, విఫలమైన హామీలు, మాట తప్పిన తీరుపై ప్రజలు తీర్పు చెప్పనున్నారని అన్నారు.
తెలంగాణలో కేసీఆఆర్ వర్సెస్ అందరూ..
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నది ‘కేసీఆర్ వర్సెస్ అందరూ’పోరాటమని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు అనైతిక, అక్రమ, బహిరంగంగా ప్రకటించని కుమ్మక్కుకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఇప్పుడు ఆ కుమ్మక్కులోకి ఎన్నికల సంఘం కూడా చేరుతున్నట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపు, తొలగించిన ఓట్లను తిరిగి చేర్చే అంశాల్లో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. తెలంగాణలో అత్యధిక ఓట్ల తొలగింపులు బీఆర్‌ఎస్ గెలిచిన స్థానాల్లోనే ఉండటం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. దీనిపై బీఆర్‌ఎస్ న్యాయస్థానాల్లోనూ, ప్రజల మధ్యా పోరాడుతుందని స్పష్టం చేశారు. ‘తెలంగాణలో ఒకే ఒక్క ‘సార్’ఉన్నారు.. అది కేసీఆర్ సార్. ప్రజలకు ఆయనపై ఉన్న ప్రేమను ఏ ‘ఎస్‌ఐఆర్’కూడా ఓడించలేదు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


