14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు | Rats bite 14 students in Palakurthi Girls Gurukul School | Sakshi
Sakshi News home page

14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

Sep 25 2026 5:25 AM | Updated on Sep 25 2026 5:27 AM

Rats bite 14 students in Palakurthi Girls Gurukul School

పాలకుర్తి బాలికల గురుకుల పాఠశాలలో ఘటన

పాలకుర్తి టౌన్‌: గురుకులంలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో మంగళవారం రాత్రి జరగ్గా, ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ పాఠశాలలో 8, 9, 10 తరగతులకు చెందిన 14 మంది విద్యార్థినులు మంగళవారం రాత్రి భోజనం చేసి వసతి గృహంలో నిద్రపోయారు. నిద్రలో ఉండగా వారి చేతులు, కాళ్లను ఏవో కరిచినట్లు గుర్తించారు. నిద్ర నుంచి లేచి చట్టుపక్కలా పరిశీలించగా ఎలుకలు కనిపించాయి. దీంతో విద్యార్థినులు బుధవారం ఉదయం ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ వరలక్ష్మికి తెలిపారు. 

ప్రిన్సిపాల్‌ ఆ విషయాన్ని పాఠశాలలో ఉన్న ఏఎన్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆమె విద్యార్థినులతో మాట్లాడి వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. 14 మంది విద్యార్థినులకు వైద్యపరీక్షలు చేసి యాంటీరేబిస్, టీటీ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ సూపరింటెండెంట్‌ వనం శ్రీనివాస్‌ తెలిపారు. 

కాగా, పాఠశాలలో పారిశుద్ధ్య సమస్య ఉందని, పరిష్కరించాలని ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ వరలక్ష్మి స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓలకు లేఖ రాసినట్లు సమాచారం. బాలికల గురుకుల పాఠశాల పరిసరాల్లో చెత్త పేరుకుపోవడం, మురుగునీరు కాలువలు, ముళ్లపొదలు పెరగడం వల్ల ఎలుకలు, ఇతర విషకీటకాలు పెరుగుతున్నాయని పాఠశాల సిబ్బంది తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్టిలో ఉంచుకుని అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక చొరవ చూపాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement