వేడుకల్లో 100–110 డెసిబెల్స్ దాటుతున్న వాయిద్యాల మోత
వృద్ధుల్లో కార్డియాక్ అరెస్ట్ లేదా గుండెపోటుకు దారితీసే అవకాశాలు
చిన్నపిల్లలకు పొంచి ఉన్న శాశ్వత వినికిడి లోపాలు
అధిక శబ్ద తరంగాలతో గర్భిణులపైనా తీవ్ర ప్రభావం
డీజే శబ్దాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలంటున్న వైద్య నిపుణులు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి ఊరేగింపులు, బోనాల వేడుకలు, వినాయక నిమజ్జనాలు.. ఇలా పండుగ, పబ్బం ఏదైనా ఆ ప్రాంతమంతా డీజే వాయిద్యాల మోత మోగుతోంది. చెవులు దద్దరిల్లేలా, గుండెలు అదిరేలా బేస్ సౌండ్‌తో పాటలు పెట్టడం యువతకు ఫ్యాషన్‌గా మారిపోయింది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా రాష్ట్రమంతా ఈ ధ్వని కాలుష్య సంస్కృతి ఏటేటా విస్తరిస్తోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో డీజేల హోరు పెరిగిపోయింది. అయితే మితిమీరిన శబ్ద కాలుష్యం... చిన్నారులు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారి ఆరోగ్యంపై తీవ్ర దు్రష్పభావాన్ని చూపుతోంది. సాధారణంగా మనుషుల చెవులు 60 నుంచి 70 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని తట్టుకోగలవు. కానీ ఊరేగింపుల్లో వాడే డీజేలు 100 నుంచి 110 డెసిబెల్స్‌కుపైగా శబ్ద తీవ్రతను కలిగి ఉంటున్నాయి. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుండె బరువు.. నిద్ర కరువు..
భారీ శబ్దాల వల్ల వృద్ధులకు గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన శబ్దాల వల్ల గుండె వేగం అకస్మాత్తుగా పెరిగి హైబీపీకి దారితీస్తుందని.. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వృద్ధుల్లో కార్డియాక్ అరెస్ట్ లేదా గుండెపోటు సంభవిస్తుందని అంటున్నారు. ఇటీవల నిమజ్జన ఊరేగింపుల్లో భారీ శబ్దా ల వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘ టనలు కూడా నమోదైన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే అధిక శబ్దాలు వృద్ధుల్లో మానసిక ఆందోళన, చిరాకు, తీవ్రమైన తలనొప్పిని కలిగిస్తాయని.. వాటి ఫలితంగా నిద్రలేమి సమస్య వారిలో తీవ్రంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో డీజేల మోత వల్ల వృద్ధులకు నిద్ర కరువై, వారి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. చిన్నపిల్లలపై చూపే ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటోంది. వారిలో శాశ్వత వినికిడి లోపం తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుంది.
ఎందుకంటే.. చిన్నపిల్లల చెవి లోపలి భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. 85 డెసిబుల్స్ దాటిన శబ్దాలకు ఎక్కువ సేపు గురికావడం వల్ల వారి వినికిడి సామర్థ్యం దెబ్బతింటుంది. ఈ సమస్య తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మారవచ్చు. ముఖ్యంగా పండుగల సమయాల్లో ఈ చప్పుళ్ల వల్ల చదువుకునే విద్యార్థులు ఏకాగ్రత కోల్పోయి మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఇతర రోగాలతో బాధపడే వారిపైనా దీని ప్రభావం అధికంగా ఉంటుందని.. అధిక శబ్దాలు శరీరంలో కారి్టసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదలై రక్తంలో చక్కెర స్థాయిలు, బీపీ అకస్మాత్తుగా పెరిగిపోతాయంటున్నారు. నిమజ్జనాల్లో శబ్దాలతోపాటు దుమ్ము, ధూళి, పొగ, వల్ల అస్తమా రోగుల్లో శ్వాస ఇబ్బందులను మరింత ఎక్కువ చేస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. గర్భస్థ పిండాల ఆరోగ్యంపైనా అధిక శబ్ద తరంగాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డీజే అంటే ఏమిటి?
డీజే అంటే డిస్క్ జాకీ.. ఒకప్పుడు రికార్డులు మార్చి పాటలు వేసే వ్యక్తిని డీజే అనేవారు. ఇప్పుడు 1,000 నుంచి 5000 వాట్ల యాంప్లిఫైయర్లు, 4 నుంచి 10 పెద్ద సౌండ్ బాక్సులు, జనరేటర్లు, మిక్సర్‌లతో కూడిన భారీ సౌండ్ సిస్టమ్‌నే డీజే అంటున్నారు. ఇది సాధారణంగా 100 నుంచి 120 డెసిబుల్స్ డెసిబెల్ (డీబీ) వరకు శబ్దం చేస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
– ఊరేగింపులు ఇంటి పరిసరాల గుండా వెళ్తున్నప్పుడు కిటికీలు, తలుపులు గట్టిగా మూసి ఉంచాలి.
– పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇయర్ ప్లగ్స్ లేదా దూది చెవుల్లో పెట్టుకోవడం మంచిది.
– గుండె జబ్బులు, హైబీపీ ఉన్నవారు ఊరేగింపులు, డీజేలు ఉన్న ప్రాంతాలకు వెళ్లరాదు.
– పండుగల వేళ డీజే హోరు వల్ల వారి ఇంట్లోని వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్న వారు ఇబ్బంది పడకుండా కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పోలీసు అనుమతి లేకుంటే జైలు, జరిమానా..
మతపరమైన ఊరేగింపుల్లో డీజేలను పూర్తిగా నిషేధిస్తూ ఇప్పటీకే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. అయినా కొందరు నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వాడుతున్నారు. ఇలా అనుమతి లేకుండా డీజే పెట్టే వారిపై హైదరాబాద్ నగర పోలీసు చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదు చేసి 5 ఏళ్ల వరకు జైలు, రూ. లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. డీజే సౌండ్ సిస్టమ్ పెట్టాలన్నా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి.
‘డీజే’పేషెంట్లు బాగా పెరిగారు...
డీజేల వల్ల తలెత్తిన సమస్యలతో వచ్చే రోగుల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. తాజాగా డీజే చప్పుళ్ల బారినపడిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వినికిడి శక్తిని శాశ్వతంగా కోల్పోయే పరిస్థితి ఎదురైంది. అలాగే ఓ వేడుకలో మోగించిన డీజే కారణంగా తీవ్రమైన చెవిపోటు, వినికిడి సమస్యతో ఓ సీనియర్ సిటిజన్ మా వద్దకు వచ్చారు. పండుగలు లేదా వేడుకల సమయంలో డీజే శబ్దాలపై కచి్చతమైన నియంత్రణ ఉండాలి.
– డాక్టర్ ఎం. మోహన్‌రెడ్డి, చైర్మన్, చీఫ్ ఈఎన్‌టీ సర్జన్, నోవా ఆసుపత్రి
అతిశబ్దంతో గుండె ఆరోగ్యానికి ముప్పు
డీజేలను అధిక శబ్దంతో నిర్వహించడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అధిక శబ్దానికి ఎక్కువ సేపు గురికావడం వల్ల శరీరంలో ఒత్తిడి ప్రతిస్పందన పెరిగి హృదయ స్పందన, రక్తపోటులో తాత్కాలిక మార్పులు సంభవించవచ్చు. ఇప్పటికే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, గుండె స్పందనలో అసమానతలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
– డాక్టర్ చినుకని శివప్రసాద్
తెలంగాణ హోమియోపతిక్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, సహస్ర ఫౌండేషన్ చైర్మన్


