ఒకటి అర్థశాస్త్రం... మరొకటి భాషా, సాహిత్య శాస్త్రం. ఈ విభిన్నమైన శాస్త్రాలకు చెందిన రెండు వేర్వేరు పుస్తకాలు బుధవారం (సెప్టెంబర్ 23) హైదరాబాద్‌లో ఒకే వేదికపై, ఏకకాలంలో ఆవిష్కరణ జరుపుకొన్నాయి. ఆ పుస్తకాలు రాసిన రచయితలిద్దరూ ఆయా శాస్త్రాలలో విశ్వవిద్యాలయ ఆచార్యులు కావడం ఒక విశేషమైతే, నిజ జీవితంలో భార్యాభర్తలు కావడం మరో విశేషం. రెండు పుస్తకాలూ లాభాపేక్ష రహితంగా ప్రముఖ ప్రచురణ సంస్థ ‘ఎమెస్కో బుక్స్’ ప్రచురించినవే.
ఒకటి - హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్.సి.యు)లో అర్థశాస్త్ర ఆచార్యులుగా పనిచేసి, ‘సాక్షి’ దినపత్రికలో అనేక వ్యాసాలు రాసిన జంగా మనోహర్ రావు రాసిన ‘ప్రపంచీకరణ వీచికలు’ పుస్తకం. మరొకటి - తెలుగు విశ్వవిద్యాలయంలో నిఘంటు నిర్మాణ శాఖలో ఆచార్యులుగా పనిచేసిన అయినవోలు ఉషాదేవి ‘భాష – సాహిత్యం (వివేచన... విశ్లేషణ)’ వ్యాసాల సంపుటి.
సీనియర్ సంపాదకులు, ‘సాక్షి’ మీడియా గ్రూప్ మాజీ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ‘ప్రపంచీకరణ వీచికలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలీగఢ్ ముస్లిమ్ యూనివర్సిటీలో పీజీ చదివి, ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు)లో ఔషధ పరిశ్రమపై పీహెచ్‌డీ చేసి, బడ్జెట్ వ్యవహారాల నిపుణుడిగా పత్రికకు వ్యాసాలు రాస్తూ, వివిధ తెలుగు, ఉర్దూ టీవీ ఛానళ్ళలో విషయ నిపుణుడిగా చర్చల్లో పాల్గొంటూ వస్తున్న సుదీర్ఘ అనుభవం రచయిత ఆచార్య జంగా మనోహర్‌రావుది. జంగా మనోహర్‌రావు, మరో సీనియర్ సంపాదకులు టంకశాల అశోక్, చరిత్ర శాఖ ఆచార్యులు వకుళాభరణం రామకృష్ణ... ముగ్గురూ దాదాపు ఒకే సమయంలో ఢిల్లీలోని జె.ఎన్.యు.లో పరిశోధన సాగించినవారే! ఆ సంగతులను వక్తలు తమ మాటల్లో ప్రస్తావించారు.
ఢిల్లీలో సైతం పత్రికా రచనలో విశేష అనుభవం ఉన్న జర్నలిస్ట్ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ, జె.ఎన్.యు.కు సంబంధించి అప్పటి తన జ్ఞాపకాలను పంచుకున్నారు. మరో ప్రముఖ అర్థశాస్త్రవేత్త, హెచ్.సి.యు.లో రిటైర్డ్ ఆచార్యులు, ‘సాక్షి’ పత్రిక సంపాదకీయ పేజీ వ్యాసరచయిత డి. నరసింహారెడ్డి ‘ప్రపంచీకరణ వీచికలు’ పుస్తకాన్ని సభకు పరిచయం చేశారు. భారతదేశంలో ఆర్థిక సరళీకరణ, ఆర్థిక విషయ పరిణామాలు, దాండేకర్ వంటి ఆర్థిక శాస్త్రవేత్తల స్మృతి వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పారు. ఆ యా వ్యాసాల గురించి నరసింహారెడ్డి తన ప్రసంగంలో సవివరంగా తెలిపారు.
ఇక, ‘పిల్లలు భాష ఎలా నేర్చుకుంటార’నే సైకో – లింగ్విస్టిక్స్ అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసి, బరోడా యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ లాంటి పేరున్న విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన అయినవోలు ఉషాదేవి వ్యాసాల సంపుటి ‘భాష – సాహిత్యం (వివేచన – విశ్లేషణ)’ను ఆచార్య వకుళాభరణం రామకృష్ణ ఆవిష్కరించారు. రచయిత్రి అధ్యాపక వృత్తి జీవితాన్ని చాలా కాలం దగ్గర నుంచి చూసిన ఆయన మాట్లాడుతూ, ఆమె రచనా వైశిష్ట్యాన్ని ప్రస్తావించారు. ఢిల్లీ జె.ఎన్.యు.కు సంబంధించిన తన అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కేతన ‘ఆంధ్రభాషా భూషణం’, జాషువా ‘గబ్బిలం’, మొల్ల రామాయణం లాంటి రచనలకు వ్యాఖ్యానం రాసి, ‘ధ్వన్యనుకరణ పద నిఘంటువు’ను కూర్చిన అనుభవజ్ఞురాలు ఉషాదేవి.
‘ఎమెస్కో’ ప్రధాన సంపాదకులు డాక్టర్ డి. చంద్రశేఖరరెడ్డి తన ప్రసంగంలో ‘భాష – సాహిత్యం (వివేచన – విశ్లేషణ)’ పుస్తకాన్ని పరిచయం చేశారు. ఉషాదేవి గత రచనలు, ప్రస్తుత రచన గురించి వివరంగా తెలియజేశారు. తాజా పుస్తకంలో భాషపై 16, సాహిత్యంపై 12 వ్యాసాలు, మరో 12 విశిష్ట పుస్తక సమీక్షలు ఉన్నట్టు తెలిపారు. ప్రత్యేకించి, నేటి తెలుగు స్థితిగతుల పైన, నిఘంటువుల ద్వారా తెలియవచ్చే సామాజిక విషయాలపైన వ్యాసాలు ఈ పుస్తకంలో పొందుపరచడం విశేషమన్నారు.
హైదరాబాద్‌లోని ‘ఇఫ్లూ’లో భాషాశాస్త్ర ఆచార్యులుగా పనిచేసిన ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం రచయితలను అభినందించారు. రచయితలు జంగా మనోహర్ రావు, అయినవోలు ఉషాదేవి దంపతులు చివరగా తమ స్పందన తెలియజేశారు. అతిథులకూ, ప్రచురణకర్తకూ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వివిధ విద్యాలయాల్లో ఉన్నత పదవులు నిర్వహించిన ఆచార్య బి. శివారెడ్డి, కె. ప్రతాపరెడ్డి, పగడాల చంద్రశేఖర్, డాక్టర్ చంద్రయ్య, ఎ. పుల్లయ్య, సీనియర్ సంపాదకుడు టంకశాల అశోక్ తదితరులు ఈ పుస్తకావిష్కరణ సభకు ప్రత్యేకంగా హాజరవడం, రచయితలతో తమ ఆత్మీయతను పంచుకోవడం విశేషం.


