హైదరాబాద్: ఎనిమిదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ బారీ గుండెపోటుతో మృతిచెందాడు. గురువారం(సెప్టెంబర్ 24వ తేదీ)చర్లపల్లి జైలులో తీవ్ర అస్వస్థతకు గురైన బారీ మృత్యువాత పడ్డాడు. అస్వస్థతకు గురైన క్రమంలో అతన్ని గాంధీ హాస్పిటల్స్‌కు తరలించగా అప్పటికే గుండె పోటుకు గురై మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు.
నల్గొండలోని ప్యారసాభగ్ కాలనీకి చెందిన అబ్దుల్ బారీ.. ప్రణయ్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2025 మార్చి నెలలో నల్గొండ కోర్టు అతనితో పాటు పలువురికి జీవిత ఖైదు విధించగా, కాంట్రాక్ట్ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మకు మరణశిక్ష విధించింది.
2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ కుమార్ హత్యకు గురయ్యాడు. అమృతను ప్రణయ్ పెళ్లి చేసుకున్న క్రమంలో ఆమె తండ్రి మారుతీరావు.. ప్రణయ్‌ను హత్య చేయించినట్లు ఆరోపలున్నాయి.. పోలీస్ చార్జ్‌షీట్‌లో వివరాల ప్రకారం అబ్దుల్ కరీం, అబ్దుల్ బారీ, అస్ఘర్ అలీలు కాంట్రాక్ట్ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మ సాయంతో ప్రణయ్‌ను హత్య చేశారు. దీనికి గాను కోటి రూపాయల వరకూ డీల్ కుదిరినట్లు ఆరోపణలున్నాయి. భార్య అమృతతో కలిసి ఆసుపత్రి నుండి బయటకు వస్తున్న ప్రణయ్‌ను శర్మ వెంబడించి కత్తి దాడి చేసి హత్య చేశారు.
విచారణ జరుగుతుండగానే మారుతీరావు మృతి
ఈ కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు.. 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ పరిధిలో ఉన్న ఒక గెస్ట్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆ సమయంలో మారుతీరావు రాసిన ఒక సూసైడ్ నోట్‌ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో 2025 తీర్పు వెలువడగా బారీతో సహా ఆరుగురి నిందితులకు జీవితఖైదు పడగా కాంట్రాక్ట్ కిల్లర్ శర్మకు మరణశిక్ష పడింది. ఇదిలా ఉంచితే, గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో బారీని గతంలో అరెస్టు చేశారు; అయితే, ఆ కేసులో బారీ నిర్దోషిగా విడుదలయ్యారు.
ఇదీ చదవండి: ఐబొమ్మ రవికి ఊరట


